అనంతపురం: తాడిపత్రిలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం కావడంతో శాంతి భద్రతలు ప్రశ్నార్థకంగా మారాయి. తాడిపత్రి ఏఎస్పీ, డీఎస్పీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐపీఎస్ అధికారి అయిన ఏఎస్పీ రోహిత్ బదిలీ తర్వాత మరొక ఐపీఎస్ అధికారిని కూటమి ప్రభుత్వం ఇంకా నియమించలేదు. దీంతో ప్రస్తుతానికి తాడిపత్రి బాధ్యతలను గుంతకల్లు డీఎస్పీ చూసుకుంటున్నారు. తాడిపత్రి నియోజకవర్గం రౌడీ మూకలు పెట్రేగిపోతున్నా, పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. తాజాగా తాడిపత్రి లో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు చెలరేగిపోయారు. వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద వాహనం ధ్వంసం చేశారు. బోలేరో వాహనంలో వచ్చి, పెద్దారెడ్డి కాన్వాయ్‌కి చెందిన ఓ వాహనం అద్దాలను జేసీ వర్గీయులు ధ్వంసం చేశారు. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
బహిరంగంగా ఇరువర్గాల దాడులు
మరోవైపు బహిరంగంగా ఇరువర్గాల మధ్య దాడుల చోటుచేసుకున్నాయి. అప్పు విషయంలో నౌషద్ - సయ్యద్ వర్గాల దాడులు జరిగాయి. కర్రలతో విచక్షణా రహితంగా దాడులు చేసుకోవడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


