ఐఆర్‌సీటీసీలో రైలు టికెట్ బుక్‌ చేసిన చాట్‌జీపీటీ | ChatGPT Astra Completes IRCTC Ticket Booking Without Human Help In Viral AI Demo, Watch Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

ఐఆర్‌సీటీసీలో రైలు టికెట్ బుక్‌ చేసిన చాట్‌జీపీటీ

Sep 15 2026 2:48 PM | Updated on Sep 15 2026 3:08 PM

AI Revolution IRCTC ChatGPT Astra Almost Books Train Ticket Indian Railways

కృత్రిమ మేధ సాంకేతికత డిజిటల్ ప్రపంచాన్ని ఎంత వేగంగా మార్చేస్తోందో చెప్పడానికి ఇదో తాజా ఉదాహరణ. నిత్యం లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడే ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్ ప్రక్రియను ‘చాట్‌జీపీటీ అస్ట్రా’ అనే ఏఐ అసిస్టెంట్ అత్యంత సులభంగా పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

కంటెంట్ క్రియేటర్ మంథన్ జేత్వానీ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా జేత్వానీ ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ముంబై నుంచి రాజ్‌కోట్‌కు సెప్టెంబర్ 20న, రాత్రి 9 నుంచి 11 గంటల మధ్య ఏసీ క్లాస్‌లో ఇద్దరు ప్రయాణికులకు టికెట్లు వెతకాలని చాట్‌జీపీటీ అస్ట్రాను కోరారు.

ఆశ్చర్యకరంగా, ఆ ఏఐ అసిస్టెంట్ మానవ ప్రమేయం లేకుండానే బ్రౌజర్ ద్వారా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లోకి ప్రవేశించింది. స్టేషన్ల పేర్లు, ప్రయాణ తేదీ, సమయం, క్లాస్ వివరాలను నమోదు చేసి రైళ్లను వెతికింది. మొదట వెయిటింగ్ లిస్ట్ కనిపించడంతో మరుసటి రోజుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి ప్రయాణికుల వివరాలను కూడా పూర్తి చేసి ఆఖరి పేమెంట్ పేజీ వరకు ప్రక్రియను తీసుకెళ్లింది. వినియోగదారుడు కేవలం డబ్బులు చెల్లించడం మాత్రమే మిగిలింది. ఈ వీడియోపై స్వయంగా చాట్‌జీపీటీ స్పందిస్తూ ‘అస్ట్రా లా విస్టా.. హ్యాపీ జర్నీ మంథన్’ అని కామెంట్ చేయడం విశేషం.

సాంకేతిక నిపుణుల విశ్లేషణ ప్రకారం.. సాధారణ బుకింగ్స్‌లో ఏఐ ఏజెంట్లు విజయం సాధిస్తున్నప్పటికీ నిమిషాల వ్యవధిలో ముగిసే ఐఆర్‌సీటీసీ తత్కాల్ బుకింగ్స్, సైట్ క్యాప్చా భద్రతా ప్రాసెస్‌లలో ఇవి ఎంతవరకు ప్రభావవంతంగా పనిచేస్తాయనేది వేచి చూడాలి. నెటిజన్లు కూడా ‘దీపావళి పండుగ సమయాల్లో బిహార్‌ టికెట్లు బుక్ చేసి చూపిస్తే నమ్ముతాం’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా, భవిష్యత్తులో రోజువారీ డిజిటల్ పనులను, సంక్లిష్టమైన ఆన్‌లైన్ లావాదేవీలను ఏఐ స్వయంప్రతిపత్తితో ఎలా సులభంగా నిర్వహించగలదో ఈ ప్రయోగం స్పష్టం చేస్తోంది.

ఇదీ చదవండి: గోల్డ్ లవర్స్‌కి శుభవార్త.. ధరల పతనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement