ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల సందర్భంగా షాకింగ్ పరిణామం చోటుచేసుకుంది. ఏడేళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. ప్రధాని మోదీ ఇచ్చిన ప్రత్యేక విందుకు మాత్రం హాజరుకాలేదు. శనివారం జరిగిన బ్రిక్స్ సదస్సులో మోదీతో ద్వైపాక్షిక భేటీ నిర్వహించిన జిన్‌పింగ్.. రాత్రి జరిగిన గాలా డిన్నర్‌కు దూరంగా ఉండటం ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
కాగా, ప్రధాని మోదీ శనివారం బ్రిక్స్ దేశాల అధినేతలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల కోసం విందును ఏర్పాటు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. అయితే జిన్‌పింగ్ మాత్రం విందుకు రాలేదు. ఆయన ఎందుకు హాజరుకాలేదన్న దానిపై అధికారికంగా ఎలాంటి కారణం వెల్లడికాలేదు. అయితే ఓ వర్గం సమాచారం ప్రకారం.. సదస్సు కార్యక్రమాల తర్వాత జిన్‌పింగ్ హోటల్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ కూడా విందుకు హాజరుకాలేదు. అయితే ఆయన సదస్సు కార్యక్రమాల్లో పాల్గొని స్వదేశానికి తిరిగి వెళ్లారు. జిన్‌పింగ్ గైర్హాజరుపై కారణం స్పష్టత లేకపోవడంతో ఆయన నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఏడేళ్ల తర్వాత భారత్‌లో అడుగుపెట్టిన జిన్‌పింగ్.. మోదీతో డిన్నర్‌కు దూరంగా ఉండటం ఆసక్తిని రేపుతోంది. అయితే ఇది కేవలం విశ్రాంతి కోసమేనా.. లేక మరేదైనా కారణమా అన్నది మాత్రం అధికారికంగా తేలాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. నిన్న (సెప్టెంబర్ 12) మోదీ-జిన్‌పింగ్ మధ్య సుమారు 50 నిమిషాల పాటు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ప్రధానంగా సరిహద్దు వివాదం, వాణిజ్య లోటు, మార్కెట్ యాక్సెస్, సరఫరా చైన్, రవాణా-ప్రజల మధ్య సంబంధాలు ప్రస్తావనకు వచ్చాయి. ముఖ్యంగా సరిహద్దు విషయంలో న్యాయబద్ధమైన, సహేతుకమైన, పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం పనిచేయాలని ఇద్దరూ అంగీకరించారు. మోదీ ఇప్పటికే ఉన్న సరిహద్దు ఒప్పందాలు, అవగాహనలను గౌరవించాలని స్పష్టం చేశారు. ఇక ఆర్థిక అంశాల్లో భారత్-చైనా మధ్య వాణిజ్య అసమతుల్యతను తగ్గించడం, మార్కెట్ యాక్సెస్‌ను సులభతరం చేయడం, సప్లై చెయిన్ సమస్యలను పరిష్కరించడంపై చర్చ జరిగింది. రెండు దేశాల మధ్య విమానాలు, వీసాలు, కైలాస్ మానసరోవర్ యాత్ర వంటి సంబంధాలు కూడా క్రమంగా పునరుద్ధరిస్తున్నాయి.
ఇదీ చదవండి: సముద్రం అడుగున బంగారు ఖజానా.. చైనా సంచలన అన్వేషణ!


