సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు అందుబాటులోకి తెచ్చిన ఫాస్టాగ్ వార్షిక పాస్ కోటి మైలురాయిని దాటేసింది. 2025 ఆగస్ట్ 15వ తేదీన ప్రారంభమైన ఈ పాస్‌కు ప్రైవేట్ వాహన యజమానుల నుంచి పెరుగుతున్న ఆదరణకు ఇది నిదర్శనమని కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల శాఖ సోమవారం తెలిపింది.
ఫాస్టాగ్ వార్షిక పాస్ కోసం ఒకేసారి రూ.3,075 చెల్లించాలి. ఈ పాస్ ఏడాది పాటు లేదా 200 టోల్ ప్లాజా క్రాసింగ్‌ల వరకు చెల్లుబాటు అవుతుంది. తరచూ ఫాస్టాగ్‌ను రీచార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ విధానం ఉపయోగపడుతుంది. జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్‌ప్రెస్‌వేలపై ఉన్న 1,150 ఫీజు ప్లాజాల్లో ఈ వార్షిక పాస్ వర్తిస్తుంది.
చెల్లుబాటయ్యే ఫాస్టాగ్ కలిగిన అన్ని వ్యక్తిగత, వాణిజ్యేతర వాహనాలకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని ఆ శాఖ తెలిపింది. వార్షిక పాస్ కోసం ఒకేసారి రుసుము చెల్లించిన తర్వాత, వాహనానికి అనుసంధానమైన ప్రస్తుత ఫాస్టాగ్‌పైనే పాస్ యాక్టివేట్ అవుతుంది. రాజ్‌మార్గ్‌యాత్ర యాప్ ద్వారా ఈ చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
ఇదీ చదవండి: ట్రాఫిక్ చలానా కట్టకపోతే ఇంట్లో కరెంట్ కట్!


