సరయూ తీరంలో వెలుగుల హారతి.. ఎప్పుడంటే.. | Ayodhya to Glow with Millions of Lamps on November 7 | Sakshi
Sakshi News home page

సరయూ తీరంలో వెలుగుల హారతి.. ఎప్పుడంటే..

Sep 13 2026 11:28 AM | Updated on Sep 13 2026 11:38 AM

Ayodhya to Glow with Millions of Lamps on November 7

అయోధ్య: రామనగరి అయోధ్యలో ఈ ఏడాది దీపోత్సవానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. నవంబర్‌ 7న జరగనున్న దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రపంచ రికార్డు సృష్టించేలా భారీ సంఖ్యలో దీపాలను వెలిగించడంతోపాటు, సరయూ నది ఘాట్లను ప్రత్యేకంగా అలంకరించనున్నారు. సరయూ నది వంతెన నుంచి లక్ష్మణ ఘాట్‌ వరకు సుమారు ఒక కిలోమీటరు మేర ఉన్న ఘాట్‌ ప్రాంతాన్ని పూలు, రంగురంగుల విద్యుత్‌ దీపాలతో అలంకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సాయంత్రం వేళ దీపాల వెలుగులు, విద్యుత్‌ కాంతులు కలిసి సరయూ తీరాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నాయి. ఈ అలంకరణను దీపోత్సవంలోని ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా అధికారులు చెబుతున్నారు. దీపోత్సవం సందర్భంగా సరయూ ఘాట్ల వద్ద ఘనంగా మహా హారతి నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేద మంత్రోచ్ఛారణలు, ధార్మిక కార్యక్రమాలు, వేలాది దీపాల వెలుగుల మధ్య జరిగే ఈ హారతిలో అవధ్‌ ప్రాంతంలోని ధార్మిక, సాంస్కృతిక సంప్రదాయాలు ప్రతిబింబించనున్నాయి. సరయూ అలల మధ్య వెలిగే దీపాలు, హారతి ఘోష భక్తులకు ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు.

ఇదిలా ఉండగా, సరయూ ఘాట్ల వద్ద ప్రస్తుతం పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. దీపోత్సవం నాటికి పనులను పూర్తి చేసి ఘాట్లకు మరింత వైభవమైన రూపాన్ని తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. దీపోత్సవ నిర్వహణకు సంబంధించి వివిధ శాఖలకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. నవంబర్‌ 7న దీపోత్సవం నిర్వహించనున్నట్లు అయోధ్య జిల్లా కలెక్టర్‌ శశాంక్‌ త్రిపాఠి తెలిపారు. ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, ఘాట్ల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. దీపోత్సవం నేపథ్యంలో అయోధ్యకు వచ్చే భక్తుల్లోనూ ఉత్సాహం కనిపిస్తోంది. ఈసారి కేవలం దీపాల వెలుగులకే కాకుండా అయోధ్య ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రత్యేకంగా చాటిచెప్పేలా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నవంబర్‌ 7న దీపాలు, రంగురంగుల కాంతులు, మహా హారతి వెలుగులతో అయోధ్య మరోసారి ‘దీపాల నగరి’గా వెలిగిపోనుంది.

ఇదీ చదవండి: భారీ వర్షంలో గణేశుడు మీద పడి నలుగురు విలవిల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement