సిద్ధిపేట: కేసీఆర్ ఫాంహౌస్‌కు వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు యత్నిస్తున్న సమయంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. యాదాద్రి కాంగ్రెస్ నేతలను బీఆర్‌ఎస్ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట, రాళ్ల దాడి జరిగింది. కేసీఆర్ ఎర్రవెల్లి నివాసం ముట్టడికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బయలుదేరడంతో, అప్రమత్తమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి ఎర్రవల్లికి పయనమయ్యారు. కేసీఆర్‌కు మద్దతుగా, రక్షణగా వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బొల్లారం వద్ద భారీగా మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు. ఎర్రవల్లి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండటంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బొల్లారం చౌరస్తా నుండి ఎరవెల్లి వైపు రోడ్డుపై కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నడుచుకుంటూ వెళ్లారు.
ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద బీఆర్‌ఎస్ శ్రేణుల మెరుపు ధర్నా చేపట్టారు. పోలీసుల కళ్లుగప్పి పొలాల్లో, గట్లలో నుంచి కేసీఆర్ మద్దతుగా ఫామ్ హౌస్‌కి బీఆర్‌ఎస్ నాయకులు చేరుకున్నారు. ఫామ్ హౌస్ ఎదుట కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్ నాయకులని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలింలించారు. హకీంపేట్ దాటిన తర్వాత కేటీఆర్ తో పాటు హరీష్ రావు, పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్లకు పోలీసులు తరలించారు. పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై కేటీఆర్, పార్టీ నేతలు బైఠాయించారు. కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను అరెస్టు చేసి వాహనాల్లో తరలిస్తున్న పోలీసులు ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా కనీసం సమాచారం ఇవ్వలేదని నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ గుండాలను, నగర బహిష్కరణ చేసిన రౌడీలను, పోలీసులు దగ్గరుండి కెసిఆర్ ఫామ్ హౌస్ మీదకి పంపుతున్నారు. కానీ, మా ఇంటికి నేను వెళ్తే నాతో పాటు మా పార్టీ సభ్యులను ఆపుతున్నారని కేటీఆర్ ఆరోపించారు.
పోలీసులే దగ్గరుండి కేసీఆర్ ఇంటిపైన దాడికి తోవ చూపిస్తున్నారని, బారికేట్లు పెట్టి మరి కాంగ్రెస్ గుండాలను పంపుతున్నారని కటీఆర్ ఆరోపించారు. పక్క జిల్లాల నుంచి వచ్చిన భారీ జనాలను కూడా కేసీఆర్ గారి ఇంటివరకు పంపిస్తూ మా పార్టీ నేతలను అడ్డుకుంటున్నారని, ఇదేక్కడి న్యాయం? కేసీఆర్‌కు ఏం జరిగినా పూర్తి బాధ్యత ప్రభుత్వం పోలీసు యంత్రాంగమే తీసుకోవాలన్నారు. ఆయన ఇంటిని ముట్టుకుంటే తెలంగాణ అగ్నిగుండం అవుతదని, ఆ తరువాత జరిగే పరిణామాలకి బాధ్యత పూర్తిగా ప్రభుత్వమే వహించాల్సి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. లక్షల మంది రోడ్లపైకి వచ్చి శాంతిభద్రతల సమస్యగా మారకముందే పోలీసులు ప్రభుత్వానికి వంతపడడం ఆపాలని కేటీఆర్ ఆన్నారు. పోలీస్ అధికారులు ఈరోజు కాంగ్రెస్ గుండాలకు దారి చూపించి తప్పుకుంటూ మంటే వదిలిపెట్టేదే లేదని కేటీఆర్ హెచ్చరించారు.


