ట్రంప్‌ వారసుడెవరు?  | United States presidential line of succession | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ వారసుడెవరు? 

Sep 12 2026 5:30 AM | Updated on Sep 12 2026 5:30 AM

United States presidential line of succession

రిపబ్లికన్‌ పార్టీలో మొదలైన చర్చ 

మధ్యంతర ఎన్నికల సదస్సులో వాన్స్‌ పేరు 

పోటీలో రూబియో, ఇతరులు కూడా పార్టీ శ్రేణుల్లో గందరగోళం

డల్లాస్‌: డొనాల్డ్‌ ట్రంప్‌ తరువాత అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్‌ పార్టీ తరఫున పోటీ చేసేదెవరన్న అంశంపై చర్చ మొదలైంది. మధ్యంతర ఎన్నికల సందర్భంగా రిపబ్లికన్‌ పార్టీ డల్లాస్‌లో ఏర్పాటు చేసిన ఒక సదస్సులో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు అనుకూలంగా కొన్ని నినాదాలు వినిపించడంతో ఈ చర్చ ఊపందుకుంది. వాన్స్‌ ప్రసంగిస్తూండగా ‘‘జేడీ..జేడీ..జేడీ’’అని ‘‘48..48..48’’అన్న నినాదాలు వినిపించాయి. అమెరికా 47వ అధ్యక్షుడు ట్రంప్‌ అన్నది తెలిసిందే. అయితే వాన్స్‌ ఈ నినాదాలకు చిరునవ్వుతో స్పందించి ‘‘నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేద్దాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం’’అని వ్యాఖ్యానించారు.  

రిపబ్లికన్‌ పార్టీలో ట్రంప్‌ వారసుడిగా సహజంగానే ఉపాధ్యక్షుడైన వాన్స్‌కు దక్కుతుందన్న వాదన ఒకటి వినిపిస్తున్నా... వాన్స్‌కు పోటీగా మరికొన్ని పేర్లు కూడా చర్చకు వస్తున్నాయి. అయితే వాన్స్‌ ఈ సదస్సులో భవిష్యత్‌ ప్రణాళికలపై ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. మరోవైపు.. వాన్స్‌ ఇప్పటికే కీలక రాష్ట్రాల్లో పర్యటిస్తూ పార్టీ కార్యకర్తలను సమీకరిస్తున్నారని విస్కాన్సిన్‌ రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్షుడు బ్రియాన్‌ షిమ్మింగ్‌ చెబుతూండటం గమనార్హం. విదేశాంగ మంత్రి మార్కో రూబియో, టెక్సాస్‌ సెనేటర్‌ టెడ్‌ క్రూజ్, ఫ్లోరిడా గవర్నర్‌ రాన్‌ డిసాంటిస్‌ వంటి వారు ఇందులో ఉన్నారు. 2028లో వాన్స్‌–రూబియో జోడీ పోటీ చేస్తే బాగుంటుందని టెక్సాస్‌లోని ఫ్రిస్కోకు చెందిన బిల్‌ ష్నైడర్‌ భావిస్తున్నారు. వాన్స్‌ అధ్యక్ష అభ్యర్థిగా, రూబియో ఉపాధ్యక్ష అభ్యరి్థగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. వాన్స్‌ ట్రంప్‌ విధానాలను కొనసాగిస్తారని, ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా ఉండటం వల్ల అధ్యక్ష పదవికి ఆయన సరైన ఎంపిక అని ష్నైడర్‌ అన్నారు. అయితే...  

‘‘2028 అధ్యక్ష అభ్యర్థి గురించి ఇప్పుడే మాట్లాడుకోవడం తొందరపాటు అవుతుంది. కానీ ఒకరి పేరు తప్పనిసరిగా చెప్పాలంటే నేను రాన్‌ డిసాంటిస్‌ను ఎంచుకుంటాను. ఫ్లోరిడాలో ఆయన అమలు చేసిన విధానాలు అమెరికాకు మార్గదర్శకంగా ఉంటాయి’’అని డల్లాస్‌కు చెందిన ఐటీ మేనేజర్‌ రోషెల్‌ బ్రూక్స్‌ వ్యాఖ్యానించారు. ఇంకోపక్క హ్యూస్టన్‌కు చెందిన రిటైర్డ్‌ ఉద్యోగిని పెగ్గీ స్టాంటన్‌ మాత్రం రూబియోకు మద్దతు తెలిపారు. ‘‘విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. ప్రతి అంశంపై స్పష్టంగా మాట్లాడతారు. ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉన్నాయి. ఏదో ఒక రోజు అధ్యక్షుడు అవుతారని ఎప్పటి నుంచో నమ్ముతున్నాను’’అని అన్నారు.  

ట్రంప్‌ నిర్ణయిస్తారా?  
2028 ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసేది ఎవరన్న విషయంపై మధ్యంత ఎన్నికల సదస్సులో పాల్గొన్న వారిలో అంత స్పష్టత లేనట్టు తెలుస్తోంది. కొందరైతే ట్రంప్‌ ఎవరికి మద్దతు తెలుపుతారన్న దానిపై తన నిర్ణయం ఉంటుందని వ్యాఖ్యానించడం గమనార్హం. వాన్స్, రూబియోలు ఇద్దరూ సమర్థులైనప్పటికీ ఎవరివైపు మొగ్గు చూపాలన్నది ఇప్పుడే చెప్పలేమని కొందరు చెబుతున్నారు. 2028 ఎన్నికలకు ఇంకా రెండేళ్లకుపైగా సమయం ఉండటంతో.. అభ్యర్థులెవరూ అధికారికంగా తమ అభ్యరి్థత్వాన్ని ప్రకటించలేదు. దీంతో ట్రంప్‌ మద్దతు ఎవరికి లభిస్తుందోనని రిపబ్లికన్‌ పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

కొత్త ముఖాల మాటేమిటి?  
రిపబ్లికన్‌ పార్టీ శ్రేణుల్లో కొందరు ఊహించని నేతల పేర్లను కూడా ప్రతిపాదిస్తున్నారు. ట్రంప్‌ మద్దతున్న కెంటకీ ప్రతినిధి థామస్‌ మాసీని పార్టీ నాయకుడిగా చూడాలని ‘వెటరన్స్‌ ఫర్‌ అమెరికా ఫస్ట్‌’సంస్థకు చెందిన కింబర్లీ మోయర్స్‌ అన్నారు. గ్రాండ్‌ ప్రెయిరీకి చెందిన దినా, కెవిన్‌ మైయర్స్‌ దంపతులు టెక్సాస్‌ రిపబ్లికన్‌ ప్రతినిధి బ్రాండన్‌ గిల్‌ పేరును ప్రస్తావించగా డెలావేర్‌కు చెందిన ఆంథనీ జాన్స్టన్‌ వాన్స్‌ మేలు అంటున్నారు. ట్రంప్‌ అధికార అవధి దగ్గరవుతున్న నేపథ్యంలో.. రిపబ్లికన్‌ పార్టీలో ఇప్పుడే నాయకత్వ పోటీ మొదలైనట్లు కనిపిస్తోంది. అయితే చివరకు ఎవరు బరిలోకి దిగుతారన్నది పార్టీ అంతర్గత సమీకరణాలు, మధ్యంతర ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉండనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement