బెంగాల్‌ రాజకీయాల్లో కొత్త సస్పెన్స్‌ | Mamata Banerjee Political Comeback? Bengal Bypolls Trigger Fresh Suspense Over Her Return To Assembly | Sakshi
Sakshi News home page

బెంగాల్‌ రాజకీయాల్లో కొత్త సస్పెన్స్‌

Sep 10 2026 8:22 AM | Updated on Sep 10 2026 9:29 AM

Mamatas Political Comeback: Bengal Bypolls Trigger Fresh Suspense

పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో దారుణ ఓటమి.. దశాబ్దాల తర్వాత బీజేపీ అధికారంలోకి రావడం.. టీఎంసీలో చీలిక.. ఇలా వరుస ఎదురుదెబ్బలతో మమతా బెనర్జీ రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారని అంతా భావిస్తున్న వేళ.. ఆమెకు అనూహ్యంగా మరో అవకాశం తలుపుతట్టింది. అసెంబ్లీ ఉప ఎన్నికలు ఇప్పుడు బెంగాల్‌లో కొత్త సస్పెన్స్‌కు తెరతీశాయి. రెండు స్థానాల్లో ఏదైనా ఒకదాని నుంచి దీదీ బరిలోకి దిగి.. మళ్లీ అసెంబ్లీలో అడుగుపెడతారా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మమతా బెనర్జీ అసెంబ్లీలో ఉంటే బీజేపీ, ఇతర ప్రతిపక్షాలను నేరుగా ఎదుర్కోవడంతోపాటు ప్రజా సమస్యలను మరింత బలంగా ప్రస్తావించే అవకాశం ఉంటుందని టీఎంసీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఆమెను నందిగ్రామ్‌ లేదంటే రిజినగర్‌ నుంచి పోటీ చేయించాలనే ఆలోచన పార్టీలో మొదలైనట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్రంలో బలపడటం, టీఎంసీలో చీలికలు–ఫిరాయింపులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో మమత స్వయంగా అసెంబ్లీలోకి రావడం పార్టీకి రాజకీయంగా కీలకమని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే..

2026 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి గెలిచిన సువేందు అధికారి, హుమాయున్‌ కబీర్‌ చెరో స్థానానికి రాజీనామా చేయడంతో నందిగ్రామ్‌, రిజినగర్‌ అసెంబ్లీ సీట్లు ఖాళీ అయ్యాయి. దీంతో ఈ రెండు స్థానాలకు అక్టోబర్‌ 6న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు స్థానాల్లో నందిగ్రామ్‌ మమతకు కొంత అనుకూలమైన ఎంపికగా కనిపిస్తోంది. 2021 ఎన్నికల్లో ఇక్కడ సువేందు అధికారి చేతిలో మమత 1,956 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ సువేందు అధికారి టీఎంసీ అభ్యర్థిపై 9,665 ఓట్ల మెజారిటీ సాధించారు. అయినప్పటికీ మమత స్వయంగా బరిలోకి దిగితే పోటీ స్వరూపం మారే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. 

మరోవైపు ముర్షిదాబాద్‌ జిల్లాలోని రిజినగర్‌లో ముస్లిం ఓటర్లు సుమారు 65 శాతం ఉన్నారు. ఈ సామాజిక సమీకరణం మమతకు అనుకూలంగా మారొచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌కు ఉన్న పాత రాజకీయ బలం దృష్ట్యా రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని టీఎంసీలోని కొందరు నేతలు సూచిస్తున్నారు.

ఈసీ షెడ్యూల్‌ ప్రకారం బుధవారం (సెప్టెంబర్‌ 9) ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడింది. నామినేషన్ల దాఖలుకు సెప్టెంబర్‌ 16 చివరి తేదీ కాగా.. సెప్టెంబర్‌ 17న నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) జరుగుతుంది. సెప్టెంబర్‌ 19 వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అక్టోబర్‌ 6న నందిగ్రామ్‌, రిజినగర్‌ నియోజకవర్గాల్లో పోలింగ్‌ నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 9న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు.

మరో సస్పెన్స్‌!
ఇదిలా ఉండగా, ఉప ఎన్నికల్లో టీఎంసీకి అసలైన గుర్తు(గడ్డి కాడపై రెండు పూలు) దక్కుతుందా? అన్నది మరో కీలక ప్రశ్నగా మారింది. పార్టీ నుంచి విడిపోయిన రితబ్రత బెనర్జీ వర్గం తామే అసలైన టీఎంసీ అని ఇప్పటికే కోర్టుకెక్కింది. అటు ఎన్నికల సంఘంలోనూ అభ్యర్థన దాఖలు చేసుకుంది. అంతేకాదు ఆ రెండు స్థానాల్లోనూ తమ అభ్యర్థులు పోటీ చేస్తారని, పార్టీ గుర్తు తమకే వస్తుందని ఆ వర్గం నేతలు చెబుతున్నారు. అయితే మమతా బెనర్జీ ప్రజల్లోనే ఉన్నారని, ఆమె తరఫున అభ్యర్థి తప్పకుండా పోటీ చేస్తారని టీఎంసీ నేత కునాల్‌ ఘోష్‌ స్పష్టం చేశారు. 

మరోవైపు బీజేపీ కూడా రెండు స్థానాల్లో పోటీకి సిద్ధమవుతోంది. మమత రెండు చోట్ల పోటీ చేసినా మరోసారి ఓడించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బీజేపీ నేత సజల్‌ ఘోష్‌ వ్యాఖ్యానించారు. దీంతో ఉప ఎన్నికలు కేవలం రెండు స్థానాల పోరుగా కాకుండా.. మమతా బెనర్జీ రాజకీయంగా మళ్లీ అసెంబ్లీలోకి వస్తారా? టీఎంసీపై ఆమె పట్టు ఎంతవరకు ఉంది? పార్టీ గుర్తు ఎవరికి దక్కుతుంది? అనే మూడు కీలక ప్రశ్నలకు సమాధానం చెప్పే ఎన్నికలుగా మారే అవకాశం కనిపిస్తోంది.

ఇదీ చదవండి: పేరుతోనే అసలు విషయం చెప్పేసిన విజయ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement