పోలీస్‌ స్టేషన్‌లోనే కేటీఆర్‌ పీఏ, పీఆర్వోలపై దాడి.. వాళ్ల పనేనా? | KTR Condemns Alleged Attack on His PA and PRO in Police Station | Sakshi
Sakshi News home page

పోలీస్‌ స్టేషన్‌లోనే కేటీఆర్‌ పీఏ, పీఆర్వోలపై దాడి.. వాళ్ల పనేనా?

Sep 14 2026 9:06 PM | Updated on Sep 14 2026 9:25 PM

KTR Condemns Alleged Attack on His PA and PRO in Police Station

సాక్షి,హైదరాబాద్: సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్‌లు విచారణ నిమిత్తం సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యారు. ఇటీవల అసెంబ్లీ గేట్ నంబర్-3 వద్ద జరిగిన ఆందోళనల ఘటనకు సంబంధించి పోలీసులు వీరిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విచారణ సందర్భంగా పోలీసులు వారికి 41ఏ సీఆర్పీసీ (35(3) BNS) కింద నోటీసులు అందించారు.

విచారణ ముగిసే సమయానికి పోలీస్ స్టేషన్ వెలుపల భారీగా చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. స్టేషన్ గేటు వద్ద నుంచి వెంటనే వెళ్లిపోవాలని పోలీసులు సూచించగా, తాము బయటే ఉంటామని కార్యకర్తలు పట్టుబట్టడంతో అక్కడ తోపులాట, ఉద్రిక్తత నెలకొంది.  

పోలీస్ స్టేషన్‌లో తన పీఏ, పీఆర్వోలపై దాడి జరిగిన పరిణామాలపై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ తీరును తప్పుపడుతూ  ట్వీట్‌ చేశారు. ‘హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న సైఫాబాద్ పోలీసుస్టేషన్‌లోకి ఏకంగా గుండాలు అక్రమంగా చొరబడి నా పీఆర్వో మహేష్, పీఏ మహేందర్ రెడ్డిపై మూకుమ్మడిగా దాడి చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో రౌడీల రాజ్యం, గుండాల రాజ్యం నడుస్తోంది.  ఇది కాంగ్రెస్ గుండాల పనా ?? లేక మఫ్టీలో పోలీసులకే ముసుగులు వేసి కుట్రపన్ని ఈ దాడి చేయించరా ?? వెంటనే దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.

రాజకీయ కక్షతో పెట్టిన పోలీసు కేసు విచారణ కోసం స్టేషన్‌కు పిలిపించి ఖాకీల సమక్షంలో ఈ దాడి చేయించడం వెనక ముమ్మాటికి ముఖ్యమంత్రి హస్తం ఉంది.  ఉదయం విచారణకు రమ్మని చెప్పి చీకటి పడే వరకూ కాలయాపన చేయడం చూస్తే, ముందే ఈ దాడి చేయాలన్న కుట్ర పన్నినట్టు స్పష్టంగా అర్థమవుతోంది.

 హైకోర్టు తదుపరి ఆదేశాల వరకూ మహేష్, మహేందర్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడంతో కక్ష సాధింపులో భాగంగానే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.  ఈ సంఘటనకు హోం మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలి.

ముసుగు ధరించిన గుండాల దాడిలో గాయపడ్డ పీఆర్వో మహేష్, పీఏ మహేందర్ రెడ్డికి వెంటనే రక్షణ కల్పించి వారికి మెరుగైన చికిత్స అందించాలి. పోలీస్ స్టేషన్ లోపల, బయట ఉన్న అన్ని సీసీ కెమెరాల ఫుటేజీని వెంటనే భద్రపరచాలి. ఈ అరాచక పర్వానికి పాల్పడిన ప్రతి ఒక్క కాంగ్రెస్ గుండాను గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలి. లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఊరుకునే ప్రసక్తే లేదు’అని పేర్కొన్నారు.

మరోవైపు తమపై జరిగిన దాడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేటీఆర్ పీఏ, పీఆర్వోలు కూడా పోలీసులకు ఫిర్యాదు అందజేశారు. ఈ ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement