విజయ్‌ సర్కార్‌కు తొలి పరీక్ష.. అన్నాడీఎంకే కంచుకోటల్లో బిగ్‌ ఫైట్‌! | TVK Announce former AIADMK MLAs for Tamil Nadu bypolls fight DMK | Sakshi
Sakshi News home page

విజయ్‌ సర్కార్‌కు తొలి పరీక్ష.. అన్నాడీఎంకే కంచుకోటల్లో బిగ్‌ ఫైట్‌!

Sep 11 2026 7:56 AM | Updated on Sep 11 2026 8:25 AM

TVK Announce former AIADMK MLAs for Tamil Nadu bypolls fight DMK

తమిళనాడు రాజకీయాల్లో వేడి పెరిగింది.. విజయ్‌ ప్రభుత్వానికి తొలి పరీక్ష ఎదురైంది. టీవీకే అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి బైపోల్‌ బరిలోకి దిగింది. ఇప్పటి వరకు అన్నాడీఎంకేకు కంచుకోటలుగా ఉన్న రెండు నియోజకవర్గాల్లో టీవీకే.. మాజీ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలనే తమ అభ్యర్థులుగా ప్రకటించింది. దీంతో విజయ్‌ వర్సెస్‌ స్టాలిన్‌ పోరుకు.. అన్నాడీఎంకే కౌంటర్‌తో ముక్కోణపు యుద్ధం మొదలైంది. అక్టోబర్‌ 6న జరగనున్న ఈ రెండు ఉపఎన్నికలు ఎవరి బలమెంతో తేల్చడమే కాదు.. విజయ్‌ కొత్త ప్రభుత్వానికి ప్రజల్లో ఉన్న ఆదరణకు తొలి సంకేతంగా మారే అవకాశముంది.

అక్టోబర్‌ 6న తమిళనాడులో జరగనున్న రెండు అసెంబ్లీ ఉపఎన్నికలకు టీవీకే అధినేత, సీఎం విజయ్‌ అభ్యర్థులను ప్రకటించారు. మదురాంతకం నుంచి మాజీ అన్నాడీఎంకే ఎమ్మెల్యే కె. మరగతం కుమారవేల్‌, ధారాపురం నుంచి మాజీ ఎమ్మెల్యే పి. సత్యబామను బరిలోకి దింపారు. ఇద్దరూ ఏప్రిల్‌ 23 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున గెలిచి, ఆ తర్వాత ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి టీవీకేలో చేరడంతో ఈ రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి.

త్రిముఖ పోరు తప్పదా?
ఈ రెండు నియోజకవర్గాలు అన్నాడీఎంకేకు బలమైన స్థానాలుగా పరిగణిస్తుండటంతో.. ఇప్పుడు అక్కడ టీవీకే, డీఎంకేతో పాటు అన్నాడీఎంకే కూడా బరిలోకి దిగడంతో త్రిముఖ పోరు నెలకొంది. మదురాంతకంలో డీఎంకే తరఫున మాజీ ఎమ్మెల్యే ఐ. పరందామన్‌, ధారాపురంలో ఎస్‌. సుగన్య పోటీ చేస్తున్నారు. అన్నాడీఎంకే మదురాంతకంలో మాజీ ఎమ్మెల్యే కనిత సంపత్‌, ధారాపురంలో కె. బానుమతిని అభ్యర్థులుగా ప్రకటించింది. అయితే ఈ ఉపఎన్నికలు విజయ్‌ ప్రభుత్వానికి కీలక పరీక్షగా మారనున్నాయి. ఏప్రిల్‌ ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకున్న తర్వాత టీవీకే ఎదుర్కొంటున్న తొలి ఎన్నికల పోరు ఇదే కావడంతో.. ఈ రెండు ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విజయ్‌ ఈ ఉపఎన్నికలను కాంగ్రెస్‌, ఎండీఎంకేతో కూడిన ‘సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ ఫ్రంట్‌’ కూటమి పేరుతో ఎదుర్కోనున్నట్లు ప్రకటించారు.

డీఎంకే, అన్నాడీఎంకే ఫుల్‌ ఫోకస్‌..
తమకు ఇప్పటికే ఉన్న వ్యక్తిగత ఓటు బ్యాంకు, నియోజకవర్గాల్లో పరిచయం ఉన్న నాయకత్వం కలిసి పనిచేస్తుందని టీవీకే అంచనా వేస్తోంది. మదురాంతకం అభ్యర్థి మరగతం కుమారవేల్‌ కూడా విజయంపై ధీమా వ్యక్తం చేశారు. విజయ్‌ ప్రభుత్వం వంద రోజుల పాలనలో సాధించిన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విజయం సాధిస్తామని చెప్పారు. 

మరోవైపు.. అన్నాడీఎంకే తన బలమైన స్థానాలను తిరిగి నిలబెట్టుకోవాలని చూస్తుండగా, అధికార టీవీకేను నిలువరించేందుకు డీఎంకే కూడా గట్టిగానే పోరాడుతోంది. టీవీకే ఎదుగుదలను అడ్డుకోవడమే డీఎంకేకి ప్రధాన రాజకీయ సవాల్‌గా కనిపిస్తోంది. ఇందులో భాగంగా మదురాంతకం, ధారాపురం రెండింటిలోనూ డీఎంకే అభ్యర్థులను ముందుగానే ప్రకటించి పోరుకు తెరతీసింది. ఇదిలా ఉండగా.. మదురాంతకంలో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే మూడో స్థానంలో నిలిచింది. ఇప్పుడు అదే స్థానంలో బలాన్ని పెంచుకోవడం స్టాలిన్‌ పార్టీకి పెద్ద సవాల్‌గా ఉంది. ఇక, విజయ్‌ ప్రభుత్వానికి ఈ రెండు బైపోల్స్‌ తొలి రాజకీయ పరీక్షగా మారాయి. రెండు స్థానాలకు సంబంధించి అక్టోబర్‌ 6న పోలింగ్ జరగనుండగా అక్టోబర్‌ 9న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఇదీ చదవండి: తమిళనాట సంచలనం.. స్టాలిన్‌కు పళని బిగ్‌ ఆఫర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement