చరిత్రలో తొలిసారిగా ఢిల్లీ నుంచి వేదిక మార్పు
ఈ నెల 22న రాష్ట్రపతి చేతుల మీదుగా!
ఇక నుంచి ఏటా వేర్వేరు చోట్ల అవార్డుల ప్రదానం
భారతీయ సినీ రంగానికి సంబంధించి ప్రభుత్వం పక్షాన అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జాతీయ చలనచిత్ర అవార్డులు చరిత్రలో తొలిసారిగా మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నాయి. ఇక నుంచి నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రదానాన్ని దేశరాజధాని ఢిల్లీకే పరిమితం చేయకుండా, దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు వేదికను మార్చాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 1954లో తొలి జాతీయ అవార్డుల నాటి నుంచి ఇప్పటి వరకు అనేక దశాబ్దాలుగా ఢిల్లీ వేదికగానే సాగుతూ వచ్చిన నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం అలా తొలిసారిగా ఈ ఏడాది వేదిక మార్చుకుంది. గుజరాత్‌లోని నర్మదా జిల్లాలోని ఏక్తా నగర్ (కేవడియా)లో ఈ సెప్టెంబర్ 22న తాజా అవార్డుల ప్రదానం జరగనుంది.
ఏటేటా రాష్ట్రపతి చేతుల మీదుగా సాగే ఈ ప్రదానోత్సవం... ఈసారీ అదే సంప్రదాయాన్ని కొనసాగించనుంది. ఈ నెల ద్వితీయార్ధంలో గుజరాత్ పర్యటనలో ఉండనున్న భారత రాష్ట్రపతి ఈ 72వ జాతీయ అవార్డులను విజేతలకు అక్కడే అందజేయనున్నారు. 2024వ సంవత్సరానికి గాను నేషనల్ అవార్డు విజేతల పేర్లను మొన్న జూలైలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
నర్మదా తీరంలో ఏర్పాటుచేసిన వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహం (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ)తో గుజరాత్‌లోని ఏక్తా నగర్ కొంతకాలంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. గుజరాత్ పర్యటనలో భాగంగా ఏక్తా నగర్‌ను సైతం రాష్ట్రపతి సందర్శించనున్నారు. అక్కడే ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. సర్వసాధారణంగా ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ఏటా జరిగే ఉత్సవానికి భిన్నంగా ఈసారి మరింత కన్నులపండుగగా కార్యక్రమం నిర్వహించడానికి ఇప్పటికే ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.
ఇప్పటికి ఏడు దశాబ్దాల పైగా ఏటా ఇస్తున్న ఈ అవార్డుల్లో ఫీచర్ ఫిల్ములు, నాన్ – ఫీచర్ ఫిల్ములు, భారతీయ సినిమాపై అత్యుత్తమ రచనలనే ప్రధాన విభాగాల్లో విజేతలను ఎంపిక చేస్తారు. 2024వ సంవత్సరంలో విడుదలైన చిత్రాలకు గాను అందించనున్న తాజా 72వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా ‘ఆర్టికల్ 370’ ఎంపికైంది. ఉత్తమ నటిగా యామీ గౌతమ్ (చిత్రం: ‘ఆర్టికల్ 370’), ఉత్తమ నటుడి కేటగిరీలో మమ్మూట్టి (చిత్రం: ‘భ్రమయుగం’), కార్తీక్ ఆర్యన్ (చిత్రం: ‘చందు ఛాంపియన్’)లు సంయక్తంగా విజేతలయ్యారు. ఈసారి నాన్ ఫీచర్ కేటగిరీలో ఉత్తమ దర్శకుడి అవార్డు ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ – ఏక్తా కా ప్రతీక్’ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆనంద్ ఎల్. రాయ్‌కు రావడం విశేషం. ఇప్పుడు సరిగ్గా అదే ప్రాంతంలో జాతీయ అవార్డుల ప్రదానం జరగడం గమనార్హం.
ఇదీ చదవండి: ఏపీలో చిరంజీవి కుమార్తెకు కీలక పదవి!
వివిధ విభాగాల్లో మన తెలుగు సినిమాలు ‘కల్కి 2898 ఏడీ’, ‘పుష్ప-2’తో పాటు ‘అమరన్’, ‘భూల్ భులయ్యా-3’, ‘స్త్రీ-2’ తదితర చిత్రాలు సైతం అవార్డులు స్వీకరించనున్నాయి. అవార్డు ప్రదానోత్సవానికి దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధ నటీనటులు, దర్శక, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు గుజరాత్‌కు రానుండడం విశేషం. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, తుళు, మరాఠీ, గఢ్వాలీ సహా వేర్వేరు భాషల్లో రూపొందించిన ఫిల్ములు అవార్డులను అందుకోనున్నాయి. సంథాలీ భాషలో రూపొందిన ఓ ఫిల్ముకు తొలిసారిగా నాన్ – ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అవార్డు దక్కడం విశేషం.


