శబరిమల యాత్రకు భారీ ఏర్పాట్లు.. ఈసారి అంతా హైటెక్‌! | Sabarimala 2026-27: Major Changes in Security FASTag Parking and Vedivazhipadu | Sakshi
Sakshi News home page

శబరిమల యాత్రకు భారీ ఏర్పాట్లు.. ఈసారి అంతా హైటెక్‌!

Sep 30 2026 8:44 AM | Updated on Sep 30 2026 9:05 AM

Sabarimala 2026-27: Major Changes in Security FASTag Parking and Vedivazhipadu

సాక్షి, తిరువనంతపురం: అయ్యప్ప భక్తుల కోసం ఎంతో కీలకమైన మండల–మకరవిళక్కు యాత్రా కాలం సమీపిస్తుండటంతో కేరళ ప్రభుత్వం, ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు ఏర్పాట్లను ముమ్మరం చేశాయి. భారీగా తరలివచ్చే భక్తుల రద్దీని నియంత్రించడంతో పాటు భద్రతను మరింత పటిష్టం చేయడం, నిలక్కల్‌–పంపా మార్గంలో రాకపోకలను సులభతరం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఈసారి పోలీసు బందోబస్తుతో పాటు ఏఐ ఆధారిత మానిటరింగ్‌, ఎయిర్‌పోర్ట్‌ తరహా పార్కింగ్‌ వంటి హైటెక్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు సన్నిధానంలో భక్తులు నిర్వహించే ‘వెడి వళిపాడు’పైనా కీలక మార్పు చోటుచేసుకోనుంది.

యాత్రా కాలంలో శాంతిభద్రతలు, భక్తుల రద్దీ నియంత్రణ కోసం 1,500 మంది ప్రత్యేక పోలీసు అధికారులను నియమించేందుకు కేరళ ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సమాచారం. సాధారణ పోలీసు విధులకు అంతరాయం కలగకుండా ఈ ప్రత్యేక బలగాలను వినియోగించనున్నారు. పదవీ విరమణ చేసిన పోలీసు సిబ్బంది, మాజీ సైనికులు, ఎన్‌సీసీ క్యాడెట్లను ప్రత్యేక పోలీసు అధికారులుగా నియమించే ప్రతిపాదన ఉంది. మరోవైపు 2026–27 యాత్రా సీజన్‌ కోసం సీనియర్‌ పోలీసు అధికారులకు ఇప్పటికే ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. నిలక్కల్‌, పంపా, సన్నిధానం తదితర ప్రాంతాల్లో భద్రత, రద్దీ నియంత్రణకు సమగ్ర బందోబస్తు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

నిలక్కల్‌లో పార్కింగ్‌.. ఇక ఎయిర్‌పోర్ట్‌ తరహాలో!
శబరిమల వెళ్లే భక్తులకు మరో కీలక మార్పు నిలక్కల్‌ పార్కింగ్‌లో రానుంది. ఎయిర్‌పోర్టుల్లో మాదిరిగా వాహనం పార్కింగ్‌లో ఉన్న సమయాన్ని బట్టి ఫీజు వసూలు చేసే విధానాన్ని తీసుకురానున్నారు. వాహనం పార్కింగ్‌ గ్రౌండ్‌లోకి ప్రవేశించిన సమయం కంప్యూటర్‌ వ్యవస్థలో నమోదవుతుంది. బయటకు వచ్చే సమయంలో ఎంతసేపు అక్కడ ఉన్నదో లెక్కించి.. ఆ మేరకు పార్కింగ్‌ ఫీజును నిర్ణయిస్తారు. ఎగ్జిట్‌ వద్ద ఫాస్టాగ్‌(FASTag) ద్వారా ఫీజు ఆటోమేటిక్‌గా కట్‌ అవుతుంది. ఇప్పటివరకు ప్రవేశ సమయంలోనే నిర్ణీత మొత్తాన్ని వసూలు చేసే విధానం ఉండగా.. కొత్త విధానంలో పార్కింగ్‌ చేసిన వ్యవధిని బట్టి చార్జీ మారుతుంది.

ఖాళీ స్థలాలూ.. కెమెరాల్లో కనిపిస్తాయి!
నిలక్కల్‌లో పార్కింగ్‌ నిర్వహణకు ఏఐ(AI) ఆధారిత కెమెరాలను కూడా వినియోగించనున్నారు. ప్రతి పార్కింగ్‌ గ్రౌండ్‌లో ఎన్ని వాహనాలు ఉన్నాయి? ఎక్కడ ఖాళీ ఉంది? వాహనాల రాకపోకలు ఎలా ఉన్నాయి? వంటి వివరాలను కంట్రోల్‌ రూమ్‌ నుంచి పర్యవేక్షించేలా వ్యవస్థను సిద్ధం చేస్తున్నారు. ఈ AI ఆధారిత కంట్రోల్‌ రూమ్‌ ప్రాజెక్టుకు సుమారు రూ.5 కోట్ల అంచనా వ్యయంతో కెమెరాల టెండర్‌ ప్రక్రియ కొనసాగుతోంది. 

‘వెడి వళిపాడు’పై కీలక నిర్ణయం
సన్నిధానంలో భక్తులు నిర్వహించే వెడి వళిపాడు(Vedi vazhipadu)పై ఈసారి కీలక మార్పు చోటుచేసుకోనుంది. రాబోయే శబరిమల యాత్రా కాలానికి సంబంధించి ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు జారీ చేసిన టెండర్‌లో ఈ సేవను చేర్చలేదు. భద్రతా కారణాలతో పాటు అటవీశాఖ అభ్యంతరాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పలు మలయాళ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

వెడి వళిపాడులో భక్తులు ఆలయ పరిసరాల్లో నిర్ణీత ప్రదేశంలో పటాకులు లేదంటే పేలుడు పదార్థాలను పేల్చి తమ మొక్కును చెల్లించుకుంటారు. అయితే ఇది ఆలయంలోని ప్రధాన ఆచారాల్లో భాగం కాదని తంత్రి పేర్కొన్నట్లు ఆ కథనాలు వెల్లడించాయి. మరోవైపు శబరిమల పరిసరాలు పెరియార్‌ టైగర్‌ రిజర్వ్‌ పరిధిలో ఉండటంతో.. తరచూ పేలుళ్ల శబ్దం వన్యప్రాణులకు ఇబ్బంది కలిగిస్తోందని అటవీశాఖ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఈ ఏడాది టెండర్‌లో ‘వెడి వళిపాడు’ను చేర్చకపోవడంతో.. రాబోయే యాత్రా కాలంలో ఇది కొనసాగుతుందా? లేదా? అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది.

హైవేల నుంచి ఆలయం వరకు.. భారీ ఏర్పాట్లు
భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రవాణా ఏర్పాట్లను కూడా భారీగా పెంచుతున్నారు. మండల–మకరవిళక్కు సీజన్‌లో 950 ప్రత్యేక బస్సులను నడిపేందుకు కేఎస్‌ఆర్‌టీసీ ప్రణాళిక సిద్ధం చేసింది. ముఖ్యంగా నిలక్కల్‌–పంపా మధ్య నిరంతర చైన్‌ సర్వీసులు నడిపి భక్తుల రాకపోకలను వేగవంతం చేయనున్నారు.

ఇదీ చదవండి: అత్యాధునిక డ్రోన్ల కలకలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement