చరిత్రకారుడు, ఇజ్రాయెల్ రచయిత యువల్ నోవా హరారి– కృత్రిమ మేధ (ఏఐ) మన భవిష్యత్తును ఎలా మార్చబోతోందో ది ఇన్‌సైడర్ అనే పాడ్‌కాస్ట్‌లో విశ్లేషించారు. ఈయన ‘సేపియన్స్’ గ్రంథ రచయిత. ‘డిజిటల్ సామ్రాజ్యవాదం’, బ్యూరోక్రసీపై ఏఐ ఆధిపత్యం వంటి సూక్ష్మమైన భవిష్యత్ పరిణామాలను తన పాడ్‌కాస్ట్‌లో అంచనా వేశారు. దీనికి హోస్ట్‌గా ది ఎకానమిస్ట్ ప్రధాన సంపాదకుడు జానీ మిండన్ బెడోస్ వ్యవహరించారు. అందులోని అంశాలు కింది విధంగా ఉన్నాయి.
భౌగోళిక రాజకీయాలపై ఏఐ ఆధిపత్యం
‘‘ప్రపంచ రాజకీయాధికార పరిస్థితులను గమనిస్తే, కృత్రిమ మేధ అత్యంత ఆందోళనకరమైన ముప్పుగా మారనున్నట్లు కనిపిస్తోంది! ఆ మార్పు ఒక కొత్త రకమైన సామ్రాజ్యవాద ఆధిపత్యానికి (డిజిటల్ ఇంపీరియలిజం) దారి తీసే ప్రమాదం ఉంది. గతంలో రాజులు లేదా రాజ్యాలు తమ సైన్యంతో భూభాగాలను ఆక్రమించేవి. అదే విధంగా, ఏఐ పోటీలో సాంకేతికంగా ముందంజలో ఉన్న ఒకటీరెండు అగ్రరాజ్యాలు ప్రపంచం నలుమూలల ఉన్న డేటా, ఆర్థిక వ్యవస్థలు, సమాచార నెట్‌వర్క్‌లన్నింటినీ తమ గుప్పిట్లోకి తీసు కోవచ్చు. ఒకవేళ వేరే దేశం తయారుచేసిన ఏఐ సాంకేతికతపై ఏ దేశమైనా పూర్తిగా ఆధారపడితే... ఆ విదేశీ శక్తి ఒక్క బటన్ నొక్కి తనపై ఆధారపడిన దేశ వ్యవస్థలను నిలిపివేసే లేదా మార్చే శక్తిని పొందుతుంది. దానితో ఆ ఆధారపడిన దేశం తన స్వాతంత్య్రాన్ని కోల్పోయి, ఒక రకంగా మరొకరి చేతిలో ‘డిజిటల్ కాలనీ’గా మారిపోతుంది.
‘బహిరంగ సంభాషణ’ దెబ్బతింటుంది!
‘‘కోట్ల జనాభా ఉన్న దేశాల్లో ప్రజాస్వామ్యం అనేది దానంతట అది ఏర్పడే సహజమైన ప్రక్రియ కాదు. వార్తాపత్రికలు, టీవీలు, ఇతర ఆధునిక సమాచార సాంకేతికతలు, ప్రజా చర్చల పునాదులపై నిర్మితమైన ఒక అత్యంత సున్నితమైన వ్యవస్థ అది. సరిగ్గా చెప్పాలంటే, ప్రజాస్వామ్యం అనేది కోట్లాది మంది పౌరుల మధ్య నిరంతరం సాగే ఒక ‘బహిరంగ సంభాషణ’ (పబ్లిక్ కాన్వర్జేషన్). అందువల్ల ఈ సమాచార సాంకేతికతలో ఎలాంటి విపరిణామం సంభవించినా, అది మొత్తం రాజకీయ వ్యవస్థనే అస్థిరపరుస్తుంది. ఏఐ అల్గారిథమ్‌లు ప్రజలు ఏం చూడాలి, ఏం ఆలోచించాలి, దేని గురించి మాట్లాడాలో నిశ్శబ్దంగా నిర్ణయించడం మొదలుపెడితే ప్రజాస్వామ్యాన్ని సమైక్యంగా ఉంచే ఆ బహిరంగ సంభాషణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది.
ముద్రణా యంత్రం పెద్ద గుణపాఠం
‘‘గతంలో ముద్రణా యంత్రం వచ్చినప్పుడు సమాజంలో ఎంతటి పెను మార్పులు వచ్చాయో చూస్తే ఒక విషయం అర్థమవుతుంది. ప్రధానమైన సాంకేతిక విప్లవాలు మొదట్లో తీవ్ర సామాజిక అల్లకల్లోలానికి, మత యుద్ధాలకు, నియంతృత్వానికి దారితీశాయి. ఆ తర్వాతే మానవాళి ఆ టెక్నాలజీ విప్లవాలను అదుపు చేయడానికి తగిన వ్యవస్థలను అభివృద్ధి చేసుకోగలిగింది. అయితే, చరిత్ర మనకు నేర్పే ఇంకో ముఖ్యమైన పాఠం ఏంటంటే... సాంకేతికత వల్ల జరిగే పరిణామాలు ఎప్పుడూ ముందే రాసిపెట్టి ఉండవని! సాంకేతికత మనకు కొత్త అవకాశాలను, శక్తులను ఇస్తుంది తప్ప, వాటిని ఎలా వాడాలో అది నిర్ణయించదు. మనం ఈరోజే సరైన స్వీయ నియంత్రణ వ్యవస్థలను నిర్మించుకుంటే, ఆనాటి వినాశకరమైన పొరపాట్లు మళ్లీ జరిగే ప్రమాదం ఉండదు.
ఏఐకి స్పృహే అక్కర్లేదు.. మేధ చాలు!
‘‘ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవడానికి ఏఐకి స్పృహ అవసరం లేదు, కేవలం ‘మేధ’ ఉంటే చాలు. స్పృహ అనేది బాధ, ప్రేమ లేదా అనుభూతిని పొందే సామర్థ్యం. కానీ ‘మేధ’ అంటే కేవలం సమస్యలను పరిష్కరించడం, లక్ష్యాలను చేరుకోవడం. ఏఐ అనేది పుట్టుకతోనే వ్యవస్థలను/బ్యూరోక్రసీని నడపడంలో అత్యంత దిట్ట. పేపర్‌వర్క్ నిర్వహించడం, ఆర్థిక మార్కెట్లను లెక్కించడం, చట్టాలను లిఖించటం, ప్రభుత్వ వ్యవస్థలను నడపడంలో మానవ మస్తిష్కం కంటే ఏఐకి చాలా ఎక్కువ సామర్థ్యం ఉంది. ఏఐ ఈ ప్రపంచాన్ని హింసాత్మకంగా ఆక్రమించదు కానీ... మన రోజువారీ జీవితాలకు సంబంధించి చట్టపరమైన, ఆర్థికపరమైన నిర్మాణాలను నడిపించే ఒక అదృశ్యమైన, అత్యంత అవసరమైన శక్తిగా మారి మన సమాజాన్ని తన నియంత్రణలోకి తీసుకుంటుంది.
ఇదీ చదవండి: వందల గంటల సమయాన్ని ఆదా చేసే టాప్ ఏఐ టూల్స్!


