విజయ్‌ పార్టీకి బెంగాల్‌లో ఆఫీస్‌.. షాకిచ్చిన టీవీకే! | Vijays TVK Office in Bengal Party Leadership Gives a Twist | Sakshi
Sakshi News home page

విజయ్‌ పార్టీకి బెంగాల్‌లో ఆఫీస్‌.. షాకిచ్చిన టీవీకే!

Sep 30 2026 7:27 AM | Updated on Sep 30 2026 7:30 AM

Vijays TVK Office in Bengal Party Leadership Gives a Twist

తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్‌ పార్టీ పశ్చిమ బెంగాల్‌లోకి అడుగుపెట్టిందంటూ వార్తలు వచ్చాయి. తూర్పు బర్ధమాన్‌ జిల్లాలోని ఫాగుపూర్‌లో టీవీకే పేరుతో ఓ కార్యాలయాన్ని కొందరు మద్దతుదారులు ప్రారంభించారు. దీంతో పార్టీ విస్తరణపై విజయ్‌ సీరియస్‌గా దృష్టి సారించారనే చర్చ జోరుందుకుంది. అయితే ఈ వార్తపై ఆ పార్టీ కేంద్ర నాయకత్వం ట్విస్ట్‌ ఇచ్చింది. 

సెప్టెంబర్‌ 27న ఫాగుపూర్‌లో టీవీకే పేరుతో కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్‌లోని పలువురు విజయ్‌ అభిమానులు, పార్టీ మద్దతుదారులు హాజరయ్యారు. తమను టీవీకే రాష్ట్ర సమన్వయకర్తలుగా చెప్పుకున్న కొందరు.. బెంగాల్‌లో పార్టీకి ఇప్పటికే వేలాది మంది మద్దతుదారులు ఉన్నారని తెలిపారు. తొలుత రాజకీయ కార్యక్రమాల కంటే సామాజిక సేవపై దృష్టి పెడతామని చెప్పారు. అయితే టీవీకే మాత్రం బెంగాల్‌లో తాము ఎలాంటి పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయలేదని స్పష్టం చేసింది.

తమిళనాడు నుంచే ఆదేశాలంటూ..
కార్యాలయం ప్రారంభించిన వారు.. తమిళనాడులోని పార్టీ నాయకత్వం నుంచి వచ్చిన సూచనల మేరకే కార్యాలయం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సోషల్‌ మీడియా ద్వారా పార్టీకి ప్రచారం కల్పించడం, ఆ తర్వాత బెంగాల్‌లోని వివిధ ప్రాంతాల్లో ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకోవడం తమ లక్ష్యమని చెప్పారు. విద్య, ఉపాధి అంశాలపై ప్రత్యేకంగా పనిచేస్తామని వెల్లడించారు.

ఒక్కసారిగా టీవీకే షాక్‌!
అయితే ఈ పరిణామంపై టీవీకే కేంద్ర నాయకత్వం భిన్నంగా స్పందించింది. పశ్చిమ బెంగాల్‌లో పార్టీ అధికారికంగా ఎలాంటి కార్యాలయం గానీ, సంస్థాగత శాఖ గానీ ఏర్పాటు చేయలేదని పార్టీ అధికార ప్రతినిధి సంకవి ద్యాన్నా తుహిన్‌ సామ్యూయేల్‌ స్పష్టం చేశారు. బెంగాల్‌లో జరిగిన కార్యక్రమం స్థానిక మద్దతుదారుల స్వతంత్ర ప్రయత్నం మాత్రమేనని, దానికి పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి ఎలాంటి అధికారిక అనుమతి, మద్దతు లేదా సంస్థాగత సంబంధం లేదని తెలిపారు.

ఇప్పట్లో విస్తరణ లేదట
ప్రస్తుతం టీవీకే దృష్టి పూర్తిగా తమిళనాడులోని రాజకీయ కార్యకలాపాలు, ఎన్నికల హామీల అమలు, ప్రజా కార్యక్రమాలపైనే ఉందని పార్టీ స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత విస్తరణకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రణాళిక ప్రకటించలేదని తెలిపింది. దీంతో బెంగాల్‌లో ఆఫీస్‌ ప్రారంభం పార్టీ అధికారిక విస్తరణ కాదని తేలింది.

విజయ్‌కు అక్కడా అభిమానులే..
అయితే విజయ్‌కు తమిళనాడు వెలుపల కూడా అభిమానులు, మద్దతుదారులు ఉన్నారనడానికి ఈ ఘటన మరో ఉదాహరణగా నిలిచింది. గతంలో కేరళలోనూ టీవీకే పేరుతో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు అభిమానులు ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. పార్టీ మాత్రం ప్రస్తుతం తమిళనాడుకే పరిమితమై రాజకీయంగా పనిచేస్తున్నట్లు స్పష్టం చేసింది. బెంగాల్‌లో టీవీకే పేరుతో కార్యాలయం ఏర్పడటం వెనుక స్థానిక అభిమానుల ఉత్సాహమే తప్ప.. పార్టీ అధికారిక నిర్ణయం లేదని కేంద్ర నాయకత్వం తేల్చిచెప్పింది.

ఇదీ చదవండి: ఎవరి కోసం ఇదంతా విజయ్‌?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement