సౌండ్‌ వద్దు అన్నందుకు మ్యుజీషియన్‌ను కొట్టి చంపేశారు | Manipuri Musician Beaten to Death in Delhi Last moments in cctv | Sakshi
Sakshi News home page

సౌండ్‌ వద్దు అన్నందుకు మ్యుజీషియన్‌ను కొట్టి చంపేశారు

Sep 8 2026 11:58 AM | Updated on Sep 8 2026 12:53 PM

Manipuri Musician Beaten to Death in Delhi Last moments in cctv

ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి బయట జరుగుతున్న గోల, అరుపులపై అభ్యంతరం వ్యక్తం చేసిన 55 ఏళ్ల మణిపురి సంగీత విద్వాంసుడు చోంగ్‌థమ్ విక్రమ్ సింగ్‌ను దారుణంగా కొట్టి చంపారు కొంతమంది దుండగులు. ఇంటి బయట పనిచేస్తున్న డెలివరీ సిబ్బంది, దాబా సిబ్బందితో జరిగిన వివాదం చివరకు దాడికి దారితీసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదైనాయి. ఆగ్నేయ ఢిల్లీలోని సన్‌లైట్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖిలోక్రి వద్ద 17 ఏళ్లుగా ప్రైవేట్ సంగీత ఉపాధ్యాయుడిగా, గిటారిస్ట్‌గా పనిచేస్తున్న చోంగ్‌థమ్ విక్రమ్‌ను కొందరు వ్యక్తులు కొట్టి హత్య చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆగ్నేయ ఢిల్లీలో నిరసనలు  వెల్లువెత్తాయి 

ఆదివారం అర్ధరాత్రి విక్రమ్‌ చెత్త పారవేయడానికి తన మూడవ అంతస్తులోని ఫ్లాట్ నుండి కిందికి వెళ్ళారు. తన ఇంటి వద్ద దాబా కార్మికులు, డెలివరీ బాయ్స్ చేస్తున్న అరుపులు, గోల భరించలేక విక్రమ్ సింగ్ కిందకు వచ్చి గోల చేయ వద్దని కోరారు. ఈ క్రమంలో జరిగిన వివాదంతో రెచ్చిపోయిన ఎనిమిది మంది ఆయనపై దాడికి దిగారు. అపార్ట్‌మెంట్‌లో థర్డ్‌ఫ్లోర్‌దాకా తరుముకుంటూ వచ్చి కారిడార్‌లో దాడి చేశారు.  దీంతో తీవ్రంగా గాయపడిన విక్రమ్‌ను ఆయన కుమారుడు యైఫాబా సమీపంలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన మరణించారు. 

గాయపడిన విక్రమ్‌ను మెట్ల మీదుగా మోసుకెళ్తున్న దృశ్యాలు, దాడి చేసినవారు అక్కడి నుంచి వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డైనాయి. ఈ కేసులో ఏడుగురుని అరెస్టు చేయడంతో పాటు ఒక బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా స్థానిక హోటళ్లలో ఫుడ్ ప్యాకింగ్, డెలివరీ పనులు చేస్తున్నారు. అరెస్టు అయిన వారిని భరత్ కుమార్(19), ప్రమోద్(26), రంజాన్ ఖాన్(22), విజయ్(36), దీపాంశు (21), మోహన్ విశ్వకర్మ(32), మన్ను(26) గా గుర్తించారు.


చోంగ్‌థమ్ విక్రమ్ సింగ్ మణిపూర్‌లో పేరుగాంచిన సంగీత విద్వాంసుడు. ఆయన ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు చోంగ్‌థమ్ ఓంగ్బి కమలా దేవి కుమారుడు. అలాగే భారత్‌కు చెందిన మొదటి బాఫ్టా (BAFTA) అవార్డు పొందిన చిత్ర దర్శకురాలు లక్ష్మీప్రియ దేవికి విక్రమ్ వరుసకు సోదరుడు అవుతారు. ఆయన ఢిల్లీలో ఒక మ్యూజిక్ స్కూల్‌ను కూడా నడుపుతున్నారు. ఈ ఘటన అనంతరం, మణిపురి సమాజ సభ్యులు న్యాయం జరగాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ దాడిలో ప్రమేయం ఉన్న వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. 

ఇదీ చదవండి: సత్య నికేతన్ ఘటనపై హైకోర్టు సీరియస్‌ : యజమాని అరెస్ట్‌

ఈ ఘటన సమయంలో అసలు ఏం జరిగింది? ఇందులో ఎవరి పాత్ర ఎంత ఉంది? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.పోలీస్ డిప్యూటీ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు బాధితుడి కుటుంబాన్ని, కమ్యూనిటీ సభ్యులను కలిసి చట్టపరమైన తగిన చర్యలు తీసుకుంటామని  హామీ ఇచ్చారు.  మరోవైపు సింగ్ మరణంపై సమగ్ర దర్యాప్తు జరపాలని మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: విషాదం : మరికొన్ని గంటల్లో లైవ్‌, దుబాయ్‌లో సింగర్‌ హఠాన్మరణం

హోంమంత్రి, హోం మంత్రిత్వ శాఖపై రాహుల్‌ గాంధీ ఆగ్రహం
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ  చోంగ్‌థమ్ విక్రమ్ సింగ్‌ హత్యను తీవ్రంగా ఖండించారు. విక్రమ్ కుటుంబానికి  ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఢిల్లీలోని  ప్రజల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన  హోంమంత్రి, హోం మంత్రిత్వ శాఖ, ఢిల్లీ పోలీసులు ఏమి చేస్తున్నారని మండి పడ్డారు.  సత్వరమే విచారణజరిపి దోషులను శిక్షించాలని రాహుల్‌ డిమాండ్‌ చేశారు.

ఈ హత్యను మద్యం మత్తులో జరిగిన హింసాత్మక ఘటనగా కొట్టిపారేయకూడదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పవన్ ఖేరా అన్నారు. పెద్ద శబ్దంతో సంగీతం, బహిరంగ గొడవలు, నిబంధనలను పట్టించుకోకపోవడం వంటి వాటిని ఏళ్లుగా సహించడం వల్లే ఈ స్థితికి దారితీసిందన్నారు. ఢిల్లీలోని తన ఇంటి బయట శబ్ద కాలుష్యంపై అభ్యంతరం చెప్పినందుకు సింగ్‌ను కొట్టి చంపారని ఖేరా అన్నారు. ఇటువంటి ప్రవర్తనకు వ్యతిరేకంగా నిబంధనలను స్థిరంగా అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

ఇదీ చదవండి: రీల్‌ స్టంట్‌ : 30 అడుగుల ఎత్తునుంచి డ్యామ్‌లోకి..కట్‌ చేస్తే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement