అసెంబ్లీ వేదికగా స్టాలిన్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ముఖ్యమంత్రి విజయ్ చేసిన ‘అవినీతి’ ఆరోపణలు రాజకీయ ప్రకంపనలు పుట్టించాయి. అలాగే స్టాలిన్‌పైనా విజయ్ బాడీ షేమింగ్ చేయడమూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ తరుణంలో స్టాలిన్ వాటిపై స్పందించారు. తన తండ్రి, డీఎంకే మాజీ సీఎం కరుణానిధి హయాంలో జరిగిన పరిణామాలను గుర్తుచేస్తూ.. ‘‘తమ్ముడు విజయ్.. నువ్వు చెప్పింది నిజమే. అబద్ధం కాదు’’ అంటూ ఈ ఉదయం ఓ వీడియోను రిలీజ్ చేశారాయన.
తన తండ్రి కరుణానిధి, తనను విజయ్ టార్గెట్‌గా చేసుకోవడంపై స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. అదే సమయంలో తన దవడ వెనుక కథ ఇదేనంటూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారాయన. ఎమర్జెన్సీ సమయంలో కరుణానిధి మెరీనా బీచ్‌లో భారీ సభ నిర్వహించి మీసా చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని స్టాలిన్ గుర్తుచేశారు. అనంతరం 1976 జనవరి 31న కేంద్ర ప్రభుత్వం డీఎంకే ప్రభుత్వాన్ని రద్దు చేసిందన్నారు. ఆ వెంటనే గోపాలపురం ఇంటికి పోలీసులు వచ్చి తనను మీసా కింద అరెస్టు చేసేందుకు ప్రయత్నించారని చెప్పారు.
‘‘ఆ రోజు నేను ఇంట్లో లేను. నా కొడుకు ప్రచారానికి వెళ్లాడు.. రేపు వస్తాడు. వచ్చిన వెంటనే నేనే ఫోన్ చేస్తా.. వచ్చి అరెస్టు చేసుకోండి’’ అంటూ కరుణానిధి పోలీసులను వెనక్కి పంపారని తెలిపారు. మరుసటి రోజు తాను ఇంటికి వచ్చిన తర్వాత కరుణానిధే పోలీసులకు ఫోన్ చేసి తనను అరెస్టు చేయించారని చెప్పారు.
జైల్లో తనను తీవ్రంగా హింసించారని స్టాలిన్ పేర్కొన్నారు. కుష్ఠు వ్యాధిగ్రస్తులను ఉంచే ప్రదేశంలో చిన్న గదిలో పది మందిని బంధించారని, అదే గదిలో ఒకే కుండను మూత్ర విసర్జనకు ఉపయోగించాల్సి వచ్చేదని వివరించారు. రాత్రిళ్లు నిద్రపోనివ్వకుండా పోలీసులు లాఠీలతో కొట్టేవారని, బూట్లతో తన్నేవారని చెప్పారు. ఖైదీల దాడిలో ఎంపీ చిట్టిబాబు మరణించారని, తన దవడ ఎముక విరిగిందని తెలిపారు. నాటి దాడుల గాయాల గుర్తులు ఇప్పటికీ ఉన్నాయని చెప్పారు.
‘‘మా సిద్ధాంత నాయకుడినని చెబుతున్నావు. పెరరింజర్ అన్నా(సి.ఎన్. అన్నాదురై) కాలం నుంచి ఇదే డీఎంకే చరిత్ర. అందులో నేనూ భాగం కావడం గర్వంగా ఉంది. ఎవరెంత తక్కువ చేసి చూపించాలని చూసినా చరిత్రను మార్చలేరు’’ అని స్టాలిన్ అన్నారు.
సర్కారియా కమిషన్.. విజయ్‌కు మరో కౌంటర్
అదే సమయంలో సర్కారియా కమిషన్, అవినీతి ఆరోపణలపైనా విజయ్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. సర్కారియా కమిషన్ ఏర్పడిన తర్వాత కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అనేక ప్రభుత్వాలు మారాయని గుర్తుచేశారు. ఆ ఆరోపణల్లో నిజం ఉంటే ఇన్నేళ్లలో తప్పకుండా చర్యలు జరిగేవని అన్నారు. ఈడీ కేసులను ప్రస్తావిస్తూ కూడా విజయ్‌పై స్టాలిన్ విమర్శలు చేశారు. ఈడీ నమోదు చేసిన అనేక కేసుల్లో ఆరోపణలు నిరూపితం కాలేదని, నిందితులు నిర్దోషులుగా బయటపడిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాజకీయ కక్ష సాధింపుల కోసం ఈడీని ఉపయోగిస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. కాంగ్రెస్ నేతలపైనా ఈడీ కేసులు పెట్టిన విషయాన్ని విజయ్ ఎలా మర్చిపోయారని ప్రశ్నించారు.
అసెంబ్లీని వివాదాలకు వేదిక చేయొద్దు
తమిళనాడు అసెంబ్లీకి ఎంతో గౌరవం, చరిత్ర ఉందని.. అక్కడ ప్రజా సమస్యలపై చర్చ జరగాలని స్టాలిన్ సూచించారు. శాంతిభద్రతలు, సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధి, తమిళనాడు హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై చర్చించాలని కోరారు. అనవసర వివాదాలను అసెంబ్లీలోకి తీసుకురావద్దని విజయ్‌కు హితవు పలికారు.
విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ఇంటికి వచ్చి కలిసిన విషయాన్ని కూడా స్టాలిన్ గుర్తుచేశారు. అప్పట్లో ఎన్నికల ప్రచారంలో తనపై విజయ్ తీవ్ర విమర్శలు చేశానని ఆయన చెప్పగా.. ‘‘పర్లేదు తమ్ముడూ.. వాటిని మనసులో పెట్టుకోను’’ అని తాను చెప్పినట్లు తెలిపారు. అయితే ఇప్పుడు విజయ్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అని, ఆయన మాట్లాడే ప్రతి మాటలోనూ ఆ పదవికి తగ్గ హుందాతనం కనిపించాలని సూచించారు.
‘సినిమా షూటింగ్‌లా పాలన’
విజయ్ ప్రభుత్వ పనితీరుపైనా స్టాలిన్ తీవ్ర విమర్శలు చేశారు. తాము నిర్మించిన వంతెనపై నిలబడి ఫొటోషూట్లు చేయడం, అసెంబ్లీని రీల్స్‌కు వేదికగా మార్చడం సరికాదన్నారు. సమర్థవంతమైన పాలనపై దృష్టి పెట్టకుండా సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో హత్యలు, దొంగతనాలు, మహిళలపై నేరాలు పెరిగాయని, శాంతిభద్రతలు దిగజారిపోయాయని విమర్శించారు. పరందూర్ విమానాశ్రయ ప్రాజెక్టును రద్దు చేసి తమిళనాడు అభివృద్ధిని 15 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని ఆరోపించారు. రైతులకు పూర్తి రుణమాఫీ, ప్రతి కుటుంబానికి ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లు, మహిళలకు రూ.2,500 సాయం వంటి హామీల విషయంలోనూ విజయ్ ప్రభుత్వం వెనక్కి తగ్గిందని విమర్శించారు.
‘‘అప్పుడు చెప్పింది ఒకటి.. ఇప్పుడు చేస్తున్నది మరొకటి. మార్పు కావాలని ఓటేసిన యువత ఇప్పుడు నిజంగా ఎలాంటి మార్పు వచ్చిందో గమనిస్తోంది’’ అని స్టాలిన్ అన్నారు.
అధికారం లేకున్నా ప్రజల కోసం పోరాటమే
చివరగా డీఎంకే కార్యకర్తలకు స్టాలిన్ కీలక సందేశం ఇచ్చారు. ప్రజలు పూర్తిగా తమకు మద్దతు ఇవ్వకపోవడంతో అధికారంలోకి రాలేకపోయామని, కానీ ప్రభుత్వం చేసే తప్పులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు ‘‘మనకేం సంబంధం’’ అనే ధోరణి ఉండకూడదన్నారు. అధికారంలో ఉండటం, లేకపోవడం రెండూ ప్రజాసేవలో భాగమేనని పేర్కొన్నారు. తమిళనాడు హక్కులు, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల కోసం డీఎంకే ఎప్పటికీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ‘‘వాళ్ల(ప్రజలను ఉద్దేశించి..) తాతల కోసం పోరాడాం. వాళ్ల తండ్రుల కోసం పోరాడాం. ఇప్పుడు వాళ్ల కోసం పోరాడతాం. ఇదే డీఎంకే చరిత్ర. ఆ చరిత్ర ఎప్పటికీ మారదు.. మారకూడదు’’ అని స్టాలిన్ స్పష్టం చేశారు.
வீட்ல என்னை meet பண்ணப்ப சொன்னதை மறந்துட்டீங்களா தம்பி விஜய்? pic.twitter.com/kzpwXi14L8
— M.K.Stalin (@mkstalin) September 10, 2026
సెప్టెంబర్ 7న తమిళనాడు అసెంబ్లీలో పోలీస్ శాఖపై చర్చకు సీఎం విజయ్ సమాధానం ఇస్తూ.. ఎమర్జెన్సీ–MISA అంశాన్ని ప్రస్తావించారు. ఆ సమయంలో దవడ దగ్గర చేతితో హావభావం చేశారు. ఈ సైగపై డీఎంకే నేతలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. స్టాలిన్ ఎమర్జెన్సీ సమయంలో పోలీసుల దాడిలో దవడ విరిగిన విషయాన్ని విజయ్ ఎగతాళి చేశారని ఆరోపించారు. వామపక్షాలు కూడా విజయ్ తీరును తప్పుబట్టాయి. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం.. స్టాలిన్ గాయాన్ని హేళన చేయడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. అయితే దీనిపై సెప్టెంబర్ 8న విజయ్ వివరణ ఇచ్చారు. తన బాడీ లాంగ్వేజ్ అనుకోకుండా వచ్చిందని, ఎవరినీ వ్యక్తిగతంగా బాధపెట్టే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: బీజేపీకి చెక్ పెట్టేందుకే విజయ్‌కు తోడుగా..


