పట్టపగలే.. ఆటో డ్రైవర్‌ యువతుల మధ్య ఫైట్‌ | Bengaluru Auto Driver Clashes with Women in Fare Dispute Video | Sakshi
Sakshi News home page

పట్టపగలే.. ఆటో డ్రైవర్‌ యువతుల మధ్య ఫైట్‌

Sep 29 2026 1:54 PM | Updated on Sep 29 2026 1:58 PM

Bengaluru Auto Driver Clashes with Women in Fare Dispute Video

ఆటో ఛార్జీ విషయంలో మొదలైన వివాదం రోడ్డుపైనే కొట్టుకునే వరకు వెళ్లింది. ఇద్దరు యువతులు, ఆటో డ్రైవర్‌ పరస్పరం దాడి చేసుకున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సోమవారం మధ్యాహ్నం బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్‌ లేఅవుట్‌ 3వ సెక్టార్‌లో జరిగిన ఈ ఘటనలో ముగ్గురూ ఒకరిపై ఒకరు చేతులు చేసుకున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. 

పోలీసుల వివరాల ప్రకారం.. వీడియో వైరల్‌ కావడంతో హెచ్‌ఎస్‌ఆర్‌ లేఅవుట్‌ పోలీసులు ఘటనపై ఆరా తీశారు. ఇద్దరు యువతులను సంప్రదించి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరారు. అయితే వారు వెంటనే రాకుండా ఒకటి రెండు రోజుల సమయం అడిగారు. మరోవైపు పోలీసులు ఆటో డ్రైవర్‌ను గుర్తించి అతడితోనూ మాట్లాడారు.

డ్రైవర్‌ పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం.. యువతులు అతడి ఆటోను బుక్‌ చేసుకున్నారు. ప్రయాణం పూర్తయిన తర్వాత చెల్లింపు విషయంలో గొడవ మొదలైంది. యువతులు మద్యం మత్తులో ఉన్నారని, తనను దూషిస్తూ డబ్బులు చెల్లించేందుకు నిరాకరించారని డ్రైవర్‌ ఆరోపించాడు. ముందుగా వారే తనపై దాడి చేశారని.. తాను తిరిగి కొట్టానని పోలీసులకు చెప్పాడు. అయితే యువతులు పోలీసులకు ఏం చెప్పారన్నది ఇంకా బయటకు రాలేదు.

వీడియోతో వైరల్‌.. కేసు ఎప్పుడు?
రోడ్డుపై జరిగిన గొడవను అక్కడున్న వారు మొబైల్‌ ఫోన్లలో చిత్రీకరించారు. వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో చర్యలు తీసుకోవాలంటూ పలువురు డిమాండ్‌ చేశారు. అయితే అందుబాటులో ఉన్న వీడియోలో గొడవకు ముందు ఏం జరిగిందన్నది తెలియడం లేదు. దీంతో మొదట ఎవరు దాడి చేశారన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

ప్రస్తుతం మహిళలు అధికారికంగా ఫిర్యాదు చేయలేదు. వారు ఫిర్యాదు చేసిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని హెచ్‌ఎస్‌ఆర్‌ లేఅవుట్‌ పోలీసులు తెలిపారు. దీంతో ఈ వైరల్‌ వీడియో వ్యవహారంలో తదుపరి పరిణామాలు ఫిర్యాదుపైనే ఆధారపడి ఉన్నాయి.

ఛార్జీ వివాదం.. మరోసారి చర్చ
ఈ ఘటనతో బెంగళూరులో ఆటో ఛార్జీలపై మరోసారి చర్చ మొదలైంది. నగరంలో ఆటో ఛార్జీల విషయంలో ప్రయాణికులు, డ్రైవర్ల మధ్య తరచూ వివాదాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోపై సోషల్‌ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ కేసులో పూర్తి వాస్తవాలు పోలీసుల దర్యాప్తు, ఇరువర్గాల ఫిర్యాదుల తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: నీటి కోసం ఊరిని అమ్మేస్తారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement