ఈ కాలానికి తగ్గ దేవుడు | Ganesh Chaturthi 2026: These 5 things to know about Ganesha | Sakshi
Sakshi News home page

ఈ కాలానికి తగ్గ దేవుడు

Sep 13 2026 11:10 AM | Updated on Sep 13 2026 11:14 AM

Ganesh Chaturthi 2026: These 5 things to know about Ganesha

మొన్న ఓల్డ్‌ బోయిన్‌పల్లి దగ్గర రోడ్డు పక్కన రెండు మూడు కిలోమీటర్ల పొడుగునా గణేష్‌ విగ్రహాలు కనిపించాయి. గణపతుల గణాలు భూమ్మీదకి దిగినట్టుగా ఉంది. అలా ఆ విగ్రహాల్ని చూస్తూ ముందుకుపోతుండగా అక్కడొకచోట ఒకాయన కనిపించాడు. ‘ఇదేమిటి! ఇక్కడ ఈ గ్రీకు పెద్దమనిషి కనిపిస్తున్నాడు’ అని కళ్ళు నులుముకుని చూసాను. సందేహం లేదు.. అతనే... పుస్తకాల్లో చూసిన ముఖమే. 

ఎపిక్టెటస్‌! 
‘మనల్ని బాధపెట్టేది జరిగే సంఘటనలు కాదు, ఆ సంఘటనల గురించి మనం ఏమనుకుంటున్నామో అది’ అని చెప్పిన గొప్ప తత్త్వవేత్త. ఒకప్పుడు బానిసగా బతికిన రోజుల్లో, అతడి యజమాని ఒకసారి అతడి మీద కోపంతో అతడి కాలు విరిచేసాడు. అందుకని ఇప్పుడు ఆ కాలున్నవైపు కొద్దిగా వాలి ఉన్నాడు. కానీ మార్కస్‌ అరీలియస్‌ లాంటి చక్రవర్తికే దారి చూపించిన వాడు.   

‘మీరేమిటిక్కడ?’ అనడిగి, ‘నాకింకా నమ్మశక్యం కాకుండా ఉంది. లేకపోతే ఒకటో శతాబ్దపు రోమ్‌ ఎక్కడ? ఈ పాత బోయిన్‌పల్లి ఎక్కడ?’ అన్నాను. ‘నువ్వేకదా నన్ను తలుచుకుంటూ ఉన్నది’ అన్నాడు ఎపిక్టెటస్‌ నా వైపు చూపు తిప్పకుండానే. ఆయన ఆ గణేష్‌ మూర్తుల్నే కళ్ళప్పగించి చూస్తున్నాడు. అప్పుడు తట్టింది, అప్పటికి రెండు మూడు రోజులుగా నేను ఆయన పుస్తకాలే చదువుతున్నానని. 

‘అంటే మీరు ఎవరు తలుచుకుంటే వాళ్ళ దగ్గర ప్రత్యక్షమవుతారా?’ అనడిగాను.‘అవును. నిన్ననే, పుణేలో ఎవరో పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ మీద పాఠాలు చెప్తూ నా మాటలు పదే పదే చెప్తూ ఉంటే అక్కడికి ΄ోక తప్పింది కాదు’ అని అంటూ ‘ఈయనేమిటి? ఇలా ఉన్నాడు... ఏథెన్సులోనూ, రోములోనూ నేనిలాంటి శిల్పాలు ఎప్పుడూ చూడలేదు’ అని అన్నాడు ఆశ్చర్యపోతూ. 

‘ఈయన వినాయకుడు, విఘ్నాధిపతి. మావాళ్ళు చెప్పేదేమంటే ఆయన మొదట్లో రైతుల దేవుడని, ప్రకృతి దేవుడని, పర్యావరణానికి దేవుడని. ఆ చెవులు చేటలు, ఆ బొజ్జ సుభిక్షానికి గుర్తు, ఆ ఎలుక రైతుల విరోధి కదా, అందుకని లొంగదీసుకున్నాడంటారు..’ అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా ఎపిక్టెటస్‌ నా వైపు తిరిగి నన్ను పరిశీలనగా చూసాడు.

‘కాదు కాదు... నువ్వు ఆ అవయవాల్ని వర్ణిస్తున్నావు. అవి అలా ఎందుకున్నాయో వివరిస్తున్నావు. నేను ఆలోచిస్తున్నది అది కాదు. నిన్న ట్రయినింగ్‌ క్లాసులో అంతా పిల్లలు... వాళ్ళ మాటలే ఇంకా నా చెవుల్లో వినబడుతున్నాయి. అందులో ఒకమ్మాయి ఆ ఫాకల్టీని అడుగుతోంది... నన్నంతా లావుగా ఉన్నావు, లావుగా ఉన్నావు అంటున్నారు, డైటింగ్‌ చెయ్యాలంటారు, యోగా చెయ్యాలంటారు... నాకు చాలా ఆందోళనగా ఉంది. నేనేం చెయ్యాలో చెప్పండి అని. 

కానీ, చూడు మిత్రమా.. బాడీ షేమింగ్‌ని పూర్తిగా జయించినవాడు ఇలా ఉంటాడు. ఎంత అన్‌ అ΄లొజిటిక్‌గా ఉన్నాడు. అచ్చం మా సోక్రటీసులాగా ఉన్నాడు. లోకం పెట్టుకునే ఏ కొలతలకీ లొంగి΄ోకుండా తను ఎలా ఉండాలనుకుంటున్నాడో అలా ఉన్నాడు. తను తనుగా. అలా ఉండాలంటే ముందు కావలసింది అటువంటి ఆత్మనిశ్చయత, అటువంటి ఆత్మనిర్భరత. ముందు నిన్ను నువ్వు అంగీకరిస్తే అప్పుడు తక్కిన లోకమంతా నిన్ను గౌరవించి తీరుతుంది. అవునూ, ఆ దంతమెందుకు విరిగిపోయింది?’ అనడిగాడు.

‘అదా.. వ్యాసుడు భారతం చెప్తూ ఉంటే ఈయన రాయడానికి కూర్చున్నాడు. మధ్యలో గంటం విరిగి΄ోయింది. కాని రాత ఆపకూడదని నియమం. అందుకని తన దంతం తనే విరుచుకుని దాంతో రాయడం మొదలుపెట్టాడంటారు’ అన్నాను. ‘ఆహా! ఆ వ్యక్తిత్వం నేనూహించినట్టే ఉంది. అలాంటి వాళ్ళు ఒక పనికి పూనుకున్నారనుకో. వెనక్కి తగ్గరు. దేనికైనా సిద్ధపడతారు. తమ ఆత్మలోంచి కొంత ధార΄ోసి అయినా సరే ముందుకు నడుస్తారు. మనకి చూడటానికి వాళ్ళు గాయపడ్డారనిపిస్తుంది. 

కాని గాయాన్ని గేయంగా మార్చుకుంటారు. అందం కాదు, ఆర్భాటం కాదు, పదిమందీ ఏమనుకుంటారన్న ఆత్రుత కాదు, అన్నిటికన్నా ముందు తాము ఒప్పుకున్న పని ఆగి΄ోకుండా ముందుకు నడిచిందా లేదా. అంతే. అదే వాళ్ళకి నిజమైన అలంకారం’ అని అన్నాడు వెలుగు చిమ్ముతున్న చూపుల్తో. ‘అలా అయితే ఆ ఎలక సంగతేమిటి?’ అనడిగాను. ‘ఇందాకా నువ్వు ఈయన్ని రైతుల దేవుడని చెప్పావు. ఒక్క రైతులకే ఎందుకు? ఈయన మనుషులందరికీ దేవుడని ఆ ఒక్క ఎలకని బట్టి చెప్పొచ్చు. ఎలక చూడు. 

ఎంత రెస్ట్‌లెస్‌గా ఉంటుంది! నిలకడ లేని జీవి. ఊరికే పరుగెట్టుకుంటూపోతుంది. కాని ఆయన దాన్ని వాహనంగా మార్చుకున్నాడు. అంత పెద్ద శరీరం, అంత చిన్న వాహనం. ఎవరేనా తమ యాంగ్జయిటీని అదుపు చేసుకోగలిగితే అలానే ఉంటుంది, చిన్న ఎలక మీద ఏనుగు వూరేగినట్టు. అద్భుతం కదా’ అని అన్నాడు.‘మరి ఆ చెవుల సంగతేమిటి?’ అనడిగాను. ఈలోపు ట్రాఫిక్‌ జామ్‌ అవుతున్నట్టుంది. ఒకటే హారన్లు. ఎపిక్టెటస్‌ ఆ ట్రాఫిక్‌ కేసి చూసాడు. 

‘ఇప్పుడు కాదులే, మరోసారి మాట్లాడుకుందాం, ఇప్పటికైతే ఒక్క మాట గుర్తుపెట్టుకో. ఈయన సరిగ్గా ఇప్పటి కాలానికి తగ్గ దేవుడు. ట్రూ పర్సనాలిటీ కోచ్‌. అన్నిటికన్నా ముందు మనం ఎలా బతకాలో చెప్తున్నాడు. నువ్వు ఎలా ఉన్నావన్న దానికి ఎవరికీ సంజాయిషీలిచ్చుకోనక్కర్లేదు. నిన్ను నువ్వు అంగీకరించు. ఎవరు ఏం చెప్పినా చెవులు చాటంత చేసుకుని విను. 

కానీ ఊరికే ఆందోళన పడి΄ోకు. నువ్వెలా బతకాలో నీ స్క్రిప్టు నువ్వే రాసుకో. అవసరమైతే నీలో ఒక భాగాన్ని తుంచెయ్యవలసి వస్తే తుంచెయ్యి. ఒక్క భాగమేమిటి? నీకు  అప్పగించిన పనికి అవసరమైతే నిన్ను నువ్వే మూల్యంగా చెల్లించుకోడానికి సిద్ధపడు. గుర్తుపెట్టుకో నువ్వు ఏం చెయ్యాలనుకున్నా ముందు నీకు నువ్వే ఒక పెద్ద అడ్డంకి. నిన్ను నువ్వు జయించుకున్నావా! నీకు తిరుగులేదు’ అని అంటూ వడివడిగా నడుచుకుంటూ ఆ జన సందోహంలో కలిసి΄ోయాడు, ఆ మహాతత్త్వవేత్త ఎపిక్టెటస్‌.

వాడ్రేవు చిన వీరభద్రుడు
 

(చదవండి: ఘనమైన ఆసనం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement