మళ్లీ డీజిల్‌ అమ్మకాలపై ఆంక్షలు! | Diesel Sales Restrictions Why Industries Are Rushing to Retail Pumps | Sakshi
Sakshi News home page

మళ్లీ డీజిల్‌ అమ్మకాలపై ఆంక్షలు!

Sep 30 2026 8:57 AM | Updated on Sep 30 2026 9:03 AM

Diesel Sales Restrictions Why Industries Are Rushing to Retail Pumps

రిటైల్‌ బంకుల వైపు పరిశ్రమల పరుగులు

భారీ కొనుగోళ్లతో నిల్వలపై ఒత్తిడి

జియో–బీపీ, నయారా పరిమితులు 

ఇంధన సరఫరా, రీటైల్‌ నెట్‌ వర్క్‌లపై ఒత్తిడి నెలకొనడంతో జియో–బీపీ, నయారా సంస్థలు డీజిల్‌ అమ్మకాలపై పరిమితులు విధించాయి. రిటైల్, బల్క్‌ డీజిల్‌ ధరల మధ్య లీటరుకు రూ.40 వరకు వ్యత్యాసం ఏర్పడటంతో పారిశ్రామిక, హోల్‌సేల్‌ (బల్క్‌) వినియోగదారులు పెట్రోల్‌ బంకుల వైపు మళ్లుతున్నారు. రిటైల్‌ బంకుల్లో డీజిల్‌ చౌకగా లభిస్తుండటంతో ఫ్యాక్టరీలు, టెలికం కంపెనీలు, హోటళ్లు, మాల్స్, డేటా సెంటర్లు, ఆసుపత్రులు పెద్ద మొత్తంలో డీజిల్‌ను అక్కడి నుంచే కొనుగోలు చేస్తున్నాయి. దీంతో బంకుల్లో డీజిల్‌ నిల్వలపై ఒత్తిడి పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో జియో–బీపీ ఒక వినియోగదారుడికి రోజుకు గరిష్టంగా 50 లీటర్ల డీజిల్‌ మాత్రమే విక్రయిస్తోంది. నయారా ఎనర్జీ అవుట్‌లెట్లలో ఈ పరిమితి 70 లీటర్ల నుంచి 200 లీటర్ల వరకు ఉంది. కాగా, ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలు ఇండియన్‌ ఆయిల్‌ (ఐఓసీ), భారత్‌ పెట్రోలియం (బీపీసీఎల్‌), హిందుస్థాన్‌ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్‌) కూడా డీజిల్‌ అమ్మకాలపై పరిమితులు విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దేశంలో మొత్తం 1.04 లక్షల పెట్రోల్‌ పంపులు ఉన్నాయి. వీటిలో మెజారిటీ ప్రభుత్వ రంగ సంస్థల ఆదీనంలో ఉన్నాయి. ఐఓసీకి 43,289, బీపీసీఎల్‌కు 25,587, హెచ్‌పీసీఎల్‌కు 25,238 పెట్రోల్‌ పంపులు ఉన్నాయి. ప్రైవేట్‌ రంగంలో రష్యా మద్దతు ఉన్న నయారా ఎనర్జీకి 7,105 అవుట్‌లెట్లు, రిలయన్స్‌–బీపీ భాగస్వామ్య జియో–బీపీకి 2,227 పంపులు ఉన్నాయి.

లీటరుకు రూ.40 ధరల వ్యత్యాసం ఎందుకంటే..?

అంతర్జాతీయంగా బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర బ్యారెల్‌కు 108 డాలర్లకు పెరిగినప్పటికీ.. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచే క్రమంలో రిటైల్‌ పెట్రోల్, డీజిల్‌ ధరలు ఈ ఏడాది మే నుంచి మారలేదు. అయితే హోటళ్లు, మాల్స్, ఆసుపత్రులు, టెలికాం టవర్లు, డేటా సెంటర్లు, ఫ్యాక్టరీలు నేరుగా కంపెనీల నుంచి కొనుగోలు చేసే ‘బల్క్‌ డీజిల్‌’ ధరలు అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా పెరిగాయి. దీంతో బల్క్‌ డీజిల్‌తో పోలిస్తే సాధారణ పెట్రోల్‌ పంపుల్లో లభించే డీజిల్‌ లీటరుకు ఏకంగా రూ.40 వరకు చవకగా మారింది. ఈ ధరల వ్యత్యాసాన్ని ఆసరాగా చేసుకుని పారిశ్రామిక వినియోగదారులు తమకు అవసరమైన డీజిల్‌ను సాధారణ పెట్రోల్‌ పంపుల నుంచి ఒకేసారి 400 నుంచి 600 లీటర్ల చొప్పున కొనుగోలు చేయడం ప్రారంభించారు. దీంతో బంకులో డీజిల్‌ నిల్వలు వేగంగా తగ్గుతున్నాయి. ప్రతి బంకుకు పరిమిత నిల్వ సామర్థ్యం ఉండటంతో పాటు కొత్తగా ఇంధన సరఫరా రావడానికి కనీసం రెండు రోజులు పట్టే అవకాశం ఉంది. భారీ కొనుగోళ్ల కారణంగా నిల్వలపై ఒత్తిడి పెరగడంతో జియో–బీపీ, నయారా సంస్థలు రోజువారీ డీజిల్‌ అమ్మకాలపై పరిమితులు విధించక తప్పలేదు.

భారీ కొనుగోళ్లతో పరిమితులు

సాధారణ వాహనదారులతో పోలిస్తే బల్క్‌ వినియోగదారులు పెద్ద మొత్తంలో డీజిల్‌ కొనుగోలు చేయడంతో పెట్రోల్‌ బంకుల్లో నిల్వలు వేగంగా తగ్గుతున్నాయి. కొత్తగా ఇంధన సరఫరా రావడానికి కనీసం రెండు రోజులు పట్టే అవకాశం ఉండటంతో.. సాధారణ వాహనదారులకు ఇంధన లభ్యతలో ఇబ్బందులు తలెత్తకుండా జియో–బీపీ, నయారా కొనుగోళ్లపై పరిమితులు విధించాయి. ‘‘మా అవుట్‌లెట్లలో తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయి. అయితే పరిశ్రమలు, ఇతర రవాణాయేతర రంగాల నుంచి ఒక్కసారిగా పెరిగిన డిమాండ్‌ దృష్ట్యా.. రవాణా అవసరాలకు ఆటంకం కలగకుండా డీజిల్‌ అందరికీ సమానంగా లభించేందుకు తగిన చర్యలు తీసుకున్నాం’’ అని జియో–బీపీ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. బల్క్‌, రిటైల్‌ డీజిల్‌ ధరల మధ్య వ్యత్యాసం ఇలాగే కొనసాగితే.. రిటైల్‌ బంకులపై సరఫరా ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇదీ చదవండి: కీలక వడ్డీ రేటు పెంపునకు ఆర్‌బీఐ సిద్ధం?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement