‘ఆ ధోరణి ఇంకెప్పుడు మారుతుందో?..’ కంగనా కీలక వ్యాఖ్యలు | Kangana Ranaut On Trisha Row: Why Is She Always Targeted | Sakshi
Sakshi News home page

‘ఆ ధోరణి ఇంకెప్పుడు మారుతుందో?..’ కంగనా కీలక వ్యాఖ్యలు

Sep 8 2026 12:25 PM | Updated on Sep 8 2026 12:32 PM

Kangana Ranaut On Trisha Row: Why Is She Always Targeted

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌, కోలీవుడ్‌ నటి త్రిష కృష్ణన్‌ బంధం గురించి చాలాకాలంగా అక్కడ చర్చ నడుస్తోంది. అయితే ఆమెను ఉద్దేశించి.. నటుడు, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు తమిళనాట రాజకీయ దుమారం రేపాయి. తాజాగా ఆ వ్యవహారంపై సీఎం విజయ్‌ కూడా భగ్గుమన్నారు. మహిళల్ని కించపరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. అయితే ఈ ఎపిసోడ్‌పై నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

మహిళలను కించపరిచేందుకు.. వారి వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్‌ను లక్ష్యంగా చేసుకోవడం ఎప్పటి నుంచో వస్తున్న ధోరణేనని ఆమె వ్యాఖ్యానించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం కంగనా మీడియాతో మాట్లాడారు. మహిళలు ఉద్యోగం చేస్తున్నా, విజయవంతమైనా, నాయకురాలిగా ఉన్నా, అధికార స్థానంలో ఉన్నా.. వారిని కిందకు లాగేందుకు.. ఆమె పరువు, గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రచారం చేయడం మనకు కొత్తేం కాదు. అలాగని ఈ సమస్య భారత్‌కు మాత్రమే పరిమితం కాలేదని.. ప్రపంచమంతటా ఉందని పేర్కొన్నారామె. ఈ క్రమంలోనే త్రిష ఎపిసోడ్‌ను ఆమె ప్రస్తావించారు. 

తమిళనాడులో మొన్న ఏం జరిగిందో అంతా చూశారు. ఎంతో గౌరవనీయమైన నటి ఒక వ్యవహారంలో చిక్కుకున్నారు. ఆ వ్యవహారంలో సంబంధం ఇద్దరి మధ్య ఉంది. కానీ, దూషణలు, వ్యక్తిత్వాన్ని కించపర్చడం మాత్రం మహిళపైనే జరుగుతున్నాయి. ఎందుకలా?” అని కంగనా అన్నారు. ఆ ధోరణి ఇంకెప్పుడు ఆగుతుందని వ్యాఖ్యానించారామె. 

సమాజం తనను తాను ఈ విషయంలో పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని.. మహిళలను మనం ఎలా చూస్తున్నాం? నిజంగా వారిని గౌరవిస్తున్నామా? అనే ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవాలని వ్యాఖ్యానించారు.

ఆగస్టు 3న కావేరీ జలాల వివాదంపై తంజావూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో ఉదయనిధి ప్రసంగిస్తున్న సమయంలో కొందరు త్రిష పేరు ప్రస్తావిస్తూ నినాదాలు చేశారు. దీనికి ఆయన స్పందించిన తీరు వివాదాస్పదమైంది. త్రిషను ఉద్దేశించే ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంపై కేసు నమోదవడంతో ఆగస్టు 4న ఉదయనిధిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు.

అయితే తాను త్రిష పేరును ప్రస్తావించలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఉదయనిధి చెప్పారు. కావేరీ నదిని ఉద్దేశించే తాను ఆ వ్యాఖ్య చేశానని ఆయన వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. త్రిషకు మద్దతుగా పలువురు సినీ ప్రముఖులు, మహిళా నేతలు స్పందించారు. కంగనా కూడా గతంలో ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. బహిరంగంగా అసభ్యకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేయడం ఏ నాగరిక సమాజమూ అంగీకరించదని పేర్కొన్నారు. ఉదయనిధిపై తీసుకున్న చట్టపరమైన చర్యలు మంచి ఉదాహరణగా నిలుస్తాయని వ్యాఖ్యానించారు.

ఇదే వివాదం నేపథ్యంలో తమిళనాడు సీఎం సి. జోసెఫ్‌ విజయ్‌ సోమవారం అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశరు. మహిళలపై వ్యక్తిగత దూషణలు, ద్వంద్వార్థ వ్యాఖ్యలను సహించబోమని స్పష్టం చేశారు. రాజకీయ విమర్శలు చేసుకోవచ్చని, కానీ మహిళలను కించపరిచే వ్యాఖ్యలకు మాత్రం చోటు ఉండకూడదని హెచ్చరించారు. మహిళలపై దూషణలు, వ్యక్తిగత దాడులు కొనసాగితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: అంతా మా ఇష్టం అంటే కుదరదిక్కడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement