వినాయక నిమజ్జనానికి ఆర్టీఏ వాహనాల సేకరణ
భారీ ట్రేలర్లు, లారీలు, మినీ వాహనాలు సిద్ధం
14 ప్రాంతాల నుంచి వాహనాల పంపిణీ
భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నుంచి కూపన్లు
సాక్షి, హైదరాబాద్: వినాయక నిమజ్జనోత్సవానికి కావలసిన వాహనాలను ముందస్తుగా బుక్ చేసుకునేందుకు ఆర్టీఏ సదుపాయం కల్పించింది. మండపాల డిమాండ్ మేరకు వాహనాలను అందజేసేందుకు చర్యలు చేపట్టింది. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నుంచి తమకు చేరే కూపన్‌లకు అనుగుణంగా వాహనాలను అందజేయనున్నట్లు హైదరాబాద్ జేటీసీ డాక్టర్ కె.వెంకటరమణ తెలిపారు.
క్యూర్ పరిధిలో 14 చోట్ల వాహనాలను సేకరించి మండపాల నిర్వాహకులకు అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. భారీ ట్రేలర్లు మొదలుకొని టస్కర్లు, లారీలు, డీసీఎంలు, టాటా ఏస్‌లు వంటి వివిధ రకాల వాహనాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.
ఇందుకోసం ప్రాంతీయ రవాణా అధికారులు, మోటారు వాహన తనిఖీ ఇన్‌స్పెక్టర్‌లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గతేడాది కంటే ఈ సారి వాహనాలకు ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉన్నట్లు అంచనా.
మండపాల నిర్వాహకులు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధుల నుంచి ముందస్తుగా కూపన్లు తీసుకొని తమను సంప్రదించాలని జేటీసీ తెలిపారు.
ఖైరతాబాద్, అంబర్‌పేట్ జీహెచ్‌ఎంసీ గ్రౌండ్స్, తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయం, కాటేదాన్ ఫ్లై ఓవర్, గచ్చిబౌలీ జీఎంసీ బాలయోగి స్టేడియం, నాగోల్ డ్రైవింగ్ ట్రాక్, కర్మన్‌ఘాట్ మందమల్లమ్మ ఫంక్షన్ హాల్, మన్నెగూడ ఆర్టీఏ కార్యాలయం, మేడ్చల్ రవాణా కార్యాలయం, మియాపూర్ క్రాస్‌రోడ్స్, పటాన్‌చెరు, తదితర 14 చోట్ల వాహనాలను అందజేయనున్నారు.
అనుభవం, నైపుణ్యం కలిగిన డ్రైవర్లు మాత్రమే నిమజ్జన వాహనాలను నడపాలని, రోడ్డుభద్రత నిబంధనలు కచ్చితంగా పాటించాలని జేటీసీ వెంకటరమణ పేర్కొన్నారు. ప్రమాదాలకు ఆస్కారం ఇవ్వొద్దన్నారు.
నిమజ్జన వాహనాల అద్దెలు..
రెండు ఆక్సిల్ కలిగిన భారీ ట్రేలర్‌లు లేదా టస్కర్ : రూ.33000
మూడు ఆక్సిల్ కలిగిన ట్రేలర్లు, టస్కర్లు : రూ.35000
2 టైర్ల సామర్ధ్యం కలిగిన హెవీగూడ్స్ వాహనాలు: రూ.రూ.4500. (డీజిల్ ఖర్చు, డ్రైవర్‌కు రూ.500 బత్తా అదనం.)
6 టైర్ల సామర్ధ్యం కలిగిన లారీలకు : రూ.3500,
మిడిల్ గూడ్స్ వెహికల్స్‌కు : రూ.2500
డీసీఎం వంటి లైట్‌గూడ్స్ వెహికల్స్‌కు : రూ.2000,
టాటాఏస్‌లు : రూ.1500
ఇదీ చదవండి: ఏనుగు బొజ్జ.. చిన్న ఎలుక.. ఇందులో ఇంత పెద్ద తత్త్వమా?


