వినాయక చవితి
జయ జయ జగదేక రక్షామణీ!
దేవ చూడామణీ శ్రేణి శోణ ప్రభాజాల బాలా తప స్మేర పాదారవిందా!
ముకుందప్రియా! యిందుధారీ!
కటస్యంది దానాంబుధారా ధునీ ధోరణీ గాహ కౌతూహలాయత్త మత్త ద్విరేఫాంగనా గాన సంగీత రంగీకృతస్వాంత!
దంతావ ళాస్యా! నమస్యా! త్రిలోకైక వశ్యా! యవశ్యాయ శైలాత్మజా ధర్మసంతాన!
సంతాన కల్పద్రు పుష్పావతంసా! యసారోరు సంసార మాయాంధకారా హృతిప్రక్రియా భాస్కరా!
కోటిభాస్వన్నిరాఘాట దేహ ప్రభాభాస్వరా! దేవ! హేరంబ! లంబోదరా! యేక దంతా! మహాకాయ! సంతప్త కార్తస్వరాభా!
విశాలాక్ష మౌంజీధరా! నాగ యజ్ఞోపవీతా సమన్విత కృష్ణాజినా!
యాఖువాహా! కుఠారాయుధా! విఘ్నరాజా! గణాధ్యక్ష!
కారుణ్య లీలా కటాక్షంబునన్ మమ్ము వీక్షించి రక్షింపుమీ!
క్షీర వారాళి నీ మందరక్ష్మాధర స్వామి కవ్వంబుగా, నీ భుజంగాధినాథుండు సూత్రంబుగా, గచ్ఛపాధీశుడాధార పీఠంబుగా, సర్వదివ్వౌషధీ వల్లులన్ వైచి, నానా పదార్థంబుల న్వెన్నలం బంచుకో గోరి యున్నార, మిక్కార్య మే విఘ్నముం బొందకుండంగ, నే విక్రియం జెంద కిష్టార్థ సంసిద్ధులం గైకొనుం గాక నీ యాజ్ఞ సర్వేశ సర్వాత్మకా!
నిర్వికల్పా! నిరీహా! నిరాంతక! నిశ్శంక! యోంకార మూర్తీ! నమస్తే! నమస్తే! నమః
ఇవీ చదవండి: వరసిద్ధి వినాయక పూజ.. విఘ్నేశ్వరుని పూజాద్రవ్యములు


