హూతీలపై అమెరికా దాడులు చేయాలంటూ రెండుసార్లు సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ చేసిన విజ్ఞప్తిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించినట్లు ఆక్సియోస్ సంచలన నివేదిక వెల్లడించింది. ఎర్ర సముద్రంలో కీలకమైన బాబ్ అల్-మందెబ్ జలసంధికి హూతీలు చేరువవుతున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది. ప్రస్తుతం అమెరికా నేరుగా ఈ పోరాటంలో జోక్యం చేసుకునే ఉద్దేశం లేదని ట్రంప్ ఆ అభ్యర్థనను తిరస్కరించినట్లు నివేదిక తెలిపింది.
బాబ్ అల్ మందెప్ జలసంధి దిశగా హూతీలు ప్రవేశిస్తున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ట్రంప్ బృందంలోని ఓ సీనియర్ అధికారి మట్లాడుతూ.. ఎర్ర సముద్రాన్ని తెరిచి ఉంచడం అమెరికా ప్రధాన ప్రాధాన్యత. అయితే, విస్తృత స్థాయి పోరాటాన్ని ప్రాంతీయ భాగస్వాములే నిర్వహించాలన్నది అమెరికా విధానం. ఎర్ర సముద్రంలో నౌకా రాకపోకల స్వేచ్ఛ, మా ప్రధాన జాతీయ భద్రతా ప్రయోజనాల పరిరక్షణపై అమెరికా దృష్టి సారించింది. అదే సమయంలో ప్రాంతీయ భద్రతా సవాళ్లను పరిష్కరించడంలో ప్రాంతీయ భాగస్వాములు ముందుండేలా మేము వారికి మద్దతు ఇస్తున్నామని ఆయన తెలిపారు.
మొఖా నుంచి బాబ్ అల్-మండెబ్ జలసంధి సుమారు 80 కిలోమీటర్లు (50 మైళ్లు) దూరంలో ఉంది. ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ అడెన్‌తో కలిపే ఈ జలసంధి ద్వారా సాధారణంగా ప్రపంచ వాణిజ్య వస్తువుల్లో సుమారు 12 శాతం రవాణా అవుతాయి. సౌదీ మద్దతు ఉన్న యెమెన్ ప్రభుత్వ దళాలను హూతీ బలగాలు దక్షిణం వైపు ధుబాబ్ ప్రాంతానికి వెనక్కి నెట్టాయని ఇద్దరు యెమెన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.


