సిక్కు ట్రక్కు డ్రైవర్లు స్వచ్ఛందంగా అమెరికా వీడాలంటూ వీడియో
తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన భారతీయ అమెరికన్లు, సిక్కు సంఘాలు
వీడియో జాత్యహంకారం పెంచేలా ఉందని అమెరికా ప్రభుత్వంపై ఆగ్రహం
వాషింగ్టన్: రహదారులపై నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ అమెరికన్ల ప్రాణాలు తీస్తున్న సిక్కు డ్రైవర్లు స్వచ్ఛందంగా దేశం వీడాలంటూ అమెరికా ప్రభుత్వ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం రూపొందించిన వీడియో వివాదాస్పదంగా మారింది. గతంలో నిర్లక్ష్యంగా ట్రక్కులు నడిపి పలువురి ప్రాణాలుపోయేందుకు కారణమైన వలసదారులైన డ్రైవర్లు హర్జీందర్ సింగ్, రాజీందర్ కుమార్, బెకాన్ బిషెకేవ్, జస్వీర్ సింగ్‌ల ఫొటోలను చూపిస్తూ ఒక ఏఐ జనరేటెడ్ వీడియోను రూపొందించి హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తన ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్‌చేసింది.
సరైన దృవీకరణ పత్రాలు లేని, అక్రమ వలసదారులను, వాణిజ్య ట్రక్కులు నడిపే డ్రైవర్లను సిక్కులుగా చూపిస్తూ.. ‘‘మా రోడ్డ మీద నుంచి తప్పుకోండి. మిస్టర్ సింగ్ నీకసలు వాహనం నడపడమే రాదు. స్వచ్ఛందంగా అమెరికాను వదిలి వెళ్లిపో. లేదంటే నిన్ను అరెస్ట్‌చేసి బలవంతంగా దేశం నుంచి వెళ్లగొట్టేందుకు పోలీసులు వస్తారు’’అని ఆ వీడియోలో హెచ్చరించింది. 2014లో హాలీవుడ్‌లో హిట్ అయిన ‘ట్రాన్స్‌ఫార్మర్స్: ఏజ్ ఆఫ్ ఎక్స్‌టిన్షన్’కు పేరడీగా డ్రైవర్లను ట్రాన్స్‌ఫార్మర్లుగా పేర్కొంటూ కొత్త వీడియోకు ‘ట్రాన్స్‌ఫార్మర్స్: ఏజ్ ఆఫ్ డిపోర్టేషన్’అని పేరు పెట్టి కొత్త వివాదం రేపింది.
దీనిపై భారతీయ అమెరికన్లు, సిక్కు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. ప్రతి ఒక్క సిక్కు వ్యక్తి అక్రమంగా అమెరికాకు రాలేదు. ప్రతి ఒక్క సిక్కు డ్రైవర్ రహదారులపై ప్రమాదాలు చేయట్లేడు. పనిగట్టుకుని సిక్కు వ్యక్తులను నేరస్తులుగా, దోషులుగా చూపిస్తూ యావత్ సిక్కులను, భారతీయులను కించపరుస్తున్నారు. ఇది ముమ్మాటికీ జాత్యహంకారమే’’అని హిందూ అమెరికన్ ఫౌండేషన్, సిఖ్ కోలిషన్, ఉత్తర అమెరికా హిందువుల కూటమి వంటి సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. ‘‘అమెరికాలో లక్షలాది మంది సిక్కులు, హిందువుల పేర్ల చివర్లో సింగ్, కుమార్ అని ఉంటుంది. వాళ్లంతా రోడ్డుపై యాక్సిడెంట్లు చేస్తారన్నట్లు ఏఐ వీడియో రూపొందించడం చూస్తుంటే మమ్మల్ని శత్రువులుగా ప్రభుత్వం భావిస్తోందా?’’అని సిఖ్ కోలీషన్ అసహనం వ్యక్తంచేసింది.


