ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ రాకతో గ్లోబల్ ఐటీ రంగం వేగంగా మారుతోంది. సాంప్రదాయ ఐటీ సర్వీసుల నమూనా నుంచి ఉన్నత స్థాయి సాంకేతిక పరిష్కారాల వైపు ఐటీ పరిశ్రమ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తన పనితీరు, మానవ వనరుల నిర్మాణంలో కీలకమైన వ్యూహాత్మక మార్పు చేపడుతోంది.
కంపెనీలో మొత్తం 3,20,000 మందికి పైగా ఉన్న ఉద్యోగుల్లో మూడో వంతు (సుమారు 25% నుంచి 33 శాతం) మందిని ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన స్పెషలిస్ట్ పాత్రల్లోకి మార్చేందుకు ప్రతిపాదన సిద్ధం చేసింది. దీనితో పాటు ‘ఫ్రాంటియర్ ఇంజినీర్లు’గా పిలిచే 6,000 మంది నిపుణులతో కూడిన ఒక అత్యున్నత సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేయనుంది.
ఈ నిర్ణయానికి సంబంధించిన ముఖ్యాంశాలు
ప్రామాణిక కోడింగ్, పర్యవేక్షణ వంటి సాధారణ పనుల స్థానంలో ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో నిపుణులను తయారుచేయడమే ఈ రీ-స్కిల్లింగ్ ప్రణాళిక ముఖ్య ఉద్దేశం.
ఐఐటీలు, ప్రముఖ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్లు, అమెరికా క్యాంపస్‌ల నుంచి అత్యుత్తమ ప్రతిభావంతులైన 6,000 మంది ఇంజినీర్లను ఎంపిక చేయనున్నారు. అంతర్జాతీయ ఏఐ ల్యాబ్‌లతో పోటీపడి మరీ వీరిని రిక్రూట్ చేసుకుంటున్నారు.
ఐటీ పరిశ్రమలో ఇన్నాళ్లూ కొనసాగిన సిబ్బంది సంఖ్య ఆధారిత ఆదాయ నమూనా స్థానంలో నైపుణ్య ఆధారిత అత్యుత్తమ సేవలను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
లేఆఫ్స్ కావు.. పునర్నిర్మాణమే!
ఈ ప్రక్రియ ఉద్యోగుల తగ్గింపు (లేఆఫ్స్) కోసం కాదని ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచే రీబ్యాలెన్సింగ్ చర్య మాత్రమేనని సంస్థ స్పష్టం చేసింది. వాషింగ్టన్‌లో ఇటీవల జరిగిన వార్షిక కాన్ఫరెన్స్‌లో ఈ వ్యూహాన్ని కంపెనీ యాజమాన్యం వెల్లడించింది. మొత్తానికి, సాంప్రదాయ ఐటీ శకానికి ముగింపు పలుకుతూ ఏఐ ఆధారిత నూతన సాంకేతిక యుగానికి ఐటీ ప్రాజెక్టులను సిద్ధం చేయడంలో ఇన్ఫోసిస్ తీసుకున్న ఈ నిర్ణయం మిగతా భారతీయ ఐటీ సంస్థలకు కూడా మార్గదర్శకంగా నిలవనుందని కొందరు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: బంగారం ధరలు దిగివచ్చిన వేళ.. ఒక్కరోజే ఇలా..


