దేశీయ రైల్వే రవాణా వ్యవస్థను ఆధునీకరించడం, ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడం, సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా భారతీయ రైల్వే శాఖ రూ.345 కోట్ల విలువైన కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నూతన ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ప్రాధాన్యత లభించింది.
ఆంధ్రప్రదేశ్‌కు నూతన వీక్లీ ఎక్స్‌ప్రెస్
ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల మధ్య రైలు అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తూ దక్షిణ తీర రైల్వే (సౌత్ కోస్ట్ రైల్వే) పరిధిలో మచిలీపట్నం - కర్నూలు సిటీ మధ్య కొత్త ట్రై-వీక్లీ (వారానికి మూడు రోజులు) ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీస్‌కు రైల్వే శాఖ అనుమతి ఇచ్చింది.
499 కిలోమీటర్ల మేర సాగే ఈ రైలు విజయవాడ మీదుగా నడుస్తుంది. మచిలీపట్నంలో సోమ, బుధ, శనివారాల్లో సాయంత్రం 04:55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 05:45 గంటలకు కర్నూలు సిటీ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కర్నూలు సిటీలో మంగళ, గురు, ఆదివారాల్లో ఉదయం 09:30 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 21:35 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. ఈ రైలు గుడివాడ, విజయవాడ, నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపూర్ రోడ్, గిద్దలూరు, నంద్యాల తదితర ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతుంది.
యూపీలో కవచ్ 4.0
సరుకు రవాణాలో కీలకమైన ఒడిశాలోని బార్బిల్-బోలానిఖదాన్ 6 కిలోమీటర్ల సింగిల్ లైన్ సెక్షన్‌ను రూ.122 కోట్ల అంచనా వ్యయంతో డబ్లింగ్ (రెండో ట్రాక్) చేయడానికి ఆమోదం తెలిపారు. ఇది ఇనుప ఖనిజం, పెల్లెట్ల రవాణా సామర్థ్యాన్ని ఏటా మరో 8.9 మిలియన్ టన్నులకు పెంచుతుంది.
మరోవైపు రైలు ప్రమాదాల నివారణకు ఉద్దేశించిన స్వదేశీ పరిజ్ఞానం ‘కవచ్ 4.0’ విస్తరణకు పెద్దపీట వేశారు. ఉత్తర ఈశాన్య రైల్వే పరిధిలోని వారణాసి డివిజన్‌కు చెందిన 614.75 రూట్ కిలోమీటర్లలో రూ.223 కోట్ల అంచనా వ్యయంతో ఈ సురక్షిత వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల ప్రయాణికులకు సమయం ఆదా కావడంతో పాటు సరుకు రవాణా వేగవంతమై దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు లభించనుంది.
ఇదీ చదవండి: అలర్ట్.. అక్టోబరు 1 నుంచి నిబంధనలు మార్పు


