శామ్‌సంగ్‌కు షాక్‌.. భారీ నష్టపరిహారానికి ఆదేశం | Samsung Ordered Pay 11 6 Million to Swatch Copied Smartwatch Apps | Sakshi
Sakshi News home page

శామ్‌సంగ్‌కు షాక్‌.. భారీ నష్టపరిహారానికి ఆదేశం

Aug 27 2026 8:11 PM | Updated on Aug 27 2026 9:24 PM

Samsung Ordered Pay 11 6 Million to Swatch Copied Smartwatch Apps

శామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌కు భారీ షాక్‌ తగిలింది. ప్రముఖ స్విస్ వాచ్‌ తయారీ సంస్థ స్వాచ్‌ గ్రూప్‌ ఏజీకి శామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ భారీ మొత్తంలో నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. స్వాచ్‌ గ్రూప్‌కు చెందిన బ్రెగ్యూట్, బ్లాంక్‌పెయిన్, ఒమేగా, లాంగిన్స్, టిస్సోట్‌ వంటి లగ్జరీ వాచ్‌ బ్రాండ్ల డిజైన్లను పోలిన స్మార్ట్‌వాచ్‌ వాచ్‌-ఫేస్‌ యాప్‌లను తన గెలాక్సీ యాప్‌ స్టోర్‌లో అందుబాటులో ఉంచినందుకు శామ్‌సంగ్‌ 11.6 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.1.16 కోట్లు) చెల్లించాలని లండన్‌ హైకోర్టు ఆదేశించింది.

ఈ వివాదం 2015 అక్టోబర్‌ నుంచి 2019 ఫిబ్రవరి మధ్య కాలానికి సంబంధించినది. స్వాచ్‌ గ్రూప్‌ వాచ్‌ల డయల్స్‌, డిజైన్లు, ట్రేడ్‌మార్క్‌లను పోలిన డిజిటల్‌ వాచ్‌ ఫేస్‌ యాప్‌లను శామ్‌సంగ్‌ గెలాక్సీ యాప్‌ స్టోర్‌లో థర్డ్‌ పార్టీ డెవలపర్లు అందుబాటులో ఉంచారు. ఈ యాప్‌లు శామ్‌సంగ్‌ స్వయంగా రూపొందించినవి కాకపోయినా, వాటిని యాప్‌ స్టోర్‌లో అనుమతించడం, ప్రదర్శించడం ద్వారా ట్రేడ్‌మార్క్‌ ఉల్లంఘనకు శామ్‌సంగ్‌ బాధ్యత వహించాల్సి ఉంటుందని కోర్టు తేల్చింది.

ఈ కేసులో స్వాచ్‌ గ్రూప్‌ తొలుత సుమారు 170 మిలియన్‌ డాలర్ల  నష్టపరిహారం కోరింది. అయితే శామ్‌సంగ్‌ మాత్రం నష్టం చాలా స్వల్పమని, గరిష్ఠంగా సుమారు 300 డాలర్లు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని వాదించింది. ఈ వాదనను కోర్టు అంగీకరించలేదు. న్యాయమూర్తి మార్కస్‌ స్మిత్‌ ప్రకారం, స్వాచ్‌ బ్రాండ్లను తక్కువ లేదా ఎలాంటి ధర లేకుండా డౌన్‌లోడ్‌ చేసుకునే యాప్‌ల రూపంలో శామ్‌సంగ్‌ యాప్‌ స్టోర్‌లో ప్రదర్శించడం ఆ బ్రాండ్ల విలువకు గణనీయమైన నష్టం కలిగించింది.

మొత్తం నష్టపరిహారంలో సుమారు 10 మిలియన్‌ డాలర్లు శామ్‌సంగ్‌ యాప్‌ స్టోర్‌లో స్వాచ్‌ బ్రాండ్లను ప్రదర్శించడం వల్ల కలిగిన నష్టానికి కేటాయించినట్లు నివేదికలు వెల్లడించాయి. అదనంగా, ఉల్లంఘనకు సంబంధించిన వాచ్‌-ఫేస్‌ యాప్‌లు యూకే, యూరోపియన్‌ యూనియన్‌లో సుమారు 1.6 లక్షల సార్లు డౌన్‌లోడ్‌ అయిన అంశాన్ని కూడా న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారు.

తాజా తీర్పుపై శామ్‌సంగ్‌ స్పందిస్తూ.. కోర్టు నిర్ణయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, అప్పీల్‌తో సహా అన్ని చట్టపరమైన మార్గాలను పరిశీలిస్తామని తెలిపింది. మరోవైపు, శామ్‌సంగ్‌ ఉల్లంఘన తీవ్రతను పదేపదే తగ్గించి చూపేందుకు ప్రయత్నించిందని స్వాచ్‌ గ్రూప్‌ విమర్శించింది. ఇదే 10 స్వాచ్‌ బ్రాండ్లు శామ్‌సంగ్‌పై అమెరికాలో దాఖలు చేసిన ప్రత్యేక కేసు కూడా పెండింగ్‌లో ఉంది.

ఇదీ చదవండి: రూ.22 వేల కోట్ల అప్పులు.. రూ.6.5 కోట్లతో చెల్లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement