ట్రంప్‌ చిన్ననాటి ఇంటికి భారీ ధర! | Trump's Childhood Home Sells for 1.93 Million After Renovation | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ చిన్ననాటి ఇంటికి భారీ ధర!

Sep 13 2026 8:38 AM | Updated on Sep 13 2026 8:41 AM

Trump's Childhood Home Sells for 1.93 Million After Renovation

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చిన్ననాటి ఇల్లు దాదాపు 2 మిలియన్‌ డాలర్లకు అమ్ముడైంది. న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో ఉన్న ట్యూడర్‌ శైలికి చెందిన ఈ ఇంటిని పునరుద్ధరించిన అనంతరం 1.93 మిలియన్‌ డాలర్లకు విక్రయించారు. ఒకప్పుడు బూజు పట్టి, నీటి చెమ్మతో నిండిపోయి, పిల్లులు తిరుగాడే ఈ భవనం ప్రస్తుతం ఆధునిక నివాసంగా మారింది. ట్రంప్‌ నాలుగేళ్ల వయసు వరకు ఈ ఇంట్లో నివసించారు.

జమైకా ఎస్టేట్స్‌ ప్రాంతంలో ఉన్న ఈ ఇంటిని ట్రంప్‌ తండ్రి, డెవలపర్‌ ఫ్రెడ్‌ ట్రంప్‌ 1940లో నిర్మించారు. అయితే కొన్నేళ్లుగా ఈ ఆస్తి ట్రంప్‌ కుటుంబం ఆధీనంలో లేదు. జూలైలో కొనుగోలు ఒప్పందం కుదరగా.. విక్రయ ధర శుక్రవారం రియల్‌ ఎస్టేట్‌ వెబ్‌సైట్లలో వెల్లడైంది. కొనుగోలుదారు వివరాలను మాత్రం బహిర్గతం చేయలేదు.
ఐదు బెడ్‌రూమ్‌లు, మూడు బాత్‌రూమ్‌లు ఉన్న ఈ ఇంటిని డెవలపర్‌ టామీ లిన్‌ గతేడాది 8,35,000 డాలర్లకు కొనుగోలు చేశారు. అప్పటికే అది చాలా కాలంగా ఖాళీగా ఉండటంతో పాడుబడింది. అనంతరం సుమారు 5 లక్షల డాలర్లు వెచ్చించి, ఎనిమిది నెలల పాటు పునరుద్ధరణ పనులు చేపట్టారు. చెఫ్‌ కిచెన్‌, హెరింగ్‌బోన్‌ వుడ్‌ ఫ్లోరింగ్‌, స్పా తరహా విలాసవంతమైన బాత్‌రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు న్యూయార్క్‌ పోస్ట్‌ తెలిపింది.

2017లో ట్రంప్‌ అధ్యక్షుడైన కొద్ది నెలలకే ఈ ఇల్లు 2.14 మిలియన్‌ డాలర్లకు విక్రయమైంది. ట్రంప్‌ బర్త్‌ హోమ్‌ ఎల్‌ఎల్‌సీ అనే సంస్థ కొనుగోలు చేసి కొంతకాలం ఎయిర్‌బీఎన్‌బీలో అద్దెకు ఇచ్చింది. 2019లో 2.9 మిలియన్‌ డాలర్ల ధరకు మళ్లీ విక్రయానికి పెట్టినా కొనుగోలుదారు దొరకలేదు. యజమాని లేకుండా ఉన్న సమయంలో ఇంటి పరిస్థితి మరింత దిగజారినట్లు పోస్ట్‌ పేర్కొంది. ప్రస్తుతం 80 ఏళ్ల ట్రంప్‌ తన ప్రారంభ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని రియల్‌ ఎస్టేట్‌ రంగం నుంచి సంపాదించారు. మాన్‌హాటన్‌లోని ట్రంప్‌ టవర్‌ నిర్మాణం ఆయన ప్రముఖ ప్రాజెక్టుల్లో ఒకటి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయనకు భవన నిర్మాణాలపై ఆసక్తి కొనసాగుతోంది. అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో భారీ బాల్‌రూమ్‌ నిర్మాణాన్ని చేపట్టడంతో పాటు, ఓవల్‌ ఆఫీస్‌లో తన వ్యక్తిగత ఆస్తులలో బంగారు పూత పూసిన అలంకరణలను ఏర్పాటు చేసుకున్నారు.

ఇదీ చదవండి: గిజా పిరమిడ్‌లో గణిత రహస్యం.. చంద్రుడితో లింక్‌?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement