భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సు దిగ్విజయంగా ముగిసింది. అందుకు సంబంధించిన ఒక ఫోటోను మోదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది షేర్ చేసిన గంట వ్యవధిలోనే వైరల్‌గా మారింది. ఆ ఫోటోల భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లు చేతులు కలిపి ఉన్నారు. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన ఆ నాయకుల మధ్య ప్రశాంతంగా నిలబడి ఉన్న ఒక యువకుడు అందరి దృష్టిని అమితంగా ఆకర్షించాడు.
ఎవరీ సిద్ధార్థ్ బాబు..?
కేరళలో కొచ్చికి చెందిన 36 ఏళ్ల ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి. 2017 బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని తూర్పు ఆసియా విభాగంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. కొన్ని నివేదికలలో ఆయన పేరు సిద్ధార్థ్‌గా కనిపిస్తుంది. ఆయన చాలామందికి తెలియని అత్యంత కీలకలమైన గదిలో ఏళ్ల తరబడి పనిచేసిన దౌత్యవేత్త.
మెకానికల్ ఇంజనీర్ అయిన ఆయన అత్యంత ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ పరీక్షల్లో ఆల్ ఇండియా 15వ ర్యాంకుతో ఉత్తీర్ణులయ్యారు. ఆయన ఫారిన్ సర్వీస్‌ని ఎంచుకున్నారు. అలా ఆయన దేశంలోని అత్యంత సున్నితమైన సంభాషణల నేపథ్యంలో సాగే వృత్తి జీవితాన్ని గడుపుతున్నారు. అక్కడ కనిపించడం కంటే సన్నద్ధతకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
ఆ నాయకుల మధ్య ఉండటానికి రీజన్..
అతను మాండరిన్ అనువాదకుడు. శిఖరాగ్ర సమావేశంలో షీ జిన్‌పింగ్ మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలను మోదీ అర్థం చేసుకునేలా సహాయం చేయడమే అతని పని. ఇది కనిపించే దానికంటే చాలా కష్టం. ఒక దౌత్య అనువాదకుడు కేవలం భాషనే కాకుండా, ప్రతి పదబంధంలో రాజకీయ ప్రాముఖ్యతను కూడా గ్రహించి, అర్థాన్ని కచ్చితంగా తక్షణమే తెలియజేయాలి. ఎందుకంటే వాణిజ్యం, భద్రత లేదా సరిహద్దుల విషయంలో పలికే ఒక్క తప్పు పదం మొత్తం సంబంధం స్వరూపాన్నే మార్చేయగలదు.
ఆ బ్రిక్స్ ఫోటోని బట్టి అతడికి అదే అతిపెద్ద వేదిక అరంగేట్రం అనుకుంటే పొరపాటే..ఎందుకంటే ఈ ఏడాది జరిగిన గణతంత్ర వేడుకల్లో కూడా కనిపించారు. మోదీ యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్పులా వాన్ డెర్ లేయన్‌తో సంభాషించేటప్పుడు సిద్ధార్థ్ అర్థమయ్యేలా వివరించడంలో సహాయం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు.
ఒక రకంగా ఈ ఘట్టం..భారతదేశం నిర్వహించే దాదాపు ప్రతి ప్రధాన దౌత్య సమావేశంలో కొంతమంది ప్రతిభావంతులైన భాషావేత్తలు అంతర్భాగంగా ఉంటారనే నగ్న సత్యాన్ని ఇది తెలియజేస్తోంది. అలాగే అత్యంత శక్తిమంతమైన వ్యక్తులతో సంభాషించేటప్పుడే వారి మాటాలు సునాయాసంగా అర్థం చేసుకుని సమాచారాన్ని చేరవేసే ఈ భాషావేత్తలదే అత్యంత కీలకమైన పాత్ర అని ప్రస్ఫుటమవుతోంది.
(చదవండి: మైనస్ 50 డిగ్రీల చలిలో లక్షలాది మంది ఖైదీల కన్నీటి కథ)


