గాంధీనగర్: గుజరాత్‌లోని గాంధీనగర్ కుడాసన్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న వాణిజ్య భవనంలో కొంత భాగం కూలిన ఘటనలో చిక్కుకున్న కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. బుధవారం రాత్రి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ఘటనాస్థలాన్ని, గాంధీనగర్ సివిల్ ఆసుపత్రిని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి.. తొలుత సుమారు 15 మంది కార్మికులు గాయపడినట్లు తెలిపారు. వారిలో ఇద్దరిని వైద్యులు పరీక్షించి, సురక్షితంగా ఉన్నట్లు నిర్ధారించి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. మిగిలిన గాయపడిన కార్మికులకు సివిల్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం కుడాసన్‌లోని ‘బోస్కీ ది ఎంపైర్’ వాణిజ్య భవన నిర్మాణ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్‌లో కొంత భాగం ఒక్కసారిగా కూలిపోవడంతో కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. వెంటనే స్థానిక అధికారులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్, ఫైర్ బ్రిగేడ్, విపత్తు నిర్వహణ బృందాలు క్రేన్లు, ఆధునిక పరికరాల సాయంతో శిథిలాలను తొలగించి కార్మికులను బయటకు తీసుకొచ్చారు. అనంతరం వారిని అంబులెన్సుల్లో గాంధీనగర్ సివిల్ ఆసుపత్రికి తరలించారు.
Gandhinagar, Gujarat: Rescue operations are underway at the site of a building collapse in the Kudasan area of Gandhinagar. Deputy Chief Minister Harsh Sanghavi visited the site to assess the situation and oversee the ongoing rescue efforts https://t.co/6Wz6fPJXLu
— IANS (@ians_india) September 9, 2026
సకాలంలో సహాయక చర్యలు చేపట్టడంతో ప్రాణనష్టం తప్పిందని ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి తెలిపారు. హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సంజీవ్ కుమార్, డీజీపీ జ్ఞానేంద్ర సింగ్ మాలిక్, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, సీనియర్ పోలీసు అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదం జరిగిన సమయంలో 10 నుంచి 15 మంది శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని తొలుత సమాచారం అందింది. అత్యవసర బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తునకు అధికారులు ఆదేశించారు. నిర్మాణ ప్రాంతంలో నిర్దేశిత భద్రతా ప్రమాణాలు పాటించారా? సెంటరింగ్, స్లాబ్ పనుల్లో నాణ్యతా లోపాలు లేదా ఇతర సమస్యలు ఉన్నాయా? అనే అంశాలను పరిశీలించనున్నారు. దర్యాప్తు నివేదిక ఆధారంగా తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.
ఇది కూడా చదవండి: 1980ల ట్రెండ్ వెనుక ఏముంది? ఎందుకు వైరల్ అవుతోంది?


