ఒక గ్రామం మొత్తాన్ని అమ్మకానికి పెట్టారు. ఆ ఊరిని ఎవరు కొనాలనుకున్నా.. ధర చెల్లించాల్సిన అవసరం లేదు. ఆశ్చర్యపోతున్నారా? మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో తుల్షి గ్రామస్తులు చేసిన ఈ పని వెనుక ఓ తీవ్రమైన సమస్య ఉంది. ఏళ్ల తరబడి వెంటాడుతున్న నీటి కష్టాలతో విసిగిపోయి ప్రభుత్వ దృష్టిని ఆకర్షించేందుకు వారు ఈ వినూత్న నిరసనకు దిగారు.
తుల్షి గ్రామంలో దాదాపు 7 వేల మంది నివసిస్తున్నారు. వ్యవసాయం, పశుపోషణే ప్రధాన జీవనాధారం. అయితే కొన్నేళ్లుగా గ్రామంలోని బావులు, చెరువులు ఎండిపోవడంతో తాగునీటి కోసం కూడా ట్యాంకర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది.
దగ్గర్లోనే కాలువలు, అయినా ..
తుల్షి సమీపంలోనే సీనా–మాధా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కాలువలు వెళ్తున్నాయి. అయినా ఆ నీరు తమ గ్రామానికి మాత్రం అందడం లేదని స్థానికులు చెబుతున్నారు. ప్రాజెక్టులో భాగంగా గ్రామానికి సమీపంలో సుమారు 800 మీటర్ల తవ్వకం పనులు 26 ఏళ్లుగా పూర్తికాలేదని సర్పంచ్ శరద్ మోరే తెలిపారు. ఆ పనులు పూర్తయితే తుల్షి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం నుంచి ఏళ్లుగా హామీలు వస్తున్నా పరిస్థితిలో మార్పు లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జల్ జీవన్ మిషన్ కింద పనులు చేపట్టినా.. గ్రామంలోని నీటి వనరులే ఎండిపోవడంతో ఆశించిన ప్రయోజనం కనిపించడం లేదని చెబుతున్నారు.
నిరాహార దీక్ష.. పాత్రలతో నిరసన
సమస్య పరిష్కారం కోసం గ్రామస్తులు సెప్టెంబర్ 14 నుంచి నిరాహార దీక్ష చేపట్టారు. అనంతరం మాధా తహసీల్దార్ కార్యాలయం ఎదుట పాత్రలు మోగిస్తూ ‘థాలీ నాద్’ నిరసన నిర్వహించారు. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
గ్రామంలో 14 చెరువులు, బావులు పూర్తిగా ఎండిపోయాయని స్థానికులు చెబుతున్నారు. వీటిని నీటితో నింపితే తాగునీటి సమస్యతోపాటు సాగునీటి ఇబ్బందులు కూడా కొంతవరకు తీరతాయని అంటున్నారు. ఇందుకోసం ప్రతిపాదనలు, అంచనాలు సిద్ధం చేసి అధికారులకు పలుమార్లు వినతులు సమర్పించినా ఫలితం లేదని వాపోతున్నారు.
రూ.90 లక్షలు మంజూరు.. కానీ?
తుల్షిలోని భవానీ పర్కొలేషన్ ట్యాంక్‌కు సీనా–మాధా పథకం నుంచి క్లోజ్డ్ పైప్‌లైన్ ద్వారా నీటిని తరలించేందుకు 2025–26లో రూ.90 లక్షలు మంజూరు చేసినట్లు ప్రకటించారు. ఈ పనితో గ్రామ తాగునీరు, సాగునీటి అవసరాలు తీరతాయని అధికారులు పేర్కొన్నారు. అయితే నిధులు మంజూరయ్యాయని మాత్రమే వింటున్నామని.. క్షేత్రస్థాయిలో మాత్రం పనులు కనిపించడం లేదని గ్రామస్తులు అంటున్నారు.
STORY | 'Village for Sale’: Parched hamlet's desperate plea amid water crisis in Maharashtra
Desperate for water and watching their farms and wells dry up, residents of a village in Maharashtra's Solapur district have put up a striking banner declaring "Village for Sale",… pic.twitter.com/9tTKzrEX9d— Press Trust of India (@PTI_News) September 29, 2026
ఇక నీటి కష్టాలు గ్రామ సామాజిక జీవితంపైనా ప్రభావం చూపుతున్నాయని సర్పంచ్ చెబుతున్నారు. నీటి కొరత కారణంగా వ్యవసాయం, పశుపోషణ దెబ్బతిన్నాయని.. గ్రామంలోని సుమారు 350 మంది పురుషులకు పెళ్లిళ్లు కావడం లేదని ఆయన తెలిపారు. తమ గ్రామ పరిస్థితిని చూసి ఇతర ప్రాంతాల కుటుంబాలు సంబంధాలు ఇవ్వడానికి వెనుకాడుతున్నాయని పేర్కొన్నారు.
మా కష్టాన్ని చూడండి!
తుల్షి గ్రామస్తుల ‘విలేజ్ ఫర్ సేల్’ నిరసనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. పుణెలో మీడియాతో మాట్లాడిన వ్యవసాయ మంత్రి దత్తాత్రేయ భరణే.. గ్రామానికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయం చేస్తుందని తెలిపారు. అయితే తమకు ఇక హామీలు వద్దని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసి శాశ్వతంగా నీళ్లు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ‘‘విలేజ్ ఫర్ సేల్’’ బోర్డు పెట్టడం వెనుక ఉద్దేశం ఊరిని నిజంగా అమ్మడం కాదని.. తమ నీటి కష్టాన్ని ప్రభుత్వానికి, ప్రపంచానికి తెలియజేయడమేనని సర్పంచ్ శరద్ మోరే తెలిపారు. నీళ్లు వచ్చే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ఎంత పని చేశావ్ ఏనుగా?


