అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐర్లాండ్ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఐర్లాండ్, ఉత్తర ఐర్లాండ్ కలసి ఒకే దేశంగా మారాలని తాను కోరుకుంటున్నట్లు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాయి. సాధారణంగా ఇతర దేశాల నేతలతో సమావేశాలు, పర్యటనల్లో ట్రంప్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో ముందుగా ఊహించడం కష్టంగా ఉంటుంది. అయితే ఐర్లాండ్‌లో పర్యటన మొదటి రోజే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఆ దేశంతోపాటు బ్రిటన్‌లోనూ ప్రకంపనలు సృష్టించాయి.
అయితే ట్రంప్ వ్యాఖ్యలు అమెరికా విదేశాంగ విధానంలో వచ్చిన మార్పునకు సంకేతమా? లేక విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన అప్పటికప్పుడు ఇచ్చిన సమాధానమా? అనే చర్చ మొదలైంది. ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఉత్తర ఐర్లాండ్‌కు ప్రత్యేక రాయబారిగా పనిచేసిన మాజీ రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు మిక్ మల్వానీ మాత్రం ట్రంప్ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని సూచించారు. అమెరికా ఇప్పటికీ ఉత్తర ఐర్లాండ్‌లో శాంతిని నెలకొల్పేందుకు 1998లో కుదిరిన గుడ్ ఫ్రైడే శాంతి ఒప్పందానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. డెమొక్రటిక్ కాంగ్రెస్ సభ్యుడు బ్రెండన్ బాయిల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఐర్లాండ్, ఉత్తర ఐర్లాండ్ భవిష్యత్తులో ఎప్పుడో ఒకరోజు ఏకమయ్యే అవకాశం ఉందని ట్రంప్ చెప్పడంలో తప్పేమీ లేదని ఇద్దరు నేతలు భావించారు. అయితే దాని కోసం అమెరికా ఇప్పుడే ప్రత్యేకంగా ప్రయత్నాలు ప్రారంభిస్తుందని మాత్రం వారు భావించడం లేదు. విలేకరుల సమావేశంలో అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానం ఇవ్వడం ఒక విషయమైతే.. కొద్దిసేపటికే అమెరికా రాయబారి నివాసంలో జరిగిన కార్యక్రమంలోనూ ఆయన ఇదే అంశాన్ని ప్రస్తావించారు. దీంతో ఈ విషయంలో ట్రంప్ ఉద్దేశం ఏమిటన్న దానిపై మరింత ఆసక్తి పెరిగింది.
అలాగే, ట్రంప్ అక్కడి వ్యాపారవేత్తలు, ఐరిష్-అమెరికన్ ప్రముఖులను ఉద్దేశించి చేసిన ప్రసంగం కూడా ఆసక్తికరంగా సాగింది. దీంతో సుమారు 20 నిమిషాల పాటు మాట్లాడతారని భావించినా.. ఆయన మాత్రం అంతకన్న ఎక్కవ సమయమే ప్రసంగించారు. ఐర్లాండ్‌కు సంబంధించిన అంశాల కంటే అమెరికాలోని రాజకీయ పరిస్థితులు, తన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించే ఎక్కువగా మాట్లాడారు. అలాగే, అక్రమ వలసలను అడ్డుకోవడం, వివిధ దేశాలతో ఒప్పందాలు చేసుకోవడం, రక్షణ రంగ ఉత్పత్తులను పెంచడం వంటి అంశాలను తన విజయాలుగా పేర్కొన్నారు. ఇరాన్‌పై అమెరికా చేపట్టిన సైనిక చర్యకు బ్రిటన్ తగినంత మద్దతు ఇవ్వలేదంటూ మరోసారి విమర్శలు చేశారు. అయితే ట్రంప్ అసలు ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.
డబ్లిన్‌లో ఆయన ముందు ఉన్న వ్యాపారవేత్తలే లక్ష్యమా? లేక అమెరికాలో తెల్లవారుజామున ఆయన ప్రసంగాన్ని చూస్తున్న ఐరిష్-అమెరికన్లా? అనే చర్చ జరుగుతోంది. అమెరికాలో నవంబర్‌లో మధ్యంతర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌లోని ఒకటి లేదా రెండు సభలపై పార్టీ నియంత్రణ కోల్పోయే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. అమెరికా జనాభాలో దాదాపు పదో వంతు మంది తమకు ఐరిష్ మూలాలు ఉన్నాయని చెబుతారు. వారిలో కొందరు ఐర్లాండ్ ఏకీకరణకు మద్దతు ఇస్తుండటంతో.. అలాంటి ఓటర్లను ఆకర్షించేందుకు ట్రంప్ ఈ అంశాన్ని ప్రస్తావించారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలోనూ ఐరిష్-అమెరికన్ ఓటర్ల మద్దతు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా మారింది. మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఐర్లాండ్ శాంతి ప్రక్రియలో అమెరికా చురుకుగా వ్యవహరిస్తుందని హామీ ఇచ్చి ఐరిష్-అమెరికన్ల మద్దతు పొందారు. ఆ తర్వాత ఆయన ఇచ్చిన హామీ మేరకు శాంతి ప్రక్రియలో అమెరికా కీలక పాత్ర పోషించింది. దాని ఫలితంగానే గుడ్ ఫ్రైడే ఒప్పందానికి మార్గం సుగమమైంది. అయితే ఇప్పుడు అమెరికా రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని విశ్లేషకులు చెబుతున్నారు. రాజకీయ విభజనలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ఎంతవరకు ఎన్నికల వ్యూహంలో భాగమో స్పష్టంగా తెలియదు. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు చర్చకు దారితీసినప్పటికీ.. ఐర్లాండ్ రాజకీయ వర్గాల్లో మాత్రం మరుసటి రోజు జరగనున్న గోల్ఫ్ మ్యాచ్ గురించే ప్రధానంగా చర్చ సాగుతుండటం గమనార్హం.
ఇదీ చదవండి: ఏఐ భయాలు నిజమేనా? సిలికాన్ వ్యాలీలో భిన్న వాదనలు!


