12 గంటలు ఉత్త 'కోతలే' | Disrupted agricultural power supply in Telangana with Power Cuts | Sakshi
Sakshi News home page

12 గంటలు ఉత్త 'కోతలే'

Sep 13 2026 1:47 AM | Updated on Sep 13 2026 1:47 AM

Disrupted agricultural power supply in Telangana with Power Cuts

అస్తవ్యస్తంగా వ్యవసాయ విద్యుత్‌ సరఫరా  

ఉత్తమాటగానే 12 గంటలపాటు నిరంతర కరెంట్‌ 

దఫాల వారీగా కోతలు.. ఇచ్చేది 5 నుంచి 8 గంటలే..  

ఓవర్‌లోడ్, లోఓల్టేజీతో కాలిపోతున్న ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు.. బోర్లు

బావుల్లో నీరు ఉన్నా.. తడులందక ఎండుతున్న పంటలు 

పలు జిల్లాల్లో రోడ్డెక్కి నిరసన తెలుపుతున్న రైతులు

విద్యుత్‌ కోతలతో నీరందించలేక ఎండిపోతున్న పొలాన్ని చూపిస్తున్న ఈ మహిళా రైతు పేరు ఈదెమ్మ. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం పెగడబండకు చెందిన ఈమె పది ఎకరాల్లో వరి సాగు చేసింది. రెండు బోర్లలో నీళ్లున్నా.. కరెంట్‌ కోతలతో పారించలేకపోతోంది. ఉదయం 7.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు త్రీఫేస్‌ కరెంట్‌ ఇస్తున్నారని.. మధ్యమధ్యలో నాలుగైదు పర్యాయాలు కోత పెడుతున్నారని.. మొత్తంగా 8 గంటలు ఇవ్వడం లేదని చెబుతోంది. ఇప్పటివరకు 8 ఎకరాల్లో పంట ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇప్పటివరకు 1.80 లక్షల పెట్టుబడి కాగా.. కరెంట్‌ ట్రిప్, లోఓల్టేజీతో మూడుసార్లు మోటారు కాలిపోయిందని.. దీనికి అదనంగా సుమారు రూ.25 వేలు ఖర్చయిందని వాపోయింది.  

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఎల్‌నినో, వర్షాభావంతో రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్‌లో పంటలు సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. వరుణుడు కరుణించకపోతాడా అనే ఆశతో వర్షాధారంగా సాగు చేసిన పంటలు ఇప్పటికే చేతికందకుండా పోయాయి. బోర్లు, బావుల కింద వేసినవి సైతం ఎండుముఖం పడుతుండటంతో రైతాంగం కన్నీరుమున్నీరవుతోంది. వ్యవసాయానికి త్రీఫేస్‌ కరెంట్‌ సరఫరాలో అప్రకటిత కోతలు అమలు చేస్తుండడమే ఇందుకు కారణం. నీళ్లున్నా, విద్యుత్‌ కోతలతో తడులందించలేని దుస్థితిలో పలు ప్రాంతాల్లో రైతులు రోడ్డెక్కుతున్నారు. 

దాదాపుగా 5 నుంచి 8 గంటలు మాత్రమే.. 
రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్‌లో మొత్తంగా 1,19,55,375 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో వరి 50,92,817, పత్తి 48,21,503 ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయశాఖ నివేదికలు చెబుతున్నాయి. మొత్తం సాగులో వరి, పత్తి పంటల వాటా 82.9 శాతంగా ఉంది. అయితే వ్యవసాయానికి 12 గంటలపాటు త్రీఫేస్‌ విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా.. ఐదు నుంచి ఎనిమిది గంటలే ఇస్తున్నట్లు ‘సాక్షి’బృందం పరిశీలనలో తేలింది. ఉదయం 5.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిరంతరాయంగా త్రీఫేస్‌ విద్యుత్‌ సరఫరా చేయాల్సి ఉండగా.. దఫాల వారీగా అనధికారికంగా కోతలు అమలు చేస్తున్నారు. జిల్లాల వారీగా సరఫరా సమయాలతోపాటు కోతల సమయంలోనూ తేడాలు ఉన్నాయి.  

ఒక్కో జిల్లాలో ఒక్కోలా.. 
– జోగుళాంబ గద్వాల జిల్లాలో జిల్లాలో వ్యవసాయానికి కేవలం ఐదారు గంటలు మాత్రమే త్రీఫేస్‌ కరెంట్‌ ఇస్తున్నారని.. అది కూడా లో ఓల్టేజీతో సరఫరా చేస్తుండడంతో మోటార్లు కాలి పోతున్నాయి.  
– ఖమ్మం జిల్లాలో రోజుకు ఐదు నుంచి ఏడు గంటలే వ్యవసాయ విద్యుత్‌ సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రాంతాల వారీగా ఉదయం 8 నుంచి 12 గంటల వరకు కోత పెడుతుండడంతో చివరి పంటకు నీరందడం లేదు. వేంసూర్‌ మండలంలో బోరుబావుల్లో నీళ్లున్నా.. తడులందకపోవడంతో పలువురు రైతులు ఎండిన వరిని తొలగించి.. జొన్న సాగు చేపట్టారు. 
– కామారెడ్డి జిల్లాలో రోజుకు ఆరు నుంచి ఏడు గంటలు మాత్రమే వ్యవసాయానికి త్రీఫేస్‌ విద్యుత్‌ సరఫరా చేస్తున్నట్టు రైతులు చెబుతున్నారు. కరెంట్‌ ట్రిప్‌ కావడం, లోఓల్టేజీ సమస్యతో మోటార్లు తరచు కాలిపోతున్నాయని.. ఒకసారి మరమ్మతుకు వస్తే అదనంగా రూ.10 వేల వరకు ఖర్చు వస్తోందన్నారు.  
– నిజామాబాద్‌ జిల్లాలో ఉదయం 8, 9 గంటలకు మొదలై సాయంత్రం 5 గంటల వరకు త్రీఫేస్‌ కరెంట్‌ ఇస్తున్నారు. మధ్యమధ్యలో రెండు గంటల పాటు కోత పెడుతున్నారు.  
– ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వ్యవసాయ కరెంట్‌ ఉదయం 7.30 గంటలకు ఇస్తున్నారు. మధ్యమధ్యలో కోతలతో మొత్తం 8 గంటలపాటే సరఫరా చేస్తున్నట్లు రైతులు తెలిపారు. 

విద్యుత్‌ వినియోగం భారీగా పెరగడంతో.. 
గత ఏడాది ఇదే నెల తొమ్మిదిన గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ 15,906 మెగావాట్లు కాగా.. ఈ సంవత్సరం అదే సమయంలో గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ ఆల్‌టైం రికార్డుస్థాయిలో 19,543 మెగావాట్లకు చేరింది. ఈ లెక్కన 23 శాతం మేర పెరిగినట్లు తెలుస్తోంది. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావంతో రైతులు పూర్తిగా బోరు బావులపైనే ఆధారపడాల్సి రావడం, పంప్‌ సెట్ల నిరంతర వాడకంతో వ్యవసాయ విద్యుత్‌ వినియోగం అమాంతంగా పెరిగినట్లు స్పష్టమవుతోంది.  

కనీసం 15 గంటలు ఇవ్వాలి.. 
నాకు సొంతంగా ఉన్న 3 ఎకరాల్లో మిరప, మరో 7 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశా. రెండు బోర్లు ఉన్నా, రోజుకు 8 గంటలు కూడా కరెంట్‌ ఇవ్వడం లేదు. దీంతో పత్తి పంటకు నీరందించలేక పోతున్నా. దీంతో ఎదుగుదల లేకుండా పోగా.. ఎకరాకు కనీసం క్వింటా దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. మిరపకు మాత్రమే తడులు పెడుతున్నా. వ్యవసాయానికి ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం 15 గంటలు నాణ్యమైన కరెంట్‌ సరఫరా చేయాలి 
– లక్ష్మీనారాయణ, రైతు, అయిజ, జోగుళాంబ గద్వాల 

కోతలు లేకుండా సరఫరా చేయాలి 
తొలుత వచ్చిన గోదావరి జలాలు, వ్యవసాయ బోరు నమ్ముకొని ఐదు ఎకరాల్లో వరి సాగు చేశా. ఎండలకుతోడు విద్యుత్‌ శాఖ ఎడాపెడా కోతలు విధిస్తుండడంతో ఒక మడి తడిసి మరో మడిలోకి నీరు పోవడం లేదు. దీంతో ఏ మడికామడికి పైపులు వేస్తూ పంటను కాపాడుకునేందుకు కష్టాలు పడుతున్నా. కోతల్లేని విద్యుత్‌ అందిస్తేనే పంట చేతికి వచ్చే అవకాశం ఉంది. 
– ఎ.సత్యనారాయణరెడ్డి, రైతు, అడసర్లపాడు, వేంసూరు, ఖమ్మం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement