న్యూఢిల్లీ: నేటి ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో సమగ్రమైన విధానాన్ని అవలంభించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. కూటమి దేశాల మధ్య ధాన్యం(గ్రెయిన్) మార్కెట్ కోసం ఒక కొత్త బీమా యంత్రాంగాన్ని, సహకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా రష్యాపై పశ్చిమ దేశాలు కఠినమైన ఆంక్షలు విధించిన నేపథ్యంలో బ్రిక్స్ సభ్య దేశాలు, గ్లోబల్ సౌత్ దేశాల మధ్య ఆర్థిక వృద్ధికి సంబంధించిన కొత్త కార్యక్రమాలను కూడా ప్రతిపాదించారు.
బ్రిక్స్ దేశాల కలిసి ఆర్థిక వృద్ధి కోసం ఒక ప్రత్యేక వేదికను ఏర్పాటు చేయాలని అన్నారు. మూలధనం, శ్రామిక శక్తి, సాంకేతికతల విషయంలో రష్యాకు స్వతంత్ర మార్గాలు ఉన్నాయని చెప్పారు. బయటి ఒత్తిళ్లతో సంబంధం లేకుండా కార్యకలాపాలు సాగించగలమని స్పష్టంచేశారు. ఆదివారం బ్రిక్స్ సదస్సులో పుతిన్ మాట్లాడారు. గ్లోబల్ సౌత్ దేశాలు మెరుగైన ప్రపంచ పాలనా విధానాన్ని ఉమ్మడిగా ముందుకు తీసుకెళ్లాలని, భద్రతాపరమైన సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కోవాలని స్పష్టంచేశారు.


