వైద్య పరికరాల టెస్టింగ్‌కు 100 శాతం నిధులు | Free Testing Labs Zero Cost Goyal Announces full Govt Funding | Sakshi
Sakshi News home page

వైద్య పరికరాల టెస్టింగ్‌కు 100 శాతం నిధులు

Sep 8 2026 11:58 AM | Updated on Sep 8 2026 12:27 PM

Free Testing Labs Zero Cost Goyal Announces full Govt Funding

దేశీయ వైద్య పరికరాల విభాగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లే దిశగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ కీలక ప్రకటన చేశారు. వైద్య పరికరాల టెస్టింగ్‌ ఎక్విప్‌మెంట్‌ కొనుగోలుకు కేంద్రం వందశాతం నిధులు సమకూర్చేందుకు సిద్ధంగా ఉందని ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రపంచ స్థాయి రోగులకు సేవలందించే విధంగా భారత్‌ను వైద్య కేంద్రంగా తీర్చిదిద్దాలని ఫార్మా, మెడ్‌టెక్‌ పరిశ్రమను కోరారు.

టెస్టింగ్‌ మౌలిక సదుపాయాలు ఏర్పాటు

అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా నాణ్యమైన వైద్య పరికరాలను రూపొందించాల్సిన అవసరం ఉందని గోయల్‌ నొక్కిచెప్పారు. దేశీయంగా కీలక విడిభాగాల తయారీ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, ఈ పరికరాలను అంతర్జాతీయ ప్రమాణాలతో పోల్చి పరీక్షించి, ధ్రువీకరించి, ప్రపంచ కస్టమర్లకు ప్రదర్శించే విధంగా ఉమ్మడి టెస్టింగ్‌ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

బీఐఎస్‌ ద్వారా మద్దతు

భారత ప్రామాణిక సంస్థ (బీఐఎస్‌) ద్వారా ఈ మద్దతు అందించనున్నట్టు మంత్రి వెల్లడించారు. అత్యుత్తమ టెస్టింగ్‌ ఎక్విప్‌మెంట్‌ కోసం వందశాతం వ్యయాన్ని బీఐఎస్‌ భరిస్తుందని చెప్పారు. పరిశ్రమ నుంచి కేవలం డిమాండ్‌ రావాల్సిందేనని, ప్రతిపాదనలతో పనిలేదని, అత్యాధునిక ల్యాబ్‌లను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని హామీ ఇచ్చారు. దేశీయ సంస్థలు సాంకేతిక భాగస్వామ్యాలు, జాయింట్‌ వెంచర్లను ప్రోత్సహించాలని చెప్పారు. అలాగే గ్లోబల్‌ ఇన్నోవేటర్లు, పెద్ద ఫార్మా కంపెనీలను భారత్‌కు ఆహ్వానించాలని కూడా సూచించారు. కొనుగోలుదారులు, విక్రేతల మధ్య మెరుగైన సంబంధాలు నెలకొల్పాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.

అదనంగా, రోగులకు అందించిన సర్వీసులను మరింత సులభతరం చేసేలా ఉత్పత్తులను రూపొందించాల తెలిపారు. సకాలంలో బీమా క్లెయిమ్‌ల చెల్లింపులు జరిగేలా చూడాలని బీమా, హెల్త్‌టెక్‌ కంపెనీలకు గోయల్‌ పిలుపునిచ్చారు. ఈ ప్రకటన దేశీయ మెడ్‌టెక్‌ రంగంలో నాణ్యత ప్రమాణాలను పెంచడంతో పాటు, ఎగుమతుల విస్తరణకు దోహదపడుతుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement