కేరళ: శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో అరవణ, అప్పం ప్రసాదాల పంపిణీలో విజిలెన్స్ అధికారులు భారీ ఆర్థిక వ్యత్యాసాలను గుర్తించారు. ప్రసాదం కొరతగా ఉండటం, అలాగే పాడైన ప్రసాదం పేరుతో నమోదు చేసిన లెక్కలకు వాస్తవ పరిస్థితులకు మధ్య తేడాలు ఉన్నట్లు విజిలెన్స్ విచారణలో తేలిన విషయాలను అధికారులు దేవస్థానం ప్రత్యేక కమిషనర్‌కు చేరవేయగా వాటిని కేరళ హైకోర్టుకు నివేదిక రూపంలో సమర్పించారు.
విజిలెన్స్ అధికారుల వివరాల ప్రకారం.. ప్రసాదం కొరతను చూపించేందుకు పెద్ద మొత్తంలో అరవణ, అప్పం పాడైపోయినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. అయితే, అధికారులు ఉత్పత్తి కేంద్రాన్ని తనిఖీ చేసిన సమయంలో రికార్డుల్లో పేర్కొన్న స్థాయిలో ప్రసాదం ధ్వంసమైనట్లు నిర్ధారించే భౌతిక ఆధారాలు కనిపించలేదని తెలిపారు. దీంతో రికార్డుల్లోని వివరాలపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అరవణకు సంబంధించి మొత్తం 7,594 టిన్లు పాడైపోయినట్లు రికార్డుల్లో నమోదు చేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. వాటి విలువ సుమారు ₹7,59,400గా లెక్కించారు. అయితే, ఇంత పెద్ద మొత్తంలో అరవణ ధ్వంసమై ఉంటే అందుకు సంబంధించిన ఇతర భౌతిక ఆధారాలు ఉత్పత్తి కేంద్రంలో కనిపించాల్సి ఉంటుందని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
అదే విధంగా అప్పం పంపిణీలోనూ లెక్కలకు, వాస్తవ పరిస్థితులకు మధ్య తేడా ఉన్నట్లు విచారణలో తేలింది. సుమారు ₹1,21,365 విలువైన 2,697 అప్పం కవర్లు పాడైపోయినట్లు లేదా ధ్వంసమైనట్లు రికార్డుల్లో నమోదు చేశారు. కానీ, ఉత్పత్తి కేంద్రంలో పరిశీలించిన పరిస్థితులు మాత్రం ఈ గణాంకాలకు భిన్నంగా ఉన్నాయని అధికారులు గుర్తించారు.
ఈ వ్యవహారం 2025 మండల-మకరవిళక్కు యాత్రా సీజన్‌కు సంబంధించినవిగా తెలుస్తోందని అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, ఆ సమయంలో శబరిమలలో అరవణకు తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో భక్తులకు ఒక్కొక్కరికి గరిష్టంగా ఐదు అరవణ టిన్లు మాత్రమే విక్రయించేలా పరిమితి విధించగా, అదే సమయంలో పెద్ద సంఖ్యలో అరవణ పాడైపోయినట్లు రికార్డుల్లో నమోదు కావడం పలు ప్రశ్నలకు దారితీసిందని విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు.
ఆటోమేటెడ్ విధానంలో అరవణ, అప్పం తయారవుతున్నందున సాధారణంగా ఉత్పత్తి సమయంలో పాడయ్యే ప్రసాదం పరిమాణం చాలా తక్కువగా ఉంటుందని అధికారుల పరిశీలనలో తేలింది, అయితే, ఇంత పెద్ద మొత్తంలో అరవణ టిన్లు, అప్పం కవర్లు పాడైనట్లు రికార్డుల్లో నమోదు కావడం సాధారణ పరిస్థితులకు భిన్నంగా ఉందని విజిలెన్స్ అధికారులు అభిప్రాయపడ్డారు. దీంతో ప్రసాదం లెక్కలు, నిల్వ, పంపిణీ విధానాలను అధికారులు మరింతగా పరిశీలించినట్లు సమాచారం.
అయితే, విజిలెన్స్ విచారణలో గుర్తించిన లెక్కల ప్రకారం అరవణ, అప్పం విషయంలో మొత్తం ఆర్థిక వ్యత్యాసం సుమారు ₹8.8 లక్షలుగా అంచనా వేయగా, రికార్డుల్లో చూపించిన ప్రసాదం నిజంగా ధ్వంసమైందా, లేదా ఇష్టానుసారంగా పంపిణీ జరిగిందా అనే అంశంపై మరింత స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో శబరిమల ప్రసాదం తయారీ నుంచి భక్తులకు పంపిణీ చేసే వరకు ప్రతి దశలో లెక్కలను మరింత కట్టుదిట్టంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని విజిలెన్స్ అధికారులు సూచించారు. ప్రసాదం నిల్వ, లెక్కలు, పంపిణీపై అంతర్గత నియంత్రణలను పటిష్టం చేయడంతో పాటు, విచారణలో గుర్తించిన అంశాలపై తదుపరి చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అధికారులు నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.


