కీలక వడ్డీ రేటు పెంపునకు ఆర్‌బీఐ సిద్ధం? | RBI may hike Repo Rate Key Interest Rate update in October MPC Meeting | Sakshi
Sakshi News home page

కీలక వడ్డీ రేటు పెంపునకు ఆర్‌బీఐ సిద్ధం?

Sep 29 2026 2:48 PM | Updated on Sep 29 2026 3:16 PM

RBI may hike Repo Rate Key Interest Rate update in October MPC Meeting

అక్టోబర్ భేటీలో 5.50 శాతానికి రెపో పెంపునకు అవకాశం!

దేశీయంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు వేగంగా విస్తరిస్తుండటంతో భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కీలక వడ్డీ రేట్లలో మార్పులు చేయక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్టోబర్ తొలి వారంలో జరగనున్న మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50 శాతానికి చేర్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ నిర్వహించిన తాజా పోల్‌లో మెజారిటీ ఆర్థికవేత్తలు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ధరల సెగ

గత కొద్ది నెలలుగా వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ వస్తున్న ఆర్‌బీఐ, మారిన పరిస్థితుల దృష్ట్యా తన వ్యూహాన్ని మార్చుకోవాల్సి వస్తోంది. నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు, ఇంధన ధరల తీవ్రత క్రమంగా విస్తరిస్తుండటంతో ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ నిర్దేశిత పరిమితిని దాటి పెరిగే ప్రమాదం ఏర్పడింది.

రాయిటర్స్ సర్వేలో పాల్గొన్న 61 మంది సీనియర్ ఎకనామిస్టుల్లో దాదాపు 60 శాతం మంది (38 మంది) ఆర్‌బీఐ అక్టోబర్ 5-7 తేదీల్లో జరగబోయే సమీక్ష సమావేశంలోనే వడ్డీ రేట్ల పెంపు నిర్ణయాన్ని ప్రకటిస్తుందని స్పష్టం చేశారు. ఆగస్టు నాటి పరిస్థితులతో పోలిస్తే ఇది ఆర్థిక వేత్తల అంచనాల్లో వచ్చిన స్పష్టమైన మార్పును సూచిస్తోంది.

రూపాయి ఒత్తిడి

ప్రపంచవ్యాప్తంగా వివిధ కేంద్ర బ్యాంకులు ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు కఠిన ఆర్థిక విధానాలను వేగవంతం చేస్తున్నాయి. మరోవైపు, విదేశీ కరెన్సీల ప్రభావంతో రూపాయి విలువ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. బలమైన ఆర్థిక వృద్ధి నమోదువుతుండటం ఆర్‌బీఐకి కొంత ఊరటనిచ్చే అంశమైనప్పటికీ పెరిగిన ధరలను అదుపు చేయకపోతే సామాన్యుడి కొనుగోలు శక్తి దెబ్బతింటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

సాధారణ ప్రజలు, ఈఎంఐ చెల్లింపుదారులపై ప్రభావం

ఆర్‌బీఐ ఒకవేళ రేట్లను పెంచితే అది బ్యాంకింగ్ వ్యవస్థపై తక్షణ ప్రభావం చూపుతుంది. రెపో రేటు పెరిగితే బ్యాంకులు కూడా తమ లెండింగ్ రేట్లను పెంచుతాయి. దీనివల్ల గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు పెరిగి నెలవారీ ఈఎంఐలు ప్రియం కానున్నాయి. పొదుపు దారులు, ఫిక్స్డ్ డిపాజిట్ చేసేవారికి ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు లభించే అవకాశం ఉంటుంది.

నిపుణులు ఏమంటున్నారు?

‘దేశంలో ఆహార, ఇంధన సరుకుల విభాగాలు మాత్రమే కాకుండా సాధారణ వస్తువులు, సేవల ధరలు (కోర్‌ ఇన్‌ఫ్లేషన్‌) కూడా పెరగడం ఆందోళనకరం. బలమైన వృద్ధి రేటు నమోదవుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ పాలసీని కఠినతరం చేయడానికి సరైన సమయమిదే’ అని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే, ఈ పెంపు సైకిల్ చాలా వేగంగా కాకుండా పరిమితంగానే ఉంటుందని, రాబోయే నెలల్లో పరిస్థితిని బట్టి ఆర్‌బీఐ ఎంపీసీ మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అక్టోబర్ 7న ఆర్‌బీఐ గవర్నర్ నేతృత్వంలోని ఎంపీసీ వెల్లడించే నిర్ణయాలను మార్కెట్‌ వర్గాలు, బ్యాంకర్లు గమనిస్తున్నారు.

ఇదీ చదవండి: బంగారం ధరలు దిగివచ్చిన వేళ.. ఒక్కరోజే ఇలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement