ఏఐకి ‘కిల్‌ స్విచ్‌’ తప్పనిసరి చేయాలా? జాక్‌ క్లార్క్‌ సంచలన వ్యాఖ్యలు | Artificial Intelligence Kill Switch Anthropic Jack Clark | Sakshi
Sakshi News home page

ఏఐకి ‘కిల్‌ స్విచ్‌’ తప్పనిసరి చేయాలా? జాక్‌ క్లార్క్‌ సంచలన వ్యాఖ్యలు

Sep 15 2026 5:49 AM | Updated on Sep 15 2026 5:49 AM

Artificial Intelligence Kill Switch Anthropic Jack Clark

లండన్‌: కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో దాని వల్ల ఎదురయ్యే ప్రమాదాలపై చర్చ మరింత ముదురుతోంది. ఈ క్రమంలో ఏఐ వ్యవస్థలు ప్రమాదకరంగా మారితే వాటిని పూర్తిగా నిలిపివేయగల ‘కిల్‌ స్విచ్‌’ను కంపెనీలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకునేలా నిబంధనలు తీసుకురావాల్సి రావచ్చని ఆంథ్రోపిక్‌ సహ వ్యవస్థాపకుడు జాక్‌ క్లార్క్‌ అభిప్రాయపడ్డారు.

ప్రమాదం పెరిగితే వెంటనే ఆపేలా..
ప్రస్తుతం చాలా ఏఐ సంస్థలు తమ సాఫ్ట్‌వేర్‌ను అవసరమైతే నిలిపివేసే మార్గాలను కలిగి ఉన్నాయని క్లార్క్‌ తెలిపారు. అయితే భవిష్యత్తులో ఏఐ మరింత శక్తివంతంగా మారే కొద్దీ ఈ ‘కిల్‌ స్విచ్‌’ తప్పనిసరిగా ఉండేలా ప్రభుత్వాలు నిబంధనలు రూపొందించాల్సిన అవసరం రావచ్చన్నారు. అంతేకాకుండా ఆ స్విచ్‌ నిజంగా పనిచేస్తుందో లేదో స్వతంత్ర మూడో పక్షంతో తనిఖీ చేయించాలా అనే అంశాన్ని కూడా విధాన నిర్ణేతలు పరిశీలించాల్సి ఉంటుందని చెప్పారు.

మానవాళికి ముప్పుపై ఆందోళనలు
ఏఐ అభివృద్ధి వేగం పెరుగుతున్న కొద్దీ.. మానవాళికి ఎదురయ్యే ముప్పుపై పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. నియంత్రణ లేకుండా ఏఐను అభివృద్ధి చేస్తే భవిష్యత్తులో అది మనుషుల ఉనికికే ముప్పుగా మారే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏఐ కీలకమైన ఇంటర్నెట్‌ ఆధారిత వ్యవస్థలను తన నియంత్రణలోకి తీసుకుని మనుషులకు వ్యతిరేకంగా ఉపయోగించుకునే పరిస్థితి ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది.

‘10 శాతం అవకాశం ఉంది’
ఆంథ్రోపిక్‌ పరిశోధకుడు ఇవాన్‌ హుబింగర్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఆజ్యం పోశాయి. వచ్చే పదేళ్లలో ఏఐ కారణంగా మానవాళి అంతరించిపోయే అవకాశం 10 శాతానికి మించి ఉందని ఆయన వ్యక్తిగతంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఏఐ రంగంలో ‘గాడ్‌ఫాదర్‌ ఆఫ్‌ ఏఐ’గా పేరొందిన నోబెల్‌ విజేత జెఫ్రీ హింటన్‌ కూడా మానవాళిని ఏఐ అంతం చేసే అవకాశం 10 శాతం ఉండటం అసమంజసం కాదని పేర్కొన్నారు.

భయాలను అతిగా చూపిస్తున్నారనే విమర్శలు
అయితే ఏఐ వల్ల మానవాళి అంతరించిపోయే ప్రమాదాన్ని కొందరు అతిగా చూపిస్తున్నారని టెక్‌ రంగంలోని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏఐ కంపెనీలు తమ వ్యాపార ప్రయోజనాలకు అనుగుణంగా ఇలాంటి భయాలను ప్రచారం చేస్తున్నాయని గ్రైండర్‌ సంస్థ అధినేత జార్జ్‌ అరిసన్‌ విమర్శించారు. భారీ స్థాయి పెట్టుబడులు, కంపెనీల విలువలకు న్యాయం చేయాలంటే భవిష్యత్తులో ఏఐ అనేక ఉద్యోగాలను, పరిశ్రమలను ఆక్రమిస్తుందని చెప్పాల్సిన పరిస్థితి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

అమెరికాలో ‘కిల్‌ స్విచ్‌ యాక్ట్‌’
ఏఐ ప్రమాదాలను నియంత్రించేందుకు అమెరికాలో ఇప్పటికే ‘కిల్‌ స్విచ్‌ యాక్ట్‌’ పేరుతో చట్ట ప్రతిపాదన ముందుకు వచ్చింది. ప్రమాదకరంగా మారిన ఏఐ సాధనాలను నిలిపివేసే సామర్థ్యం కంపెనీలకు తప్పనిసరిగా ఉండేలా చేయడం, అవసరమైతే వాటిని ఆపాలని లేదా పరిమితం చేయాలని కొన్ని ప్రభుత్వ సంస్థలు ఆదేశించేలా అధికారాలు కల్పించడం ఈ ప్రతిపాదనలో ఉంది. అయితే ఏఐ అభివృద్ధిని నెమ్మదింపజేసే ప్రయత్నాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యతిరేకిస్తున్నారు.

బ్రిటన్‌ మాత్రం వ్యతిరేకం
మరోవైపు బ్రిటన్‌ ప్రభుత్వం ఏఐకి ప్రత్యేకంగా ‘కిల్‌ స్విచ్‌’ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ఇటీవల తిరస్కరించింది. ఒక దేశంలో ఇలాంటి నిబంధనలు తీసుకొచ్చినా ఇతర ప్రాంతాల్లో ఏఐ అభివృద్ధి లేదా దుర్వినియోగాన్ని అడ్డుకోలేమని ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉండగా, ఏఐ చాట్‌బాట్‌ క్లాడ్‌ను రూపొందించిన ఆంథ్రోపిక్‌ సంస్థ వరుసగా మరింత శక్తివంతమైన ఏఐ మోడళ్లను విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏఐ అభివృద్ధి వేగం, భద్రత, ప్రభుత్వ నియంత్రణపై ప్రపంచవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది.

ఇదీ చదవండి: ఏఐపై ట్రంప్‌ షాకింగ్‌ కామెంట్స్‌.. ‘బూటకం’ అంటూ కొట్టిపారేశారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement