మంటల్లో స్కూల్‌.. ఆపై తొక్కిసలాట.. 29 మంది మృతి | DR Congo: Fire Breaks Out at Bukavu School 29 Killed in Stampede | Sakshi
Sakshi News home page

మంటల్లో స్కూల్‌.. ఆపై తొక్కిసలాట.. 29 మంది మృతి

Sep 11 2026 7:38 AM | Updated on Sep 11 2026 8:01 AM

DR Congo: Fire Breaks Out at Bukavu School 29 Killed in Stampede

ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. స్కూల్‌లో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. అగ్నికీలల్లో చిక్కుకుని 29 మంది మృతి చెందగా.. వారిలో 24 మంది చిన్నారులే ఉన్నారు. మృతుల్లో 19 మంది బాలికలు, ఐదుగురు బాలురు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలోని బుకావు నగరంలో చోటుచేసుకుంది.

బుకావు(Bukavu)లోని చింపుండా ప్రాంతంలో గురువారం ఉదయం 8 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మంటలు తొలుత ఒక ప్రాంతంలో మొదలై.. సమీపంలోని ఉజామా ప్రైమరీ స్కూల్‌, ఫురాహా సెకండరీ స్కూల్‌కు వ్యాపించాయి. పాఠశాలలతో పాటు సమీపంలోని దాదాపు 300 చెక్క ఇళ్లు కూడా మంటల్లో కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ బుకావు రీజియన్‌ అంతా తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉండడం గమనార్హం.

మంటలు.. ఆపై తొక్కిసలాట
మంటలు వేగంగా వ్యాపించడంతో విద్యార్థులు ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. కొందరు ఒకరినొకరు తొక్కుకుంటూ బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. మరికొందరు ఊపిరాడక స్పృహ కోల్పోయారు. తొక్కిసలాటలోనూ పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు.

స్థానిక క్లినిక్‌ నర్సు క్రిస్టోఫ్‌ జిగషానే తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు 50 మంది విద్యార్థులు, పలువురు ఉపాధ్యాయులను తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురు ఊపిరాడక ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. కొందరు ఘటనాస్థలంలోనే మృతి చెందగా.. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

క్షతగాత్రులకు చికిత్స
ఈ ప్రమాదంలో మరో 29 మంది చికిత్స పొందుతున్నట్లు ఏఎఫ్‌సీ/ఎం23(AFC/M23) తిరుగుబాటు ఉద్యమ ప్రతినిధి లారెన్స్‌ కన్యుకా తెలిపారు. వారిలో 21 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. 17 మంది కడుటు జనరల్‌ ఆస్పత్రిలో, మరో నలుగురు బుకావు ప్రావిన్షియల్‌ జనరల్‌ ఆస్పత్రిలో ఉన్నట్లు వెల్లడించారు.

బుకావు నగరం 2025 ఫిబ్రవరి నుంచి రువాండా మద్దతు ఉన్న AFC/M23 తిరుగుబాటు సంస్థ ఆధీనంలో ఉంది. ఖనిజ సంపదకు పేరుగాంచిన తూర్పు ప్రాంతాల్లో ఈ సంస్థ తన ఆధిపత్యాన్ని విస్తరించుకుంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో తిరుగుబాటుదారుల ఆధీనంలోని ప్రాంతంలో ఇంత భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.

ఇదీ చదవండి: భారతీయులపై ట్రంప్‌ మరో పిడుగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement