బీజేపీ ‘మిషన్‌ 115’.. స్పెషల్‌ ఆపరేషన్‌! | BJP Special Focus On 115 Weak Seats In Uttar Pradesh Ahead Of 2027 Elections, Top Leaders Set For Statewide Review | Sakshi
Sakshi News home page

UP Elections: బీజేపీ ‘మిషన్‌ 115’.. స్పెషల్‌ ఆపరేషన్‌!

Sep 10 2026 7:28 AM | Updated on Sep 10 2026 8:55 AM

BJP Special Focus On Uttar Pradesh Elections

ఉత్తరప్రదేశ్‌లో మరోసారి విజయంపై బీజేపీ దృష్టి

నేరుగా రంగంలోకి దిగుతున్న అగ్ర నాయకత్వం

నేటి నుంచి నితిన్‌ నబిన్, బీఎల్‌ సంతోష్, వినోద్‌ తావ్డే వరుస పర్యటనలు  

సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అధికార బీజేపీ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. గత ఎన్నికల్లో ఓటమి పాలైన స్థానాలతోపాటు తాము బలహీనంగా ఉన్న స్థానాలపై బీజేపీ నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. వచ్చే ఎన్నికల్లో ఆయా స్థానాల్లో కచ్చితంగా గెలుపు బావుట ఎగురవేయాలని నిశ్చయించుకుంది.

ఇందుకోసం నేరుగా కేంద్ర నాయకత్వమే రంగంలోకి దిగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్, జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్‌.సంతోష్, ఉత్తరప్రదేశ్‌ బీజేపీ ఇన్‌చార్జి వినోద్‌ తావ్డేలు రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ సంస్థాగత పరిస్థితి, సామాజిక సమీకరణాలు, ఓడిన సీట్లలో గెలుపు వ్యూహాలపై గురువారం నుంచి వరుసగా సమీక్షలు నిర్వహించనున్నారు.

ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకమైన వ్యూహరచన 
2022 అసెంబ్లీ ఎన్నికలతోపాటు 2024 లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ-కాంగ్రెస్‌ పార్టీలు బలంగా నిలిచిన 115 అసెంబ్లీ నియోజక వర్గాలపై బీజేపీ గురిపెట్టింది. ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తూ ప్రజల్లో పార్టీ ప్రభావాన్ని పెంచే ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. పార్టీ అగ్రనాయకత్వం ఆయా స్థానాల్లో పర్యటించబోతోంది. ఇందులో భాగంగానే నితిన్‌ నబిన్‌ సెప్టెంబర్‌ 12, 13 తేదీల్లో మీరట్‌ నుంచి పశ్చిమ యూపీ పర్యటనను ప్రారంభిస్తారు.

రాష్ట్రంలోని ఆరు కీలక ప్రాంతాల్లో పర్యటిస్తూ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని 71 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీని మరింత బలోపేతం చేయాలని అధిష్టానం నిర్ణయానికి వచ్చింది. తమ కూటమిలోని పార్టీల బలాబలాలను సైతం అంచనా వేయడం, జాట్‌ వర్గాన్ని కలుపుకునేలా వారితో సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకమైన వ్యూహరచన సాగించాలని బీజేపీ పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం. 

బలం పెంచుకోవడానికి ప్రత్యేక బృందాలు 
బీఎల్‌ సంతోష్‌ ఈ నెల 10, 11 తేదీల్లో లక్నోలో అవధ్, కాన్పూర్‌ ప్రాంతాలపై సమీక్ష నిర్వహించనున్నారు. అవధ్‌లో 82, కాన్పూర్‌లో 52 అసెంబ్లీ స్థానాల పరిధిలో పార్టీ పరిస్థితిని ఆయన సమీక్షిస్తారు. ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎంలు కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, బ్రజేశ్‌ పాఠక్‌లతో భేటీ అయ్యే అవకాశం ఉంది. వినోద్‌ తావ్డే ఇప్పటికే యూపీలో ఒక పర్యాయం పర్యటించారు. పార్టీ స్థితిగతులపై క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించారు. ప్రాంతీయంగా బ లం పెంచుకోవడానికి నేతలు, కార్యకర్తలతో కొన్ని బృందాలు ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఆయన మరోసారి రాష్ట్రంలో పర్యటించి సంస్థాగత ఏర్పాట్లను పరిశీలించనున్నారు.

2022లో ఓడిన అసెంబ్లీ స్థానాలు, 2024లో బీజేపీ వెనుకబడిన లోక్‌సభ స్థానాల్లో పార్టీని తిరు గులేని శక్తిగా మార్చడం, బలహీనతలను సరిదిద్దడం, సామాజిక సమీకరణాలను అనుకూలంగా మార్చుకోవడం బీజేపీ ప్రధాన అజెండాగా కనిపిస్తోంది. 2027లో జరిగే ఎన్నికలకు ముందే పార్టీని పూర్తిస్థాయిలో ఎన్నికల వాతావరణంలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే కేంద్ర నాయకత్వం వరుసగా యూపీ పర్యటనలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.  
ఇదీ చదవండి: విజయ్‌ కూటమికి కొత్త పేరు.. తమిళనాట కొత్త లెక్కలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement