దూర్వాంకుర మహిమ | Ganesh Chaturthi 2026: Durvankur Mahima | Sakshi
Sakshi News home page

దూర్వాంకుర మహిమ

Sep 13 2026 3:44 AM | Updated on Sep 13 2026 3:45 AM

Ganesh Chaturthi 2026: Durvankur Mahima

కౌండిన్య మహర్షి గణేశుని పరమభక్తుడు. ఆయన తన ఆశ్రమంలోని గణేశ ప్రతిమకు దూర్వాంకురాలతో నిత్యం పూజించేవాడు. ఆయన భార్య ఆశ్రయ ఒకనాడు ‘స్వామీ! మీరు దూర్వాంకురాలతో గణేశుని ఎల్లప్పుడూ పూజిస్తుంటారు కదా, దూర్వాంకురాలు అంత మహిమాన్వితమైనవా?’ అని అడిగింది. కౌండిన్యుడు ఆమెకు దూర్వాంకుర మహిమ గురించి అనేక పురాణగాథలు చెప్పాడు. కౌండిన్యుడు చెప్పిన గాథలను ఆలకించినప్పటికీ ఆశ్రయకు దూర్వాంకుర మహిమ పట్ల మనసులో సంశయాలు తొలగిపోలేదు. కౌండిన్యుడు తన భార్య మనోగతాన్ని గ్రహించాడు. ఆమె సంశయాలు తొలగిపోవాలంటే, దూర్వాంకుర మహిమ ఎంతటితో ఆమెకు స్వయంగా తెలిసిరావాలి అని భావించాడు.

కౌండిన్యుడు ఆమె చేతికి ఒక దూర్వాంకురాన్ని ఇచ్చి, ‘దేవీ! నువ్వు ఈ దూర్వాంకురాన్ని తీసుకుని ఇంద్రుడి వద్దకు వెళ్లు. దీనికి సరిసమానమైన స్వర్ణాన్ని నేను అడిగినట్లు అతడికి చెప్పుడు. ఈ దూర్వాంకురం కంటే ఏమాత్రం ఎక్కువ గాని, తక్కువ గాని స్వర్ణాన్ని స్వీకరించకు’ అని చెప్పాడు.

భర్త ఆదేశంతో ఆశ్రయ దేవేంద్రుడి వద్దకు వెళ్లి, భర్త తనకు ఇచ్చిన దూర్వాంకురాన్ని అతడికి ఇచ్చి, ‘దేవేంద్రా! ఈ దూర్వాంకురానికి సరిసమానమైన స్వర్ణాన్ని తీసుకురమ్మని నా భర్త నీ వద్దకు పంపాడు. దీని కంటే నాకు లేశమైనా ఎక్కువా వద్దు, తక్కువా వద్దు’ అని పలికింది.

‘సాధ్వీమణీ! ఈమాత్రం దానికి నువ్వు ఇక్కడి వరకు రావాలా? నీ భర్త ఆదేశమై సందేశాన్ని పంపితే, సాక్షాత్తూ స్వర్గాన్ని పంపమన్నా పంపుతాను కదా’ అని, ఒక దేవదూతను పిలిచి, ‘ఈ సాధ్వీమణిని కుబేరుని వద్దకు తీసుకుపోయి, ఈమెకు ఈ దూర్వాంకుర సమానమైన స్వర్ణాన్ని ఇవ్వమని నా ఆజ్ఞగా చెప్పు’ అని పంపాడు.
దేవదూత ఆశ్రయను తీసుకుని కుబేరుడి వద్దకు వెళ్లి, దేవేంద్రుడి సందేశాన్ని చెప్పాడు. 
‘దూర్వాంకుర సమానమైన స్వర్ణాన్ని కోరడానికి ఇంతదూరం వచ్చిన కౌండిన్య పత్నికి ఏమైనా మతిభ్రమణం కలిగిందా? ఈమెను నా వద్దకు పంపిన దేవేంద్రుడు ఏమైనా మాయలో పడ్డాడా?’ అని అనుకుని, కొద్దిసేపు ఆలోచించాడు కుబేరుడు.

కేవలం దూర్వాంకుర పరిమాణంలోని స్వర్ణాన్ని మాత్రమే ఇచ్చి పంపిస్తే, ధనాధిపతి అయిన తన పరువు ఏం కావాలని భావించి, ఆశ్రయ ముందు అనేక మణుగుల బంగారం ఉంచాడు. ఆమెకు కాస్త ఆశ పుట్టినా, భర్త పట్ల భయం వల్ల ‘నా భర్త ఆదేశం మేరకు దూర్వాంకుర పరిమాణంలోని స్వర్ణమే చాలు. అంతకు ఎక్కువా వద్దు, తక్కువా వద్దు’ అని పలికింది.

కుబేరుడు ఒక చిన్న త్రాసు తెప్పించి, ఒకవైపు దూర్వాంకురాన్ని ఉంచి మరోవైపు బంగారాన్ని వేయడం మొదలుపెట్టాడు. ఎంత బంగారం వేసినా, చాలడం లేదు. కుబేరుడు ఒక పెద్ద త్రాసు తెప్పించి బంగారం వేసినా, ఫలితం లేకపోయింది. ఈసారి మరింత భారీ తక్కెడను తెచ్చి, అందులో తన యావత్‌ సంపదను వేసినా, అదంతా దూర్వాంకురానికి సమానం కాలేదు. సర్వాలంకార భూషిత అయిన తన భార్యను తక్కెడలో కూర్చోబెట్టాడు, చివరకు తాను కూడా స్వయంగా కూర్చున్నాడు. అయినా దూర్వాంకురం ఉంచిన వైపు తక్కెడ పాత్ర వీసమంతైనా పైకి లేవలేదు. దిక్కుతోచని కుబేరుడు తన సాటి దిక్పాలకులకు, త్రిమూర్తులకు కబురు పెట్టాడు. వారందరూ తమ తమ సమస్త సంపదలను తీసుకువచ్చినా, ఫలితం కనిపించలేదు. వారందరికీ ఇదేదో పెనుమాయగా అనిపించింది.

ఇదేదో కౌండిన్యుడినే అడిగి తెలుసుకోవాలని భావించి, దేవతలందరూ కలసి కౌండిన్యుడి వద్దకు వెళ్లారు. ‘మహానుభావా! పూర్వపుణ్యం వల్ల నీ దర్శనభాగ్యం లభించింది. నీ ధర్మపత్ని మా అహంకారాన్ని సర్వం హరించింది. మాకు దూర్వాంకుర మహిమ తెలియదు. త్రిలోకాలు కూడా దీని మహిమకు సాటిరావు. నువ్వు భక్తిగా గణేశుడి మస్తకాన్ని అలంకరించిన ఈ దూర్వాంకుర మహిమను ఎవరు తెలుసుకోగలరు? సమస్త యజ్ఞ, దాన, తపో, వ్రత, స్వాధ్యాయములలో ఏదీ దూర్వాంకుర సమర్పణకు సరిసాటి కాదు. శ్రీగణేశుని అనునిత్యం ఆరాధించే నీ మహిమను మాత్రం ఎవరు తెలుసుకోగలరు?’ అని కౌండిన్యుడిని కొనియాడారు. అనంతరం వినాయకుడిని వేనోళ్ల స్తుతించి, తమ తమ లోకాలకు తిరిగి వెళ్లిపోయారు.

ఈ సంఘటనతో ఆశ్రయకు తన భర్త గణనాథుని అర్చనకు ఉపయోగించే దూర్వాంకుర మహిమ పూర్తిగా అవగతమైంది. ‘స్వామీ! మీ మాటలను శంకించాను, మన్నించండి.’ అని పలికింది. ఆమె కూడా భర్తతో కలసి దూర్వాంకురాలతో శ్రీగణేశుని భక్తితో అర్చించడం ప్రారంభించింది. ప్రతిరోజూ ఆ దంపతులు ప్రాతఃకాలంలో దూర్వాంకురాలతో గణపతిని అర్చించసాగారు. కొన్నాళ్లకు గణేశుడు వారికి మోక్షాన్ని అనుగ్రహించాడు.
∙సాంఖ్యాయన 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement