బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం రెండు సినిమాల గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఒకటి ఇప్పటికే ఓటీటీలో భారీ ఆదరణ పొందిన ‘మిర్జాపూర్’ ఫ్రాంచైజీకి కొనసాగింపుగా వచ్చిన ‘మిర్జాపూర్: ది మూవీ’ కాగా.. మరొకటి పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి క్రమంగా ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ‘హనుమాన్ అంశ్’. ఈ రెండు సినిమాలు విజయవంతమైనప్పటికీ వాటి బాక్సాఫీస్ వద్ద మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఒక సినిమా ఫ్రాంచైజీ క్రేజ్‌తో తొలి రోజుల్లోనే దుమ్మురేపితే.. మరో సినిమా ప్రేక్షకుల మౌత్ టాక్‌తో నెమ్మదిగా పుంజుకుని భారీ విజయాన్ని అందుకుంది.
మూడు రోజుల్లోనే రూ.90 కోట్లకు..
గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు, రవికిషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మిర్జాపూర్: ది మూవీ’ సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకొచ్చింది. సాక్‌నిల్క్ గణాంకాల ప్రకారం తొలి రోజే ఈ చిత్రం సుమారు రూ.25.75 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. రెండో రోజు రూ.32 కోట్లు, మూడో రోజు రూ.36 కోట్లు రాబట్టింది. దీంతో మూడు రోజుల్లోనే భారత్‌లో రూ.93.75 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.132 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు సమాచారం.
నెమ్మదిగా మొదలై.. భారీ వసూళ్లు
‘హనుమాన్ అంశ్’ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. విశాల్ చతుర్వేది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భక్తిరస ప్రధాన చిత్రం ఆగస్టు 7న విడుదలైంది. తొలివారం కేవలం రూ.1.08 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. రెండో వారంలోనూ రూ.0.40 కోట్లకే పరిమితమైంది. అయితే మూడో వారం నుంచి సినిమా వసూళ్లు జోరు అందుకున్నాయి.
ఇదీ చదవండి: చైనాలో విరిసిన ‘పౌర్ణమి’.. వీడియో వైరల్
మూడో వారంలో రూ.10.40 కోట్లు సాధించిన ఈ చిత్రం.. ఆ తర్వాతి వారాల్లోనూ జోరు కొనసాగించింది. 29వ రోజుకు భారత్‌లో రూ.82.88 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. ఐదో శనివారం ఏకంగా రూ.16.50 కోట్లు, 31వ రోజు రూ.22.75 కోట్లు వసూలు చేసింది. దీంతో 31 రోజుల్లోనే రూ.122.13 కోట్ల నెట్ కలెక్షన్లను అందుకుంది. 32వ రోజు నాటికి ఈ మొత్తం సుమారు రూ.122.53 కోట్లకు చేరినట్లు సాక్‌నిల్క్ తాజా గణాంకాలు చెబుతున్నాయి.
( వినాయకుడు ఫైర్.. దద్దరిల్లిన బిగ్‌బాస్ హౌస్)
ప్రేక్షకుల ఆదరణతో..
‘మిర్జాపూర్: ది మూవీ’ ఫ్రాంచైజీ క్రేజ్‌తో విడుదలైన వెంటనే భారీ ఓపెనింగ్ సాధించింది. మరోవైపు ‘హనుమాన్ అంశ్’ మొదట్లో తక్కువ వసూళ్లు సాధించినప్పటికీ.. ప్రేక్షకుల ఆదరణతో క్రమంగా మంచి వసూళ్లు సాధించింది. ఒక సినిమా ఫ్రాంచైజీ క్రేజ్‌తో తొలి రోజుల్లోనే దుమ్మురేపితే.. మరో సినిమా ప్రేక్షకుల మౌత్ టాక్‌తో నెమ్మదిగా పుంజుకుని భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద విజయానికి ఒక్కో సినిమాది ఒక్కో దారి అని ఈ రెండు చిత్రాలు నిరూపిస్తున్నాయి.


