రూ.18 వేల గదికి రూ.80 వేల అద్దె
రూ.20 వేల గదికి రూ.2.3 లక్షలు వసూలు చేస్తున్న హోటళ్లు
సెంట్రల్ ఢిల్లీ నుంచి ఏరోసిటీ, గురుగ్రామ్, నోయిడా వరకు భారీ బుకింగ్స్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు హోటల్ పరిశ్రమకు భారీ డిమాండ్‌ను తీసుకొచ్చింది. ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు జరుగుతున్న ఈ సదస్సుకు వివిధ దేశాల అధినేతలు, దౌత్యవేత్తలు, మంత్రులు, ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో, ఢిల్లీ–ఎన్‌సీఆర్ పరిధిలో హోటల్ గదులకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. సుమారు 3 వేల గదులు బుక్కయినట్లు సమాచారం. హోటల్ గది అద్దెలు కూడా భారీగానే పెరిగాయి.
రూ.80 వేల నుంచి రూ.2.3 లక్షల దాకా
సాధారణ రోజుల్లో ఫైవ్‌స్టార్ హోటళ్లలో రూ.10వేల నుంచి రూ.18 వేల వరకు ఉండే లగ్జరీ హోటల్ గది అద్దె ప్రస్తుతం రూ.80 వేలు, అంతకంటే ఎక్కువకు చేరినట్లు హాస్పిటాలిటీ రంగ వర్గాలు వెల్లడించాయి. మరికొన్ని ఫైవ్‌స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లలో రోజుకు రూ.18వేల నుంచి రూ.25 వేల వరకు అద్దె వసూలు చేసే హోటళ్లు ఇప్పుడు రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. హోటల్ ఐటీసీ మౌర్యాలో గదికి 11, 12వ తేదీల్లో కేవలం ఒకే ఒక్క రాత్రికిగాను ఏకంగా రూ.2.30 లక్షల బిల్లు వేయడం గమనార్హం.
కొన్ని హోటళ్లలో గదులు పూర్తిగా బుక్ కాగా, మరికొన్ని చోట్ల గదులు అందుబాటులో లేకుండా పోయాయి. సదస్సు ముగిసిన తర్వాత కూడా కొంతకాలం ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని, దాదాపు సెప్టెంబర్ 20 వరకు టారిఫ్‌లు అధికంగానే ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. హోటల్ ‘ఐటీసీ మౌర్య’లో రష్యా అధ్యక్షుడు పుతిన్ బస చేస్తున్న క్రమంలో ఆయన దృష్టిని ఆకర్షించేందుకు వారం రోజుల ముందే దేశంలోని సంపన్న వర్గాలకు చెందిన వారు సైతం ఆ హోటల్లో ప్రైవేటు గదులను బుక్ చేసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ బస చేసిన తాజ్ ప్యాలెస్‌లోని గదులకూ డిమాండ్ ఆకాశాన్నంటింది.
సెంట్రల్ ఢిల్లీకే పరిమితం కాని డిమాండ్
బ్రిక్స్ శిఖరాగ్రం ప్రభావం కేవలం సెంట్రల్ ఢిల్లీలోని ఒబెరాయ్, తాజ్ ప్యాలెస్, లీలా ప్యాలెస్ వంటి ఫైవ్‌స్టార్ హోటళ్లకే పరిమితం కాలేదు. ఏరోసిటీ, గురుగ్రామ్, నోయిడా ప్రాంతాల్లోని హోటళ్లకూ భారీగా బుకింగ్స్ వచ్చాయి. అనేక హోటళ్లలో గదుల లభ్యత దాదాపు లేనట్లు సమాచారం. ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ సభ్యుడు రాజన్ సెహగల్ మాట్లాడుతూ.. బ్రిక్స్ సదస్సు భారత్ ఆతిథ్య, పర్యాటక రంగానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించే గొప్ప అవకాశమని అన్నారు. ప్రపంచ దేశాల అధినేతలు, భారీ ప్రతినిధి బృందాలతో భారత్‌కు వస్తున్నప్పుడు హోటళ్లలో డిమాండ్ పెరగడం సహజమేనని తెలిపారు. ల్యూటెన్స్ ఢిల్లీతో పాటు ఎన్‌సీఆర్‌లోని హోటళ్లు కూడా భారీ బుకింగ్స్‌తో కళకళలాడుతున్నాయని చెప్పారు.
అధినేతల కోసం అత్యున్నత స్థాయి గదులు
దేశాధినేతలు, మంత్రులు, సీనియర్ దౌత్యవేత్తలు, ఉన్నతాధికారులు సాధారణంగా హోటళ్లలో అత్యున్నత కేటగిరీ గదులనే ఎంచుకుంటారని కేంద్ర అధికారిక వర్గాలు చెబుతున్నాయి. దీంతో పరిమిత సంఖ్యలో ఉన్న ప్రీమియం గదులకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగి అద్దెలు భారీగా పెరిగాయి.
భారత ఆతిథ్యానికి ప్రపంచ వేదిక
బ్రిక్స్ సదస్సు కేవలం హోటల్ రంగానికి వ్యాపార అవకాశాలను కల్పించడమే కాకుండా.. ప్రపంచానికి భారతీయ సంçస్కృతి, సంప్రదాయాలు, ఆహారం, సంగీతం, నృత్యాలు, ఆతిథ్యాన్ని పరిచయం చేసేందుకు గొప్ప అవకాశమని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. భారత్ ఇప్పటికే జీ20, ఏఐ సదస్సు వంటి అంతర్జాతీయ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిందని గుర్తుచేస్తూ.. బ్రిక్స్ సదస్సుతో కూడా దేశ పర్యాటక రంగానికి మరింత అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని అంటున్నాయి.
ప్రాంతీయ వంటకాలు.. సాంస్కృతిక కార్యక్రమాలు
బ్రిక్స్ ప్రతినిధులకు మన దేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతీ సంప్రదాయాలు, వంటకాలను పరిచయం చేస్తున్నట్లు ఢిల్లీ హోటల్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ చైర్మన్ మురళీమణి మీడియాకు తెలిపారు. దేశంలోని ప్రతి రాష్ట్రానికీ ప్రత్యేకమైన సంçస్కృతి, ఆహార వైవిధ్యం ఉందని, అందుకు అనుగుణంగా వివిధ రకాల వంటకాలను హోటళ్లలో అందిస్తున్నట్లు చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. బడ్జెట్ హోటళ్లలోనూ ప్రాంతీయ వంటకాలను అందించేలా హోటల్ యాజమాన్యాలకు కేంద్రం ముందుగానే సూచనలు చేసినట్లు తెలిసింది.


