అమెరికాలో సుమారు రూ. 620 కోట్ల విలువైన భారీ మెడికేర్ కుంభకోణానికి పాల్పడి, మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఓ భారతీయ వ్యక్తి ప్రస్తుతం హైదరాబాద్‌లో తలదాచుకున్నట్లు తెలిసింది. మహమ్మద్ ఖదీర్ ఖాన్ అనే ఈ నిందితుడు నగరంలోనే ఉన్నాడని అమెరికా పోలీసులు హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన స్థానిక అధికారులు అతడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
టెక్సాస్‌లోని రిచర్డ్‌సన్‌లో ఖదీర్ ఖాన్ 'అమెరికన్ ప్రీమియర్ ల్యాబ్స్' పేరుతో ఒక జెనెటిక్ టెస్టింగ్ ల్యాబొరేటరీని నిర్వహించేవాడు. 2023 ఆగస్టు నుంచి 2024 అక్టోబర్ మధ్య కాలంలో, అమెరికా ప్రభుత్వ మెడికేర్ పథకం కింద సుమారు 93 మిలియన్ డాలర్ల విలువైన నకిలీ క్లెయిమ్‌లను అతడు సృష్టించాడు.
వీటి ద్వారా ప్రభుత్వం నుంచి 65 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 620 కోట్లు) అక్రమంగా పొందినట్లు దర్యాప్తులో తేలింది. వైద్యుల వివరాలు, సంతకాలను ఫోర్జరీ చేసి ఈ భారీ మోసానికి పాల్పడినట్లు అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, ఎఫ్‌బీఐ, ఆరోగ్య శాఖల సంయుక్త విచారణలో వెల్లడైంది.
ఈ కుంభకోణం బయటపడటంతో అధికారులు ఖాన్ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసి, అతడిని 'మోస్ట్ వాంటెడ్ ఫ్యుజిటివ్'గా ప్రకటించారు. అయితే, అప్పటికే అతను అమెరికా నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం ఖాన్ హైదరాబాద్‌లోనే ఉన్నట్లు పక్కా సమాచారం అందడంతో, శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుల జాబితాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నగరవ్యాప్తంగా గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: జేడీయూ యూటర్న్.. షాక్‌లో బీజేపీ!


