‘ఇండియా కూటమి నుంచి నితీశ్‌ను వెళ్లనివ్వకుండా ఉండాల్సింది!’ | Nitish Kumar Exit From INDIA Bloc Sparks Heated Exchange In CWC Meet Between Digvijaya Singh And Sonia Gandhi | Sakshi
Sakshi News home page

‘ఇండియా కూటమి నుంచి నితీశ్‌ను వెళ్లనివ్వకుండా ఉండాల్సింది!’

Sep 30 2026 11:23 AM | Updated on Sep 30 2026 11:46 AM

Nitish Kumars INDIA Exit Sparks Heated Debate at Congress CWC

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బిహార్‌ మాజీ సీఎం నితీశ్‌ కుమార్‌ 2024లో ఇండియా కూటమి నుంచి వైదొలిగిన అంశం ప్రస్తావనకు రావడంతో.. పార్టీలోని ఇద్దరు కీలక నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలుస్తోంది. దీంతో సమావేశంలో ఈ అంశంపై కొద్దిసేపు వాడివేడి చర్చ జరిగినట్లు కాంగ్రెస్‌ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది.

నితీశ్‌ కుమార్‌ను ప్రతిపక్ష ఇండియా కూటమి నుంచి వెళ్లనివ్వకుండా ఉండాల్సిందని సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ సీడబ్ల్యూసీలో వ్యాఖ్యానించారు. ఆయన ఇండియా కూటమిలోనే ఉండి ఉంటే.. ఇప్పుడు రాజకీయ పరిస్థితులు మరోలా ఉండేవని ఆయన అన్నారట. అందుకు కాంగ్రెస్‌ మాజీ అధినేత్రి సోనియా గాంధీ భిన్నంగా స్పందించినట్లు సమాచారం.  

నితీశ్‌ కూటమిలో కొనసాగాలని అప్పటికే కోరుకోవడం లేదని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. ఆయన అప్పటికే బయటకు వెళ్లేందుకు మార్గాలు వెతుకుతున్నారని, ఆయన వెళ్లడం అనివార్యమేనని సోనియా పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే దిగ్విజయ్‌తో ఆమె కాస్త అసహనంగా మాట్లాడినట్లు తెలుస్తోంది.

సోనియా గాంధీ అభిప్రాయంతో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఏకీభవించినట్లు సమాచారం. ఇండియా కూటమి కన్వీనర్‌ కావాలన్న నితీశ్‌ ప్రయత్నం వెనుక ఆయనకు వేరే రాజకీయ ఆలోచనలు ఉన్నాయని ఖర్గే అన్నారట. అంతేకాదు.. రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలంగా ఉంటూనే జాతీయ స్థాయిలో ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నట్లు  నితీశ్‌ తనతో చెప్పిన విషయాన్ని కూడా ఖర్గే గుర్తుచేసినట్లు సమాచారం.

అలా.. నితీశ్‌ యూటర్న్‌
ఇండియా కూటమి ఏర్పాటులో నితీశ్‌ ప్రారంభ దశలో కీలకంగా వ్యవహరించారు. సీట్ల పంపకంపై జాప్యం, కూటమి కన్వీనర్‌ ఎంపికపై స్పష్టత లేకపోవడం వంటి అంశాలపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే.. 2024 జనవరి 28న నితీశ్‌ కుమార్‌ బిహార్‌లోని మహాఘట్‌బంధన్‌ ప్రభుత్వానికి రాజీనామా చేసి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలోకి తిరిగి వెళ్లారు. బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత.. ఇండియా కూటమి తన అంచనాలకు అనుగుణంగా పనిచేయలేదని వ్యాఖ్యానించారు. 

ప్రస్తుతం కాంగ్రెస్‌ ఎన్నికల సంఘం, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అంశంపై పోరాటాన్ని ఉధృతం చేస్తోంది. సెప్టెంబర్‌ 29న జరిగిన CWC సమావేశంలో కాంగ్రెస్‌ సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాతో పాటు సర్‌ను నిలిపివేయాలని డిమాండ్‌ చేసింది. సర్‌ అంశంపై ఉమ్మడి వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ఇండియా కూటమి ఇవాళ ఢిల్లీలో సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో 2024లో నితీశ్‌ కూటమి నుంచి వైదొలగడం ప్రస్తావనకు రావడం, దానిపై దిగ్విజయ్‌ సింగ్‌, సోనియా గాంధీ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు వార్తలు రావడం ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి: ఇది పక్కా కుమ్మక్కే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement