ఒకప్పుడు బాలీవుడ్ చిత్రాల షూటింగ్‌లకు స్వర్గధామంగా నిలిచిన కశ్మీర్.. ఉగ్రవాదం కారణంగా సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఒకనాడు పదికి పైగా థియేటర్లతో సందడిగా కనిపించిన లోయలో చివరకు ఒక్క సినిమా హాలు కూడా లేకుండా పోయింది. థియేటర్లపై ఉగ్రవాదుల బెదిరింపులు, దాడులు, భద్రతా పరిస్థితులు, ప్రభుత్వ ప్రయత్నాలు.. ఇలా ఎన్నో పరిణామాల మధ్య కశ్మీర్‌లో సినిమా ప్రస్థానం ఎలా ఆగిపోయింది? మళ్లీ ఎలా పునరుద్ధరణకు నోచుకుంది?
బాలీవుడ్‌కు కశ్మీర్ అంటే ఇష్టం
కశ్మీర్ అందమైన లోయలు, ప్రకృతి దృశ్యాల కారణంగా 1989 వరకు హిందీ చిత్రాల నిర్మాతలకు అత్యంత ఇష్టమైన షూటింగ్ ప్రాంతంగా ఉండేది. షమ్మీ కపూర్, సైరా బాను నటించిన ‘జంగ్లీ’ (1961) నుంచి సన్నీ డియోల్, అమృతా సింగ్ నటించిన ‘బేతాబ్’ (1983) వరకు అనేక చిత్రాల షూటింగ్‌లు కశ్మీర్‌లోనే జరిగాయి. ఆ సమయంలో లోయలో పదికిపైగా సినిమా థియేటర్లు ఉండేవి. ఒక్క శ్రీనగర్‌లోనే తొమ్మిది థియేటర్లు నడిచేవి.
1989.. ఉగ్రవాదం మొదలై..
1989లో కశ్మీర్‌లో ఉగ్రవాదం మొదలైన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. సినిమా థియేటర్లు, మద్యం దుకాణాలు, ఉగ్రవాదుల లక్ష్యాలుగా మారాయి. 1989 ఆగస్టు 18న ‘అల్లా టైగర్స్’ అనే ఉగ్రవాద సంస్థ కశ్మీర్‌లో సినిమా థియేటర్లు, మద్యం దుకాణాలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. తనను తాను ‘ఎయిర్ మార్షల్ నూర్ ఖాన్’గా చెప్పుకునే ఆ సంస్థ అధినేత ఓ విలేకరుల సమావేశంలో థియేటర్లు, మద్యం దుకాణాలను ‘ఇస్లామిక్ వ్యతిరేకమైనవి’గా పేర్కొంటూ యజమానులను వాటిని మూసివేయాలని హెచ్చరించారు. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే లోయలోని అన్ని సినిమా థియేటర్లు మూతపడ్డాయి.
థియేటర్లకు కొత్త రూపాలు
ఉగ్రవాదం తీవ్రం కావడంతో భద్రతా బలగాలు కొన్ని థియేటర్లను తమ ఆధీనంలోకి తీసుకుని తాత్కాలిక శిబిరాలు, విచారణ కేంద్రాలుగా ఉపయోగించుకున్నాయి. మరికొన్ని థియేటర్లు ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లు, వాణిజ్య కేంద్రాలుగా మారిపోయాయి. సినిమా థియేటర్లు మూతపడిన తర్వాత భారత సైన్యం కొన్ని ప్రాంతాల్లో ప్రజల కోసం వాటిని తిరిగి తెరిచేందుకు ప్రయత్నించింది. బారాముల్లాలోని థిమయ్యా హాల్, పట్టన్‌లోని జోరావర్ హాల్ వంటి చోట్ల బ్యారక్‌లను తొలగించి ప్రజలకు సినిమాలు చూసే అవకాశం కల్పించారు. అయితే ఉగ్రవాదం మరింత పెరగడం, ఆత్మాహుతి దాడులు భద్రతా శిబిరాలను లక్ష్యంగా చేసుకోవడంతో భద్రతా కారణాలతో వాటిని కూడా మూసివేశారు.
1998లో తెరిచారు.. 1999లో భారీ దాడి
1990ల మధ్యకాలంలో థియేటర్లను తిరిగి తెరవడానికి ప్రయత్నాలు జరిగాయి. వడ్డీ లేని రుణాలు అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి థియేటర్ల పునఃప్రారంభాన్ని ప్రోత్సహించింది. 1998-99లో కశ్మీర్‌లో మూడు థియేటర్లు తిరిగి ప్రారంభమయ్యాయి. శ్రీనగర్‌లోని అత్యంత భద్రత కలిగిన బదామీబాగ్ కంటోన్మెంట్‌లో బ్రాడ్‌వే, సివిల్ సెక్రటేరియట్ సమీపంలోని నీలం, నగరం మధ్యలోని రీగల్ థియేటర్లు తెరుచుకున్నాయి. అయితే 1999 సెప్టెంబర్ 24న రీగల్ థియేటర్ పునఃప్రారంభమైన రోజే విషాదం చోటుచేసుకుంది. ‘ప్యార్ కోయీ ఖేల్ నహీ’ సినిమా చూసి బయటకు వస్తున్న ప్రేక్షకులపై ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరారు. ఈ ఘటనలో ఒక పౌరుడు మరణించగా, పలువురు గాయపడ్డారు. అనంతరం రీగల్ థియేటర్ శాశ్వతంగా మూతపడింది. ప్రస్తుతం అక్కడ భారీ షాపింగ్ సెంటర్ నిర్మాణం జరుగుతోంది.
మళ్లీ కశ్మీర్‌లో సినిమా సందడి
బ్రాడ్‌వే, నీలం థియేటర్లు మాత్రం కొనసాగాయి. అయితే ప్రేక్షకుల కొరతతో ఆర్థిక నష్టాలు ఎదురయ్యాయి. బ్రాడ్‌వే 2005లో మూతపడగా, నీలం థియేటర్ 2010 వరకు కొనసాగింది. 2005లో నీలం థియేటర్‌పై కూడా ఆత్మాహుతి దాడి జరిగింది. దీంతో మరోసారి కశ్మీర్ లోయలో ఒక్క సినిమా థియేటర్ కూడా లేకుండా పోయింది. అయితే 2022లో బ్రాడ్‌వే థియేటర్ యజమాని ధర్ కుటుంబం మరోసారి ప్రయత్నించింది. శ్రీనగర్‌లోని కట్టుదిట్టమైన భద్రత ఉన్న శివపోరా ప్రాంతంలో లోయలో తొలి మల్టీప్లెక్స్ ‘ఐనాక్స్’ను ప్రారంభించింది. మూడు స్క్రీన్లు, 520 సీట్ల సామర్థ్యంతో ఉన్న ఈ మల్టీప్లెక్స్ ప్రస్తుతం ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ జమ్మూ అండ్ కశ్మీర్’ కోసం ఎంపికైన చిత్రాల ప్రదర్శనకు కేంద్రంగా మారింది. సెప్టెంబర్ 7 నుంచి 10 వరకు జరుగుతున్న ఈ తొలి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. స్విట్జర్లాండ్ సహా ఇతర దేశాల కంటే ముందే బాలీవుడ్ చిత్రాల షూటింగ్ కశ్మీర్‌లో జరిగేదని చిత్ర పరిశ్రమకు గుర్తుచేయడమే ఫెస్టివల్ ఉద్దేశమని అన్నారు.
ఇది కూడా చదవండి: ‘టచ్ చెయ్ చూద్దాం’.. ఇంజినీర్లకు హనుమంతుని సవాల్!


