భక్తితోపాటు రూ.వేల కోట్ల వ్యాపారం
భారత్‌లో రూ.45 వేల కోట్ల మార్కెట్
దేశవ్యాప్తంగా సుమారు 20 లక్షల గణేశ్ మండపాలు
మండపాలు, అలంకరణ, పూజా సామగ్రి కోసం రూ.12 వేలకోట్ల ఖర్చు
ఈవెంట్ మేనేజ్‌మెంట్‌కు సుమారు రూ.5 వేలకోట్ల వ్యయం
ఆహారం, స్వీట్లు, మోదకాలకు దాదాపు రూ.2,400 కోట్లు
బంగారం, వెండి తదితరాలకు సుమారు రూ.వెయ్యికోట్ల మేర డిమాండ్
సీఏఐటీ నివేదికలో వెల్లడి.. విదేశాల్లోనూ ఘనంగా గణపతి వేడుకలు
సాక్షి, అమరావతి: వినాయకుడు.. ప్రపంచాన్ని చుట్టేసిన ఆరాధ్యదైవం. వినాయకచవితి సందర్భంగా మనదేశంలో పల్లె నుంచి మహానగరం వరకు సందడి కనిపిస్తే.. విదేశాల్లోనూ భారతీయులు, హిందూ సమాజాల ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పండగ నిర్వహిస్తున్నారు. భక్తి, కళ, వ్యాపారం.. ఈ మూడు కలిసిన భారీపండగగా గణపతి ఉత్సవం మారింది. అయితే ఈ పండగకు జరిగే వ్యాపారం మామూలుగా ఉండదు. దేశవ్యాప్తంగా వేలకోట్ల రూపాయల వ్యాపారం
జరుగుతుంది. గణనాథుడికి ఘనంగా ఉత్సవం జరపడం కోసం భక్తులు ఇష్టంగా ఈ ఖర్చు చేస్తున్నారు. ఈ వివరాలను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ఒక నివేదికలో వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం..
పలురంగాలకు ఆదాయం
దేశవ్యాప్తంగా సుమారు 20 లక్షల గణేశ్ మండపాలు ఏర్పాటవుతున్నాయి. మండపాల ఏర్పాటు, అలంకరణ, పూజాసామగ్రి, కార్యక్రమాలు, ఆహారం, రవాణా, పూలు, స్వీట్లు.. ఇలా అనేక రంగాలకు ఈ పండగ ఆదాయాన్ని తెస్తోంది. గతేడాది గణేశోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా రూ.30 వేలకోట్ల వరకు వ్యాపారం జరిగిందని అంచనా. ఈ ఏడాది అది రూ.45 వేలకోట్లకు చేరే అవకాశం ఉంది. అంతకుముందు 2024లో రూ.25 వేలకోట్లకు పైగా వ్యాపారం జరిగింది. గతేడాది మండపాలు, అలంకరణ, పూజాసామగ్రి కోసం దాదాపు రూ.12 వేలకోట్లు, ఈవెంట్ మేనేజ్‌మెంట్‌కు సుమారు రూ.5 వేలకోట్లు ఖర్చుచేశారు. ఆహారం, స్వీట్లు, ముఖ్యంగా మోదకాలకు సంబంధించి దాదాపు రూ.2,400 కోట్ల వ్యాపారం జరిగింది. బంగారం, వెండి తదితరాలకు సుమారు రూ.వెయ్యికోట్ల మేర డిమాండ్ ఏర్పడింది.

తెలుగు రాష్ట్రాల్లో భారీ మార్కెట్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వినాయకచవితి పండగకు ప్రత్యేకస్థానం ఉంది. ఏటా ఒక్కో రాష్ట్రంలో సుమారు రెండులక్షల మండపాలు ఏర్పాటవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక్క విజయవాడలోనే కుటుంబాలు సాధారణంగా రూ.1,000–రూ.2,000 వరకు పూజాసామగ్రిపై, మండప నిర్వాహకులు రూ.50 వేల నుంచి లక్షల రూపాయల వరకు ఖర్చుచేస్తున్నట్లు స్థానిక మార్కెట్ నివేదికలు చెబుతున్నాయి. కొన్ని పెద్దమండపాల అలంకరణకే రూ.5 లక్షలకు పైగా ఖర్చవుతోంది. మహారాష్ట్ర గణేశోత్సవానికి కేంద్రబిందువు. అక్కడ 7 లక్షలకుపైగా మండపాలుంటాయని అంచనా.
రాయ్‌గఢ్‌లోని పెన్ ప్రాంతం గణేశ విగ్రహాల తయారీకి ప్రసిద్ధి. అక్కడ సుమారు 600 వర్క్‌షాప్‌లలో ఏడాదికి 10 లక్షల విగ్రహాలు తయారవుతుండగా దాదాపు 2.5 లక్షలమంది ఉపాధి పొందుతున్నారు. ఈ ఒక్క ప్రాంతం విగ్రహ పరిశ్రమ వార్షిక టర్నోవర్ సుమారు రూ.200 కోట్లు. విగ్రహ తయారీదారులు, రంగులు వేసేవారు, అలంకరణ కారి్మకులు, విద్యుత్ సిబ్బంది, పూల వ్యాపారులు, పూజాసామగ్రి విక్రేతలు, స్వీట్ షాపులు, క్యాటరింగ్, రవాణా, డీజేలు, సౌండ్‌సిస్టమ్, భద్రతా సిబ్బంది.. ఇలా భారీసంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి ఈ పండగతో ముడిపడి ఉంది. విగ్రహాల తయారీలో వందలాదిమంది కళాకారులు, కార్మికులకు ఉపాధి లభిస్తోంది.
విదేశాల్లోనూ బొజ్జగణపయ్య సందడి
మారిషస్, ఫిజీ, మలేసియా, సింగపూర్, నేపాల్, ఇండోనేషియా వంటి దేశాల్లో వినాయకచవితి ప్రత్యేకంగా జరుగుతోంది. అమెరికా, కెనడా, బ్రిటన్, ఆ్రస్టేలియాల్లోను ఆలయాలు, భారతీయ సంఘాల ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇండోనేషియాలోని బాలిలో గణేశుడిని జ్ఞానం, కళలకు ప్రతీకగా భావిస్తారు. ఆగ్నేయాసియాలో అయితే గణేశుడి ఆరాధనకు శతాబ్దాల చరిత్ర ఉంది. థాయ్‌లాండ్‌లో ‘ఫ్రా ఫికానెట్’గా పూజిస్తారు. జపాన్‌లో ‘కాంగితెన్’ పేరుతో ప్రత్యేక రూపంలో గణేశుడిని ఆరాధించడం ఆశ్చర్యం కలిగించే విషయం. అమెరికా నుంచి ఆ్రస్టేలియా వరకు భారతీయ సమాజాల భాగస్వామ్యంతో గణేశోత్సవం విస్తరిస్తుండటం.. వినాయకుడి భక్తి విశ్వవ్యాప్తమని చాటుతోంది.


