ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో రిలయన్స్ జియో తన అగ్రస్థానాన్ని మరింత బలపరిచింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఇటీవల విడుదల చేసిన ఆగస్టు 2026 టెలికాం చందాదారుల నివేదిక ప్రకారం.. మొబైల్, వైర్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్, ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్(ఎఫ్‌డబ్ల్యూఏ) విభాగాల్లో జియో భారీగా కొత్త యూజర్లను ఆకర్షించింది.
మొబైల్ విభాగంలో ఆధిపత్యం
ఆగస్టు నెలలో ఏపీ సర్కిల్‌లో జియో కొత్తగా 2.12 లక్షల వైర్‌లెస్ మొబైల్ చందాదారులను చేర్చుకుంది. దీంతో ఈ ప్రాంతంలో మొత్తం చందాదారుల సంఖ్య 3.29 కోట్లకు చేరింది. నెట్‌వర్క్ వినియోగం పరంగా అత్యంత కీలకమైన ‘విజిటర్ లొకేషన్ రిజిస్టర్’లో జియో 96.95 శాతం యాక్టివ్ యూజర్ల నిష్పత్తిని నమోదు చేసి కస్టమర్ సంతృప్తికి అద్దం పట్టింది. జాతీయ స్థాయిలోనూ సమీప పోటీదారు ఎయిర్‌టెల్‌తో పోలిస్తే నెట్ చందాదారుల చేరికలో జియో సుమారు 3.7 రెట్లు అధిక వృద్ధిని సాధించడమే కాక వరుసగా 17 లక్షల యాక్టివ్ వీఎల్‌ఆర్ కస్టమర్లను జోడించి ఏకైక పాజిటివ్ ఆపరేటర్‌గా నిలిచింది.
హోమ్ బ్రాడ్‌బ్యాండ్, ఎయిర్‌ఫైబర్ ఇలా..
డిజిటల్ సేవలకు డిమాండ్ పెరుగుతున్న వేళ స్థిర బ్రాడ్‌బ్యాండ్ (వైర్‌లైన్) విభాగంలో జియో ఏపీలో కొత్తగా 25,211 కనెక్షన్లను జోడించి మొత్తం కనెక్షన్ల సంఖ్యను 21.55 లక్షలకు పెంచుకుంది. ఇక వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ రంగాన్ని శాసిస్తున్న జియో ఎయిర్‌ఫైబర్ సాంకేతికతలోనూ వృద్ధి నమోదైంది. 5జీ ఎఫ్‌డబ్ల్యూఏలో 11,058 కొత్త చేరికలతో మొత్తం కస్టమర్లు 7.97 లక్షలకు చేరారు. యూబీఆర్ ఎఫ్‌డబ్ల్యూఏలో 26,513 కొత్త కనెక్షన్లతో మొత్తం యూజర్లు 4.67 లక్షలకు పెరిగారు. ఈ రెండింటినీ కలిపితే ఏపీలో జియో ఎఫ్‌డబ్ల్యూఏ కనెక్షన్ల సంఖ్య ఏకంగా 12.64 లక్షల మైలురాయిని దాటింది.
దేశవ్యాప్తంగా ఎఫ్‌డబ్ల్యూఏ విభాగంలో 78.6 శాతం సింహభాగాన్ని కలిగి ఉన్న జియో ఆగస్టులో జాతీయ స్థాయిలో 4 లక్షల కనెక్షన్లను అందించి ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచింది. వైర్‌లెస్ నెట్‌వర్క్ స్థిరత్వం, వేగవంతమైన డిజిటల్ విస్తరణే జియోను ఏపీ, తెలంగాణ పరిధిలో టాప్‌లో నిలబెడుతున్నాయని ఈ సమాచారం స్పష్టం చేస్తోంది.
ఇదీ చదవండి: బంగారం ధరలు దిగివచ్చిన వేళ.. ఒక్కరోజే ఇలా..


