భారత్–జపాన్ స్టార్టప్‌లు, ఇన్వెస్టర్ల అనుసంధానానికి కేంద్ర మంత్రి గోయల్ సూచన
టోక్యో: భారత్–జపాన్ అంకుర సంస్థలను అనుసంధానం చేసేందుకు ’షార్క్ ట్యాంక్’ తరహా సిరీస్‌ను చేయొచ్చని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుుష్ గోయల్ తెలిపారు. తద్వారా ఇరు దేశాల స్టార్టప్‌లను ఇన్వెస్టర్లు, వ్యాపార భాగస్వాములతో కలిపేందుకు వీలవుతుందని పేర్కొన్నారు.
డిజిటల్ కనెక్టివిటీని ఉపయోగించుకుని ఇలాంటి సెషన్లను వర్చువల్‌గా ఏర్పాటు చేయొచ్చని స్టార్టప్‌లతో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో మంత్రి వివరించారు. పెట్టుబడులు, వ్యాపార భాగస్వామ్య అవకాశాలను దక్కించుకునేందుకు వీటి ద్వారా భారత్, జపాన్ స్టార్టప్‌లు ఇరు దేశాల ఇన్వెస్టర్లకు తమ ఐడియాలను వివరించవచ్చని చెప్పారు. తద్వారా ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధాలు కూడా మరింత బలోపేతమవుతాయని తెలిపారు.
భారత్‌తో కలిసి పని చేయాలంటూ జపాన్ వ్యాపార సంస్థలు, స్టార్టప్‌లను మంత్రి ఆహ్వానించారు. రెండు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యం బలోపేతం అయితే సమగ్రాభివృద్ధికి విస్తృత అవకాశాలు లభిస్తాయని గోయల్ చెప్పారు. అలాగే, యూనివర్సిటీలు, ఇన్‌క్యుబేటర్లు, వెంచర్ ఫండ్స్ మధ్య కూడా పరస్పర సహకారం మరింత పెరగాలని పేర్కొన్నారు.


