విజయ్‌ కూటమికి కొత్త పేరు.. వాళ్లు దూరం.. తమిళనాట కొత్త లెక్కలు! | Vijay Led TVK Alliance Gets New Name, Secular Social Justice Victory Alliance, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

విజయ్‌ కూటమికి కొత్త పేరు.. వాళ్లు దూరం.. తమిళనాట కొత్త లెక్కలు!

Sep 10 2026 7:06 AM | Updated on Sep 10 2026 9:01 AM

Vijay Led TVK Alliance Gets New Name: Secular Social Justice Victory

తమిళనాడు రాజకీయాల్లో కొత్త కూటమి ఆవిర్భవించింది. అధికారంలో ఉన్న తమిళగ వెట్రి కళగం (టీవీకే) నేతృత్వంలోని కూటమికి ‘సెక్యులర్‌ సోషల్‌ జస్టిస్‌ విక్టరీ అలయన్స్‌’గా పేరు ఖరారైంది. ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్‌ అధ్యక్షతన బుధవారం చెన్నైలోని పనైయూర్‌లో జరిగిన సమన్వయ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

సెక్యులర్‌ సోషల్‌ జస్టిస్‌ విక్టరీ కూటమిలో టీవీకేతో పాటు కాంగ్రెస్‌, వీసీకే, ఎండీఎంకే, ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ ఉన్నాయి. కూటమి పేరులోనే మత సామరస్యం, సామాజిక న్యాయం, విజయ్‌ రాజకీయ గుర్తింపు కనిపించేలా రూపొందించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కూటమి నాయకత్వం విజయ్‌దే అని నేతలు స్పష్టం చేశారు.

వీసీకే నేత ఎస్‌ఎస్‌ బాలాజీ మాట్లాడుతూ.. ఈ పేరు విజయ్‌ ఆలోచన నుంచి వచ్చిందని తెలిపారు. బీజేపీ, ‘ఫాసిస్టు శక్తులకు’ వ్యతిరేకంగా కూటమి పనిచేస్తుందనే విషయాన్ని పేరు స్పష్టం చేస్తుందని చెప్పారు. టీవీకే బీజేపీ పట్ల మెతక వైఖరి అవలంబిస్తోందన్న విమర్శలకు కూడా దీనితో స్పష్టత వస్తుందని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌తో విభేదాల్లేవ్‌..
ఇటీవల ‘విజయ్‌ ఫర్‌ పీఎం’ అంటూ టీవీకే వర్గాల్లో వినిపిస్తున్న నినాదాలపై కాంగ్రెస్‌లో అసంతృప్తి వ్యక్తమైన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. అయితే టీఎన్‌సీసీ అధ్యక్షుడు బి.మాణిక్కం ఠాగూర్‌ మాత్రం టీవీకే, కాంగ్రెస్‌ మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని చెప్పారు. సరైన సమయంలో కూటమి ప్రధానమంత్రి అభ్యర్థికి మద్దతు ఇస్తామని తెలిపారు. విజయ్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలనే డిమాండ్లు పెరగడం కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

కూటమి జాతీయ స్థాయిలో ఇండియా బ్లాక్‌లో చేరుతుందా? అనే ప్రశ్నకు వీసీకే నేత బాలాజీ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. టీవీకేకు ప్రస్తుతం ఎంపీలు లేరని, పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం వచ్చిన తర్వాత ఇండియా కూటమిలో చేరే అంశం ఉంటుందని చెప్పారు. దీంతో రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాకుండా భవిష్యత్తులో జాతీయ రాజకీయాల వైపు కూడా విజయ్‌ అడుగులు వేయనున్నారా? అన్న చర్చ మొదలైంది.

వామపక్షాలు మాత్రం దూరం..
కూటమి ఏర్పాటులో మరో కీలక అంశం వామపక్ష పార్టీల గైర్హాజరు. సీపీఐ, సీపీఎం నేతలు సమావేశానికి హాజరు కాలేదు. ప్రభుత్వం ఏర్పాటు సమయంలో టీవీకేకు వామపక్షాలు మద్దతు ఇచ్చినప్పటికీ.. తాజా కూటమి సమావేశానికి మాత్రం దూరంగా ఉన్నాయి. అయితే టీవీకే నేత ఆధవ్‌ అర్జునా కమ్యూనిస్టు పార్టీలు త్వరలోనే కూటమిలో చేరతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే, కూటమి తన రాజకీయ ప్రయాణాన్ని రాబోయే ఉప ఎన్నికలతో ప్రారంభించనుంది.  అభ్యర్థుల ప్రకటన త్వరలో ఉంటుందని నాయకులు తెలిపారు. కూటమి భవిష్యత్‌ నిర్మాణం, కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రామ్‌, స్టీరింగ్‌ కమిటీ వంటి అంశాలపైనా సమావేశంలో చర్చించారు.

టీవీకే 2026 అసెంబ్లీ ఎన్నికల అనంతరం అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది. ఇప్పుడు కాంగ్రెస్‌, వీసీకే, ఎండీఎంకే, ఐయూఎంఎల్‌తో కలిసి అధికార కూటమికి అధికారిక రూపం ఇచ్చింది. మరోవైపు డీఎంకే నేతృత్వంలోని కూటమి, అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటములకు ప్రత్యామ్నాయంగా ఈ కొత్త ఫ్రంట్‌ నిలవనుంది. రాబోయే ఉప ఎన్నికల్లో ఈ మూడు శక్తుల మధ్య పోటీకి ఇది వేదిక కానుంది. 

అయితే విజయ్‌ నేతృత్వంలోని ఈ కూటమి ఎన్నికల కూటమిగానే కొనసాగుతుందా? లేదంటే తమిళనాడు రాజకీయాల్లో దీర్ఘకాలిక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి: గెట్‌ రెడీ ఫర్‌ సీబీఐ రైడ్స్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement